నాట్కో ఫార్మా లాభం రూ. 60 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెపటైటిస్ ఔషధ విక్రయాల ఊతంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నాట్కో ఫార్మా నికర లాభం (కన్సాలిడేటెడ్) సుమారు 11% వృద్ధి చెంది రూ. 60 కోట్లకు పెరిగింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 54 కోట్లు. ఇక ఆదాయం రూ. 200 కోట్ల నుంచి రూ. 407 కోట్లకు ఎగిసింది. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 135 కోట్ల నుంచి రూ. 155 కోట్లకు.. ఆదాయం రూ. 825 కోట్ల నుంచి రూ. 1,142 కోట్లకు పెరిగింది.
దేశీ మార్కెట్లో హెపటైటీస్ సి ఔషధాల విక్రయాలు పెరగడం.. ఆదాయ వృద్ధికి దోహదపడిందని కంపెనీ సీఎండీ వీసీ నన్నపనేని తెలిపారు. బీఎస్‌ఈలో గురువారం నాట్కో ఫార్మా షేరు సుమారు 2.38% పెరుగుదలతో రూ. 463.05 వద్ద ముగిసింది.