8,600 నుంచి దిగొచ్చిన నిఫ్టీ
ముంబై : స్వల్ప లాభాలతో ప్రారంభమైన మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే నాటికి నష్టాల బాట పట్టాయి. నిన్నటి ట్రేడింగ్లో 8600 మార్కును అధిగమించిన నిఫ్టీ, నేటి ట్రేడింగ్లో 45 పాయింట్లు దిగొచ్చి, 8,590.65వద్ద ముగిసింది. సెన్సెక్స్ 118.82 పాయింట్లు నష్టపోయి 27,976.52గా నమోదైంది. యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్&టీ మార్కెట్లో టాప్ గెయినర్లుగా ఉండగా..డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హీరో మోటార్ కార్పొరేషన్, కొటక్ మహింద్రా బ్యాంకు, అరబిందో ఫార్మా, కోల్ ఇండియా, ఓఎన్జీసీలు నష్టాలను గడించాయి.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దాదాపు 5 శాతం మేర పడిపోయి, రూ.3,317గా నమోదైంది. నేడు ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మిస్ చేయడంతో, నిఫ్టీలో రెడ్డీస్ ల్యాబ్స్ భారీగా పతనమైంది. ఆటో స్టాక్స్, బ్యాంకు స్టాక్స్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో, మార్కెట్లు నష్టాల బాట పట్టినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాంకు నిఫ్టీ 0.9 శాతం పడిపోయింది.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.08 పైసలు బలపడి, 67.28గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా.ల పుత్తడి ధర స్వల్పంగా పడిపోయింది. 15 రూపాయల నష్టంతో రూ.30,892గా రికార్డు అయింది.