దివీస్‌కు మరోసారి అమెరికా షాక్
⇒ వైజాగ్ యూనిట్‌పై యూఎస్‌ఎఫ్‌డీఏ ఇంపోర్ట్ అలర్ట్
⇒ ఒకేరోజు 20 శాతం పడిన షేరు ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్‌కు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) షాకిచ్చింది. విశాఖపట్నంలోని తయారీ యూనిట్‌పై ఇంపోర్ట్ అలర్ట్ విధించింది. దీని ప్రకారం ఈ ప్లాంటులో తయారైన ఉత్పత్తులను యూఎస్ విపణికి ఎగుమతి చేయడానికి వీల్లేదు. కొన్ని ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ మినహాయింపు ఇచ్చినట్టు కంపెనీ బీఎస్‌ఈకి వెల్లడించింది. వీటిలో లెవెటిరాసెటమ్, గాబాపెంటిన్, లామోట్రిజిన్, కాపెసిటబిన్, నాప్రోక్సెన్, రాల్టెగ్రావిర్, అటోవాక్వోన్ తదితర 10 రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. నిషేధం ఉన్న ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఫార్మా రంగ నిపుణుడొకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూనిట్‌పైనే ఇంపోర్ట్ అలర్ట్ విధించడం కంపెనీకి ఊహించని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.
వైజాగ్ యూనిట్ కీలకం..
కంపెనీకి హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలో యూనిట్ ఉంది. దివీస్ విక్రయాల్లో ఈ యూనిట్ 60–65 శాతం సమకూరుస్తోందని తెలుస్తోంది. అలాగే యూఎస్ అమ్మకాల్లో 20 శాతం అందిస్తోంది. 2016 నవంబర్ 29–డిసెంబర్ 6 మధ్య వైజాగ్ యూనిట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఎఫ్‌డీఏ పలు లోపాలను ఎత్తిచూపింది. ఎఫ్‌డీఏ లేవనెత్తిన లోపాలను సరిదిద్దేందుకు స్వతంత్ర నిపుణులతో కలసి పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, ఇంపోర్ట్ అలర్ట్ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో దివీస్ షేరు ధర మంగళవారం 20 శాతం పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఒక్కో షేరు రూ.156 నష్టపోయి రూ.634.35 వద్ద ముగిసింది.