దివిస్ ల్యాబ్స్‌కు అమెరికా వార్నింగ్
► లోపాలను సవరించకుంటే తీవ్ర పరిణామాలు: యూఎస్‌ఎఫ్‌డీఏ
► కొత్త ఉత్పత్తుల నమోదు నిలిపివేస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్‌ను యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరించింది. విశాఖపట్నం యూనిట్–2 ల్యాబ్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తమై ఉన్న సమాచారం మార్పు, తొలగింపును అడ్డుకునే కనీస నియంత్రణలు లేవన్న విషయం తమ తనిఖీల్లో తేలినట్లు కంపెనీకి పంపిన వార్నింగ్ లెటర్‌లో ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. భద్రమైన, ప్రభావవంతమైన, నాణ్యతకు మద్ధతు తెలిపే ఖచ్చితమైన, సమగ్రమైన సమాచార వ్యవస్థ కంపెనీ వద్ద లేదని వెల్లడించింది. కంపెనీ అనుసరించిన తీరు అత్యుత్తమ తయారీ విధానానికి అనుగుణంగా లేదని, ప్లాంటులో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లలో కల్తీకి ఆస్కారం ఉందని ఆక్షేపించింది. పరీక్షా విధానం నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా సాంకేతికంగా పటిష్టంగా ఉందనడానికి ఆస్కారం లేదని తెలిపింది. తనిఖీల సమయంలో ఎఫ్‌డీఏ అధికారులకు కంపెనీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని, ఇది నిబంధనలను అతిక్రమించడమేనని తన లేఖలో వివరించింది.
అడ్డుకట్ట వేస్తాం...
సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈ మేరకు కంపెనీని యూఎస్‌ఎఫ్‌డీఏ ఆదేశించింది. ఔషధాల నాణ్యతపై లోపాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలపాలని సూచించింది. సమాచార సమగ్రత లోపించిన ఔషధాలతో రోగులపై ఎటువంటి ముప్పు ఉంటుందో కూడా తెలపాలని ఆదేశించింది. లోపాల సవరణకు కంపెనీ యాజమాన్యం చేపట్టబోయే వ్యూహం ఏమిటో వెల్లడించాలని తెలిపింది. లోపాల సవరణ పూర్తి అయి, నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని నిర్ధారించేంత వరకు కొత్త దరఖాస్తులు, సప్లిమెంట్ నమోదును ఎఫ్‌డీఏ నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. లోపాలను సవరించుకోనట్టయితే యూనిట్–2లో తయారైన ఉత్పత్తుల నమోదును అడ్డుకుంటామని హెచ్చరించింది. యూనిట్–2లో 2016 నవంబరు 29–డిసెంబరు 6 మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.