డాక్టర్ రెడ్డీస్ లాభం జూమ్
తొలి త్రైమాసికంలో రూ.550 కోట్లు
* ఉత్తర అమెరికా, కొత్త ఉత్పత్తులే
* ఈ భారీ వృద్ధికి కారణం...
* 24 శాతం వృద్ధితో 3,517 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక నికర లాభంలో 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2012-13 తొలి త్రైమాసికంలో రూ. 361 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 550 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికా, రష్యాల్లో అమ్మకాలకు తోడు గతేడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఔషధాలు లాభాలు పెరగడానికి ప్రధాన కారణంగా డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి తెలిపారు.
బుధవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రవర్తి మాట్లాడుతూ గతేడాది తొలి త్రైమాసికం తర్వాత ఉత్తర అమెరికా మార్కెట్లో అనేక కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదయ్యిందన్నారు. మొత్తం ఆదాయంలో 57 శాతం ఉత్తర అమెరికా నుంచే సమకూరుతుండగా, ఈ మూడు నెలల కాలంలో ఆదాయం 51 శాతం పెరిగి రూ. 1,087 కోట్ల నుంచి రూ. 1,646 కోట్లకు చేరింది.
ఈ సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం 24 శాతం పెరిగి రూ. 2,844 కోట్ల నుంచి రూ. 3,517 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధిపై గరిష్టంగా రూ.1,500 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ మూడు నెలల కాలంలో ఇప్పటి వరకు రూ. 390 కోట్లు వ్యయం చేసినట్లు చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద కొత్త ఔషధాలకు సంబంధించి 70 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఎక్కువ అంచనా వేశాం...
విదేశాల్లో మార్కెటింగ్ కోసం గ్లాస్కో స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే)తో కుదుర్చుకున్న ఒప్పందంపై భారీగా అంచనాలు పెట్టుకున్నామని, కాని వాస్తవ రూపం దీనికి భిన్నంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఇండియా వెలుపల అభివృద్ధి చెందిన దేశాల్లో డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన కొన్ని ఔషధాలను విక్రయించడానికి జీఎస్‌కేతో ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. కాని ఈ డీల్ ద్వారా అనుకున్న విధంగా ఆదాయం పెరగలేదని ముఖర్జీ తెలిపారు.
దేశీయంగా 14 శాతం వృద్ధి
ఈ మూడు నెలల కాలంలో దేశీయ అమ్మకాల్లో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. సమీక్షాకాలంలో రూ.349 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది రూ. 400 కోట్లకు చేరాయి. కొన్ని బ్రాండ్స్‌పై అధికంగా దృష్టిసారించడంతో ఈ వృద్ధి సాధ్యమయ్యిందని, ఇందులో కొన్ని ఔషధాలు ఎన్‌ఎల్‌ఈఎం పోర్ట్‌ఫోలియోలో కూడా ఉన్నాయన్నారు. ఈ త్రైమాసికంలో కొత్తగా 4 ఉత్పత్తులను విడుదల చేయగా, 9 ఉత్పత్తులకు సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద ఫైలింగ్ చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.