
డాక్టర్ రెడ్డీస్ చేతికి యూసీబీ ఇండియా?
ఒప్పందం విలువ రూ. 845 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ విలీనాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా బెల్జియంకు చెందిన యూసీబీ ఇండియా యూనిట్‌ను సుమారు రూ.845 కోట్లకు కొనుగోలు చేసే విధంగా ఇరు కంపెనీల మధ్య అవగాహన కుదిరినట్లు మార్కెట్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించడానికి ఇరు కంపెనీల ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. కానీ ఈ ఒప్పందంతో నేరుగా సంబంధం ఉన్న వారి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 135 మిలియన్ డాలర్లకు యూసీబీని కొంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కంపెనీ వద్ద ఉన్న మిగులు నిధులను ఉపయోగించనుంది.
గత త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా సుమారు రూ. 2,850 కోట్ల విలువైన నగదు, పెట్టుబడులు ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఈ మధ్య దేశీయ మార్కెట్‌పై దృష్టిసారించిన డాక్టర్ రెడ్డీస్ వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా స్థానికంగా ఉన్న కంపెనీలను కొనుగోలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఎలర్జీ, శ్వాస సంబంధిత వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలను తయారు చేసే యూసీబీ ఇండియా యూనిట్‌ను కొనుగోలు కోసం ఎంచుకుంది. ప్రస్తుతం యూసీబీ కంపెనీలో 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
మంగళవారం బీఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు
ధర సుమారు ఒక శాతం నష్టపోయి
రూ. 3,434 వద్ద ముగిసింది.