ఫార్మా కంపెనీలకు దేశీయ మార్కెట్ దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ఫార్మా కంపెనీలకు ఉత్తర అమెరికా మార్కెట్ అంతగా కలిసి రాకపోయినా ఆ మేరకు దేశీయ మార్కెట్ ఆదుకుంది. ప్రధాన కంపెనీల ఫలితాలను పరిశీలిస్తే ఆదాయ, నికర లాభాలపై అమెరికా నుంచి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇదే సమయంలో ఊహించని విధంగా దేశీయ మార్కెట్లో ఆదాయం పెరగడం విశేషం.
గత కొన్నేళ్లుగా సింగిల్ డిజిట్‌కి పరిమితమైన దేశీయ ఫార్మా మార్కెట్ వృద్ధి ఈ ఏడాది 12-15 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ త్రైమాసికంలో ఫార్మా ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని, కాని డాలరుతో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉండటంతో రానున్న కాలంలో ఎగుమతుల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల తెలిపారు.
ఈ త్రైమాసికంలో పలు ప్రధాన కంపెనీలు ఈ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేశాయి. సన్ ఫార్మా, సిప్లా, లూపిన్ కంపెనీలు ఈ త్రైమాసిక దేశీయ ఆదాయంలో 20 శాతానికిపైగా వృద్ధిని నమోదు చేస్తే, గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీలు 15 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఉదాహరణకి దేశీయ అతిపెద్ద ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ఈ త్రైమాసికంలో అమెరికా వ్యాపారంలో 15 శాతం వృద్ధిని నమోదు చేస్తే, ఇదే సమయంలో ఇండియా వ్యాపారంలో అత్యధికంగా 21 శాతం వృద్ధిని నమోదు చేసింది.
అలాగే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ కూడా ప్రధాన ఆదాయ వనరైన అమెరికా మార్కెట్లో కేవలం 9 శాతం వృద్ధిని నమోదు చేస్తే దేశీయ మార్కెట్లో 14 శాతం వృద్ధిని సాధించింది. మారిన నిబంధనల వల్ల అమెరికా మార్కెట్లో కొత్త ఉత్పత్తుల అనుమతికి జాప్యం జరుగుతోందని, దీనికి తోడు ధరలపై ఒత్తిడి ఉండటం కూడా అమెరికా వ్యాపార వృద్ధి తగ్గడానికి ప్రధాన కారణంగా డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి ఫలితాల విడుదల సందర్భంగా తెలిపారు.
కానీ ఇదే సమయంలో అరబిందో ఫార్మా ఎగుమతుల వృద్ధి, దేశీయ ఆదాయ వృద్ధి కంటే ఎక్కువగా ఉంది. ఎగుమతుల్లో 32 వృద్ధి నమోదైతే, దేశీయ ఆదాయంలో కేవలం 6 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యింది. సిప్లా అయితే ఎగుమతులు 9 శాతం క్షీణిస్తే, దేశీయ ఆదాయం 20 శాతం మేర పెరిగింది. ఈ త్రైమాసిక ఫలితాలను చూసి దేశీయ ఫార్మా టర్న్ ఎరౌండ్ అయ్యిందని చెప్పలేం కాని, గతంతో పోలిస్తే వృద్ధి బాగుందంటున్నారు జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి.
దాదాపు సగం టర్నోవర్ ఇక్కడి నుంచే...
ప్రస్తుతం దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయం సుమారు రూ. 1.70 లక్షల కోట్లు ఉండగా, అందులో రూ. 90,000 కోట్లు ఎగుమతుల నుంచి వస్తుంటే, రూ. 80,000 కోట్లు దేశీయ మార్కెట్ నుంచి సమకూరాయి. అతిపెద్ద జనాభా కలిగిన దేశీయ జనాభాలో కొనుగోలు శక్తి పెరుగుతుండటంతో దేశీయ ఫార్మా రంగం వేగంగా విస్తరించనుందని ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ తెలిపారు. గత రెండేళ్ల నుంచి దేశీయ ఫార్మా వేగంగా విస్తరిస్తోందని, కానీ ఇదే సమయంలో అమెరికాతో సహా ఇతర యూరప్ దేశాల్లో ఫార్మా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు.