జీఎంఆర్ నష్టం రూ. 953 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 953 కోట్లకు (కన్సాలిడేటెడ్) పెరిగాయి.. అంతక్రితం క్యూ4లో నష్టం రూ. 892 కోట్లు. ఆదాయం 28% వృద్ధితో రూ. 2,913 కోట్ల నుంచి రూ. 3,737 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఏడాదికి ఆదాయం రూ. 11,088 కోట్ల నుంచి రూ. 13,358 కోట్లకు పెరగ్గా.. నష్టం రూ. 2,733 కోట్ల నుంచి రూ. 2,161 కోట్లకు తగ్గింది.
మెరుగైన విద్యుత్, ఎయిర్‌పోర్టు విభాగాలు
నియంత్రణపరమైన సమస్యలు తొలగడం, నిర్వహణ మార్జిన్ల పెరుగుదలతో విద్యుత్ వ్యాపార విభాగం, ట్రాఫిక్ జోరు కారణంగా విమానాశ్రయాల విభాగం మెరుగుపడటంతో పూర్తి ఏడాదికి నష్టాలు తగ్గించుకోగలిగినట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా తెలిపింది. ఎయిర్‌పోర్ట్స్ విభాగం ఆదాయాలు రూ. 1,438 కోట్ల నుంచి రూ. 1,831 కోట్లకు, విద్యుత్ వ్యాపారం రూ. 1,174 కోట్ల నుంచి రూ. 1,508 కోట్లకు, ఈపీసీ వ్యాపారం రూ.46 కోట్ల నుంచి రూ.316 కోట్లకు పెరిగాయి. అయితే చత్తీస్‌గఢ్, రాజమండ్రి విద్యుత్ ప్లాంట్లలో కార్యకలాపాలతో వడ్డీ వ్యయాలు రూ. 485 కోట్లు పెరిగి గతేడాదికి మొత్తం వడ్డీ రూ. 4,058 కోట్లకు చేరినట్లు సంస్థ పేర్కొంది.