డాక్టర్ రెడ్డీస్ కు వెనిజులా దెబ్బ
♦ క్యూ4లో రూ. 431 కోట్ల రైట్ డౌన్
♦ లాభం రూ. 75 కోట్లు, 86% తగ్గుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నికర లాభం 86 శాతం మేర క్షీణించి రూ. 75 కోట్లకు (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) పరిమితమైంది. వెనిజులా దేశంలో మార్కెట్ నుంచి రావాల్సిన మొత్తంలో రూ. 431 కోట్లను సర్దుబాటు చేయడం ఇందుకు కారణం. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 519 కోట్లు. ఇక తాజాగా ఆదాయం సైతం దాదాపు 3 శాతం క్షీణతతో రూ. 3,870 కోట్ల నుంచి రూ. 3,756 కోట్లకు తగ్గింది. వెనిజులాలో ఆ దేశపు కరెన్సీ భారీగా క్షీణించడంతోపాటు అక్కడి ప్రభుత్వ నియంత్రణపరమైన కారణాల వల్ల సుమారు 60 మిలియన్ డాలర్ల మొత్తం నిల్చిపోయిందని, ముందస్తు జాగ్రత్త చర్యగా దీన్ని రైట్ డౌన్ చేశామని గురువార ం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ సీఈవో జీవీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు.
అయితే, సదరు మొత్తం వసూలవడాన్ని బట్టి వెనిజులాలో అందుబాటు ధరల్లో ఔషధాలను అందించడంపై అక్కడి ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని ఆయన వివరించారు. ఇకపై పూర్తిగా నగదు ప్రాతిపదికన లావాదేవీలు జరిపేందుకు రెండు ప్రభుత్వ రంగ సంస్థలతో చర్చిస్తున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ మార్కెట్‌ను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఇక అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) తాఖీదుల దరిమిలా సదరు యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలను మరింతగా మెరుగుపరుస్తున్నామని, ఇప్పటి దాకా దాదాపు సగం ప్రక్రియ పూర్తయ్యిందని ప్రసాద్ చెప్పారు.
వర్ధమాన మార్కెట్లలో తగ్గుదల..
జనరిక్స్‌కు సంబంధించి కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఇంజెక్టబుల్స్ ఊతంతో ఆదాయాలు క్యూ4లో 12 శాతం పెరిగాయి. భారత్‌లో 11 శాతం వృద్ధి నమోదైంది. అయితే, వర్ధమాన మార్కెట్లలో 31%, యూరప్‌లో 18 శాతం క్షీణించింది. కొత్తగా 14 జనరిక్స్ కోసం ఎఫ్‌డీఏకి డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తులు చేసింది. ఇక ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఉత్తర అమెరికాలో 60 శాతం, యూరప్‌లో 2%, భారత్‌లో 10%, మిగతా దేశాల్లో 18% క్షీణించింది. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం జనరిక్స్ ఆదాయాలు వర్ధమాన మార్కెట్లు మినహా (25% డౌన్) భారత్, యూరప్, ఉత్తర అమెరికా 19% వృద్ధి కనపర్చాయి. ర ష్యాలో రూబుల్ మారకం విలువ క్షీణించడం తదితర అంశాలు ఆయా మార్కెట్లలో తగ్గుదలకు కారణమని ప్రసాద్ వివరించారు.
ప్రణాళికలు...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా సుమారు రూ. 1,200 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు ఉంటాయని, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలపై దాదాపు 11-12 శాతం వ్యయాలు చేయనున్నామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి చెప్పారు. మిగులు నిధుల్లో కొంత భాగాన్ని షేర్ల బైబ్యాక్‌కు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మరిన్ని కొత్త ఔషధాలను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
పూర్తి ఆర్థిక సంవత్సరం..: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 15,471 కోట్ల ఆదాయంపై రూ. 2,001 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రిత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ. 14,819 కోట్లు కాగా లాభం రూ. 2,218 కోట్లు. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 20 డివిడెండు ప్రకటించింది. బీఎస్‌ఈలో సంస్థ షేరు 3.65% పెరిగి రూ. 2,973.85 వద్ద ముగిసింది.