ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ నికర లాభం సుమారు రెండు శాతం తగ్గి రూ.157 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో ఇది రూ.162 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం రూ.1,269 కోట్ల నుంచి రూ.1,296 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,086 కోట్ల నుంచి రూ.1,095 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన సర్వీసుల వ్యాపార విభాగం పుంజుకుందని, 2 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసిందని సంస్థ సీఈవో వారెన్ హ్యారిస్ తెలిపారు. ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉందని, ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉండగలదని ఆయన వివరించారు.
టాటా పవర్.. ఫర్వాలేదు
టాటాపవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగి రూ.1,093 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,017 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.16,029 కోట్ల నుంచి రూ.16,211 కోట్లకు చేరింది. ‘ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రెన్యువబుల్ వ్యాపారం స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అన్ని విభాగాలు చెప్పుకోతగ్గ మేర పనితీరు చూపించాయి. దీంతో వరుసగా 20వ త్రైమాసికంలోనూ నికర లాభాన్ని నమోదు చేశాం. భారత్‌లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా తమిళనాడులో మేము చెపట్టిన 4.3 గిగావాట్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా.. 2 గిగావాట్ సెల్ తయారీ సెప్టెంబర్ క్వార్టర్‌లో మొదలైంది. వచ్చే నెల చివరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తయారీ పెరగనుంది’ అని టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.
ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!
పూర్తి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్ల మూలధన వ్యయాల ప్రణాళిక ప్రకటించగా.. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.9,100 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ తయారీ, హైడ్రో ప్రాజెక్టులపై తాము చేస్తున్న పెట్టుబడులతో దేశ ఇంధన సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. బీఎస్‌ఈలో టాటా పవర్ 1 శాతం లాభపడి రూ.445 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment