ఏ నేలలో ఏ పంట వేయాలి..ఎంత మోతాదులో ఎరువులు వాడాలి.. తదితర విషయాలు తెలుసుకునేందుకు రైతులు విధిగా మట్టి పరీక్షలు చేయించాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ ఇందుకోసం మట్టి నమూనాలు సేకరించి తీసుకెళ్లినా పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. స్థానికంగానే పరీక్షలు చేసేందుకు ప్రతీ క్లస్టర్‌కు మినీ భూసార పరీక్ష కిట్లను గతేడాది ప్రభుత్వం అందజేసింది. అయితే ఇవి అటకెక్కాయి. దీంతో రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలు కవర్లలోనే మూలుగుతున్నాయి. దీంతో భూసార పరీక్ష ఫలితాలు అందక రైతులు వారికి తోచిన పంటలు సాగు చేస్తూ నష్టపోతున్నారు.
తలమడుగు(బోథ్): జిల్లాలోని 18 మండలాలకు 91 యూనిట్లు మంజూరయ్యాయి. క్లస్టర్‌కు ఒక్కటి చొప్పున మండలానికి నాలుగు నుంచి ఆరు వరకు మినీ భూసార పరీక్ష కిట్లను గతేడాదే ఏఈవోలకు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్న వాటిని ఇప్పటివరకు ఉపయోగించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం హడావుడిగా భూసార పరీక్ష కిట్లను అందించినా ఈ కేంద్రాలకు అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యం, ప్రత్యేక గదులు, లేబర్, ఫర్నిచర్ తదితర వసతులు కల్పించాల్సి ఉంది.
కానీ కిట్లు మాత్రమే ఇచ్చి సౌకర్యాలు కల్పించకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో గ్రామాల్లో కిట్లు నిరుపయోగంగా మారాయి. జిల్లాలో కేవలం12 చోట్ల మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగతా గ్రామాల్లో ఇప్పటి వరకు వీటిని కనీసం తెరిచి చూడలేదు. కొన్ని మండలాల్లో వ్యవసాయశాఖ కార్యాలయంలో మూలనపడేశారు. దీంతో కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.
పరీక్షలు వట్టివే..
గ్రామాల్లో పంట పొలాల నుంచి సేకరించిన మట్టిని ల్యాబ్‌లో పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ మేరకు సారం ఉంది. సారం లేని భూముల్లో ఏ మేరకు ఏయే ఎరువులు ఎంతమేరకు వాడాలి. ఏ పంటలకు అనుకులంగా ఉంటుంది..అనే విషయాలను రైతులకు తెలియజేయాలి. ఈ విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యతను మండల వ్యవసాయ విస్తరణాధికారులకు (ఏఈఓ) ప్రభుత్వం అప్పగించింది. 5వేల ఎకరాల సాగు భూమికి ఒక విస్తరణాధికారిని నియమించింది.
జిల్లాలో మొత్తం 2లక్షల 10 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నది 101 మంది. ఏఈవోలకు గతంలోనే భూసార పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. వీరు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు రైతులకు అందించాలి. కార్డులో భూమి సంబం«ధించిన వివరాలు నమోదు చేయాలి. వివరాల ఆధారంగా ఎరువులు ఎంత మొత్తంలో వాడాలో తెలుస్తుంది. కానీ గ్రామాల్లో ఎక్కడా పరీక్షలే చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ రైతు పొలంలో భూసార పరీక్షలు
గతంలో మెట్ట ప్రాంతమైతే 25 ఎకరాలు తడి భూమిలో అయితే 6.25 ఎకరాలకు ఒక నమునాను సేకరించి భూసార పరీక్షలు నిర్వహించేవారు. కాగా ఇక నుంచి ప్రతీ రైతు పొలంలో భూసార పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో క్లస్టర్ పరిధిలోని ఒక ఏఈవోకు భూసార పరీక్ష కిట్‌ను అందించారు. పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకూ భూసార కార్డులు అందజేయాల్సి ఉంది.
వసతులు కరువు..
వ్యవసాయ విస్తరణ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించడానికి లవణాల లభ్యత(ఎలక్ట్రానిక్ కార్బన్) ఉదజని సూచికలను గుర్తించాలి. అంటే నైట్రోజన్, భాస్వరం, పొటాష్‌ల శాతం పొలంలో ఏ మేరకు ఉన్నాయో పరీక్షల ద్వారా తేల్చాలి. పరీక్షలు చేయడానికి కార్యాలయంలో విద్యుత్, నీటి, వసతి కల్పించాలి. ప్రభుత్వం వసతులు కల్పించడంతో పాటు కనీసం టేబుల్, కుర్చీలు, గ్రామంలో ఒక గది ఏర్పాటు చేయాలి.
కానీ అవేమి లేకుండానే మట్టి పరీక్షలు చేసి రైతులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని వ్యవసాయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 18 మండలాల్లో మట్టి నమూనా పరీక్షల యూనిట్లు ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారాయి. కొంతమంది ఏఈవోలకు ఈసీ పరీక్షలు చేస్తే పీహెచ్ పరీక్షలు రాకపోవడం, పీహెచ్ పరీక్షలు వచ్చిన వారికి ఈసీ పరీక్షలు చేయరాకపోవడంతో మట్టి నమునా పరీక్షలు పూర్తిస్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది.
సౌకర్యాలు కరువు..
భీంపూర్ మండలం కొత్తగా ఏర్పడింది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకే అద్దె భవనాలు దొరకడం లేదు. ఇక తాంసి కార్యాలయంలో విద్యుత్, నీటి సౌకర్యం లేదు. తలమడుగు మండలంలో 6 కిట్లు అందజేశారు. వీటిలో ఎక్కడా సౌకర్యాలు లేకపోవడంతో కిట్లను వ్యవసాయ కార్యాలయంలో నిరుపయోగంగా ఉంచారు. భూసార పరీక్షలు నిర్వహించాలంటే ఒక ప్రత్యేక ల్యాబ్ ఉండాలి. ల్యాబ్‌లో నీటివసతి, సిబ్బంది ఉండాలి. కానీ అవేమి లేకుండా పరీక్షలు నిర్వహించడం ఇబ్బంది అవుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపయోగంలోకి తెస్తాం
జిల్లాలో గతేడాది 91 మినీ భూసార పరీక్ష కిట్లు వచ్చాయి. వాటిని మండలాలకు పంపిణీ చేశాం. సంబంధిత ఏఈవోలు తీసుకొని గ్రామాల్లో యూనిట్లు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, భవనాలు లేక నిరుపయోగంగా మారాయి. వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తాం. భూసార పరీక్షలు చేసే సమయం వచ్చింది కనుక తప్పకుండా అన్ని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. – ఆశాకుమారి, జేడీఏ
Comments
Please login to add a commentAdd a comment