Soil testing
-
పొలం బాట పట్టిన విద్యార్థులు
తెనాలి: తెనాలిలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ) విద్యార్థులు పొలం బాట పట్టారు. గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించారు. తమ విద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన ల్యాబ్‌లో ఆయా నమూనాలకు భూసార పరీక్షలను నిర్వహిస్తారు. ఆ వివరాలతో భూమి ఆరోగ్య కార్డులు సిద్ధం చేస్తారు. సంబంధిత రైతులకు వారి భూమి ఆరోగ్య పరిస్థితులను ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో వెల్లడిస్తారు. విద్యార్థులేంటి.. నేల ఆరోగ్యాన్ని చెప్పడమేంటి! సాధారణంగా మట్టి నమూనాలు సేకరించి.. నేల ఆరోగ్యాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం పని చేస్తుంది. సంబంధిత అధికారులు మట్టి నమూనాలు సేకరించి.. పరీక్షలు జరిపి.. వివరాలు వెల్లడిస్తారు. అందుకు భిన్నంగా కేంద్రీయ విద్యాలయం విద్యార్థులే ఈ పనికి పూనుకున్నారు. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్‌గా పాఠశాలల్లో భూసార మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 కేంద్రీయ విద్యాలయాలను ఎంపిక చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెనాలి కేంద్రీయ విద్యాలయానికి మాత్రమే ఇందులో స్థానం లభించింది. భూసార పరీక్షల నిర్వహణకు విద్యాలయానికి అవసరమైన పరికరాలు, రసాయనాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో ఒకరు ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సహకారంతో వీరు పనిచే సేలా కార్యక్రమాన్ని రూపొందించారు. తెనాలి కేంద్రీయ విద్యాలయంలో 9, 11 తరగతుల విద్యార్థుల్లో 19 మంది ఈ ప్రాజెక్టులో ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. రెండు రోజులుగా తెనాలి మండలంలోని గుడివాడ, నందివెలుగు గ్రామాల్లోని మెట్ట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు. ‘ఆత్మ’ గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ రామాంజనేయులు పర్యవేక్షణలో స్కూల్ నోడల్ అధికారి కేవీ రాజేంద్రప్రసాద్, ఆర్.రామిరెడ్డి సమక్షంలో మొత్తం 52 నమూనాలను సేకరించారు. విద్యాలయంలో ఏర్పాటైన భూసార పరీక్షా కేంద్రంలో వీటికి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అందించిన రెండు యాప్‌ల్లో వివరాలను పొందుపరుస్తారు. తద్వారా రైతుల వారీగా భూమి ఆరోగ్య కార్డులు తయారవుతాయని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అనంతరం ఆయా కార్డులతో సంబంధిత గ్రామ సభలు నిర్వహించి.. రైతుల వారీగా వారి భూమిలో నత్రజని, ఫాస్పరస్, పొటాíÙయం సహా 10 రకాల పోషకాల స్థాయిలను వివరిస్తారు. వ్యవసాయ వికాసానికి.. విద్యార్థులకు వ్యవసాయ విజ్ఞానాన్ని నేర్పించటం, రసాయనాలు అధికంగా వాడకుండా సహజ ఎరువులను వినియోగించేలా రైతులకు సూచిస్తూ భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించటం ఆశయాలుగా కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. కేంద్రీయ విద్యాలయాలను భాగస్వాములను చేసింది. తగిన శిక్షణ ఇవ్వటంతో అమలుకు శ్రీకారం చుట్టాం. – కేవీ రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి ప్రాజెక్టులో చేరటం సంతోషంగా ఉంది చదువుతోపాటు వ్యవసాయంపై అవగాహనకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో చేరటం చాలా సంతోషంగా ఉంది. భూసార పరీక్షలను చేసి రైతులకు ఉపయోగపడతాం. రైతుల కోసం పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. – ఎన్.శివగగన్, 9వ తరగతి -
Fact Check: కళ్లుండీ కబోదిలా
సాక్షి, అమరావతి :తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సామూహిక భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మట్టి నమూనాలను తీసుకుంటూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కచ్చితమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలను నేరుగా రైతుల మొబైల్‌కు పంపిస్తున్నారు. మరోవైపు ప్రతి రైతుకు భూసార కార్డు జారీకి శ్రీకారంచుట్టారు. కళ్లెదుట ఈ వాస్తవాలు కనిపిస్తున్నప్పటికీ కళ్లుండీ కబోదిలా తయారైన రామోజీ వాస్తవాలకు ముసుగేసి బురద రాతలతో ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు. ఆరోపణ: గతంలో పెద్ద ఎత్తున పరీక్షలు.. వాస్తవం: భూసార పరీక్షలు పూర్వం గ్రిడ్ పద్ధతిలో జరిగేవి. 25 ఎకరాల విస్తీర్ణానికో మట్టి నమూనా తీసుకుని దాన్ని విశ్లేషించి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే ఫలితాలతో కూడిన కార్డులిచ్చేవారు. ఇలా సేకరించిన మట్టి నమూనాలతో సంబంధం లేకుండా అశాస్త్రీయ పద్ధతుల్లో ఇష్టానుసారం కార్డులు జారీచేశారు. వీటివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు వాపోయేవారు. తమ పొలాల్లో మట్టినమూనాలు సేకరించి విశ్లేషిస్తే.. ఎలాంటి లోపాలున్నాయో తెలుస్తుందిగానీ, గ్రామంలో ఏదో ఒక మూల నమూనా తీసి విశ్లేషిస్తే ప్రయోజనమేమిటంటూ ఆందోళన చెందేవారు. ఈ విధానంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఆరోపణ: మూడేళ్లుగా భూసార పరీక్షలు అటకెక్కించేశారు వాస్తవం: 25 ఎకరాలకు ఒక నమూనా సేకరణపై రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 2.5 ఎకరాలకు ఒక మట్టి నమూనా తీసుకొని శాస్త్రీయంగా విశ్లేషించాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు 2019–20లో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పైలెట్ ప్రాజెక్టుగా మట్టి నమూనాల పరీక్షలకు శ్రీకారం చుట్టారు. ఆ ఏడాది ఏకంగా 2.26 లక్షల మట్టినమూనాలను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషించి ఫలితాలను రైతులకు తెలియజేశారు. తదనుగుణంగా సూక్ష్మపోషకాలు అందించారు. పైలెట్ ప్రాజెక్టులో మెరుగైన ఫలితాలు రావడంతో 2020–21లో సామూహికంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంతలో కోవిడ్ మహమ్మారి విరుచుకుపడడంతో రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాదేశాల మేరకు భూసార పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఆరోపణ: పరికరాలు, సిబ్బంది కొరత.. వాస్తవం: కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మేరకు 2023–24లో ప్రతి గ్రామంలో ప్రతి రైతుక్షేత్రంలో మట్టినమూనాలు సేకరించి, విశ్లేషించడమే కాకుండా.. ప్రతి రైతుకు భూసార కార్డు జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రైతులను భాగస్వాములను చేస్తూ మూడేళ్లలో 25 లక్షల నమూనాలు పరీక్షించి 25 లక్షల మందికి భూసార కార్డుల జారీ లక్ష్యంతో సామూహిక భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న భూసార పరీక్ష కేంద్రాలను ఆధునికీకరించారు. అవసరమైన పరికరాలను సమకూర్చారు. సిబ్బందిని నియమించారు. ఆరోపణ: సాగు మొదలయ్యాక నమూనాల సేకరణ? వాస్తవం: 2023–24 సీజన్లో రూ.19.82 కోట్ల అంచనా వ్యయంతో 6,37,453 మట్టి నమూనాలు విశ్లేషించి రైతులకు భూసార కార్డులివ్వాలని నిర్ణయించారు. ఆర్బీకే స్థాయిలో అధికారులకు విడతల వారీగా శిక్షణ కూడా ఇచ్చారు. మట్టి నమూనాల సేకరణ కోసం ఏప్రిల్‌లో భూసార వారోత్సవాలు నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో మట్టినమూనాలు సేకరించారు. ఆరోపణ: అంతా మొక్కుబడిగా.. వాస్తవం: వారోత్సవాల్లో 2.60 లక్షల మట్టి నమూనాలను రైతుల సమక్షంలోనే మొబైల్ యాప్ ద్వారా జియో కో ఆర్డినేట్లను పొందుపరిచి మరీ సేకరించారు. క్యూఆర్ కోడ్ టెక్నాలజీని ఉపయోగించి సేకరించిన మట్టి నమూనాల స్థితిని అక్కడికక్కడే తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. కచ్చితమైన జియో కో ఆర్డినేట్లను నమోదు చేయడం ద్వారా మట్టి నమూనాలు ఎక్కడ నుంచి సేకరించారో రాష్ట్ర మ్యాప్ ద్వారా స్పష్టంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. నేల ఆరోగ్యస్థితిని తెలుసుకునేందుకు వీలుగా సాయిల్ ఫెర్టిలిటీ మ్యాప్‌లను రూపొందించారు. ఫలితాలను మొబైల్ యాప్ ద్వారా రైతులకు అందిస్తున్నారు. జియో కో ఆర్డినేట్స్‌తో రైతుల వారీగా భూసార పరీక్ష ఫలితాలను సాయిల్ హెల్త్‌కార్డ్ పోర్టల్‌లో కూడా పొందుపరుస్తున్నారు. ఆరోపణ: సున్నా నుంచి మొదలు పెట్టా ల్సిందే? వాస్తవం: మట్టి నమూనాలను సేకరించడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రతి సీజన్లో ఖరీఫ్–రబీ పంటకాలాలకు ముందు సామూహికంగా మట్టి నమూనాలను సేకరించి భూసార కేంద్రాల్లో విశ్లేషించి కనీసం మూడేళ్లపాటు వర్తించేలా రైతులకు భూసార కార్డులను జారీచేయాలని నిర్ణయించారు. ఈ ఫలితాలు ఆధారంగా.. రసాయనిక ఎరువుల అనవసర, విచక్షణారహిత వినియోగానికి అడ్డుకట్ట వేయడం ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి, నాణ్యమైన పంట దిగుబడి పెంచేలా ఆర్బీకేల ద్వారా అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. -
సాగుభూమిలో సారమెంత?
ఏ నేలలో ఏ పంట వేయాలి..ఎంత మోతాదులో ఎరువులు వాడాలి.. తదితర విషయాలు తెలుసుకునేందుకు రైతులు విధిగా మట్టి పరీక్షలు చేయించాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ ఇందుకోసం మట్టి నమూనాలు సేకరించి తీసుకెళ్లినా పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. స్థానికంగానే పరీక్షలు చేసేందుకు ప్రతీ క్లస్టర్‌కు మినీ భూసార పరీక్ష కిట్లను గతేడాది ప్రభుత్వం అందజేసింది. అయితే ఇవి అటకెక్కాయి. దీంతో రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలు కవర్లలోనే మూలుగుతున్నాయి. దీంతో భూసార పరీక్ష ఫలితాలు అందక రైతులు వారికి తోచిన పంటలు సాగు చేస్తూ నష్టపోతున్నారు. తలమడుగు(బోథ్): జిల్లాలోని 18 మండలాలకు 91 యూనిట్లు మంజూరయ్యాయి. క్లస్టర్‌కు ఒక్కటి చొప్పున మండలానికి నాలుగు నుంచి ఆరు వరకు మినీ భూసార పరీక్ష కిట్లను గతేడాదే ఏఈవోలకు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్న వాటిని ఇప్పటివరకు ఉపయోగించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం హడావుడిగా భూసార పరీక్ష కిట్లను అందించినా ఈ కేంద్రాలకు అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యం, ప్రత్యేక గదులు, లేబర్, ఫర్నిచర్ తదితర వసతులు కల్పించాల్సి ఉంది. కానీ కిట్లు మాత్రమే ఇచ్చి సౌకర్యాలు కల్పించకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో గ్రామాల్లో కిట్లు నిరుపయోగంగా మారాయి. జిల్లాలో కేవలం12 చోట్ల మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగతా గ్రామాల్లో ఇప్పటి వరకు వీటిని కనీసం తెరిచి చూడలేదు. కొన్ని మండలాల్లో వ్యవసాయశాఖ కార్యాలయంలో మూలనపడేశారు. దీంతో కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. పరీక్షలు వట్టివే.. గ్రామాల్లో పంట పొలాల నుంచి సేకరించిన మట్టిని ల్యాబ్‌లో పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ మేరకు సారం ఉంది. సారం లేని భూముల్లో ఏ మేరకు ఏయే ఎరువులు ఎంతమేరకు వాడాలి. ఏ పంటలకు అనుకులంగా ఉంటుంది..అనే విషయాలను రైతులకు తెలియజేయాలి. ఈ విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యతను మండల వ్యవసాయ విస్తరణాధికారులకు (ఏఈఓ) ప్రభుత్వం అప్పగించింది. 5వేల ఎకరాల సాగు భూమికి ఒక విస్తరణాధికారిని నియమించింది. జిల్లాలో మొత్తం 2లక్షల 10 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నది 101 మంది. ఏఈవోలకు గతంలోనే భూసార పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. వీరు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు రైతులకు అందించాలి. కార్డులో భూమి సంబం«ధించిన వివరాలు నమోదు చేయాలి. వివరాల ఆధారంగా ఎరువులు ఎంత మొత్తంలో వాడాలో తెలుస్తుంది. కానీ గ్రామాల్లో ఎక్కడా పరీక్షలే చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రైతు పొలంలో భూసార పరీక్షలు గతంలో మెట్ట ప్రాంతమైతే 25 ఎకరాలు తడి భూమిలో అయితే 6.25 ఎకరాలకు ఒక నమునాను సేకరించి భూసార పరీక్షలు నిర్వహించేవారు. కాగా ఇక నుంచి ప్రతీ రైతు పొలంలో భూసార పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో క్లస్టర్ పరిధిలోని ఒక ఏఈవోకు భూసార పరీక్ష కిట్‌ను అందించారు. పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకూ భూసార కార్డులు అందజేయాల్సి ఉంది. వసతులు కరువు.. వ్యవసాయ విస్తరణ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించడానికి లవణాల లభ్యత(ఎలక్ట్రానిక్ కార్బన్) ఉదజని సూచికలను గుర్తించాలి. అంటే నైట్రోజన్, భాస్వరం, పొటాష్ల శాతం పొలంలో ఏ మేరకు ఉన్నాయో పరీక్షల ద్వారా తేల్చాలి. పరీక్షలు చేయడానికి కార్యాలయంలో విద్యుత్, నీటి, వసతి కల్పించాలి. ప్రభుత్వం వసతులు కల్పించడంతో పాటు కనీసం టేబుల్, కుర్చీలు, గ్రామంలో ఒక గది ఏర్పాటు చేయాలి. కానీ అవేమి లేకుండానే మట్టి పరీక్షలు చేసి రైతులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని వ్యవసాయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 18 మండలాల్లో మట్టి నమూనా పరీక్షల యూనిట్లు ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారాయి. కొంతమంది ఏఈవోలకు ఈసీ పరీక్షలు చేస్తే పీహెచ్ పరీక్షలు రాకపోవడం, పీహెచ్ పరీక్షలు వచ్చిన వారికి ఈసీ పరీక్షలు చేయరాకపోవడంతో మట్టి నమునా పరీక్షలు పూర్తిస్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. సౌకర్యాలు కరువు.. భీంపూర్ మండలం కొత్తగా ఏర్పడింది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకే అద్దె భవనాలు దొరకడం లేదు. ఇక తాంసి కార్యాలయంలో విద్యుత్, నీటి సౌకర్యం లేదు. తలమడుగు మండలంలో 6 కిట్లు అందజేశారు. వీటిలో ఎక్కడా సౌకర్యాలు లేకపోవడంతో కిట్లను వ్యవసాయ కార్యాలయంలో నిరుపయోగంగా ఉంచారు. భూసార పరీక్షలు నిర్వహించాలంటే ఒక ప్రత్యేక ల్యాబ్ ఉండాలి. ల్యాబ్‌లో నీటివసతి, సిబ్బంది ఉండాలి. కానీ అవేమి లేకుండా పరీక్షలు నిర్వహించడం ఇబ్బంది అవుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపయోగంలోకి తెస్తాం జిల్లాలో గతేడాది 91 మినీ భూసార పరీక్ష కిట్లు వచ్చాయి. వాటిని మండలాలకు పంపిణీ చేశాం. సంబంధిత ఏఈవోలు తీసుకొని గ్రామాల్లో యూనిట్లు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, భవనాలు లేక నిరుపయోగంగా మారాయి. వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తాం. భూసార పరీక్షలు చేసే సమయం వచ్చింది కనుక తప్పకుండా అన్ని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. – ఆశాకుమారి, జేడీఏ -
ఇక మండల కేంద్రాల్లోనే భూసార పరీక్షలు
జిల్లాకు చేరిన పది పరికరాలు ఏఈఓలకు పూర్తయిన శిక్షణ జిల్లా కేంద్రానికి వెళ్లే బాధ నుంచి రైతులకు విముక్తి కాళోజీ సెంటర్ : రైతన్నల ముంగిట్లోకే ఇక భూసార పరీక్ష కేంద్రాలు రానున్నాయి. దీంతో మట్టి పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లే ఇబ్బందులు వారికి తప్పనున్నాయి. అయితే ఇంతకాలం వరకు పరీక్షలపై ఆసక్తి చూపని వారు కూడా తమ మండలంలోనే మట్టి నాణ్యతను తెలుసుకునే అవకాశం ఉండడంతో ముందుకొస్తున్నారు. కాగా, జిల్లాకు ప్రభుత్వం పది పరిశోధన పరికరాలను మంజూరు చేసింది. ఈ మేరకు భూసార పరీక్షల నిర్వహణపై ఏఈఓలకు శిక్షణ కూడా పూర్తయింది. నేల స్వభావాన్ని తెలుసుకునేందుకు.. సహజంగా చాలా మంది రైతులు తమతోటి వారు ఎలా సాగు పనులు చేస్తే అలాగే ముందుకు సాగుతుంటారు. గత ఏడాది ఏ పం టకు ఎక్కువ ధర పలికిందో చూసుకుని అదే పంటను మరుసటి సారి వేయాలని నిర్ణయించుకుంటారు. తాము పంటలు పండించే నేల స్వభావం ఎలాంటిదో తెలియకున్నా.. ఫర్టిలైజర్ వ్యాపారులు ఇచ్చిన విత్తనాలు, పురుగు మందులు వినియోగించడం పరిపాటిగా వస్తోంది. దీంతో నేలకు కావాల్సిన సారం అందకపోగా.. అవసరం లేని ఎరువులు, పురుగు మందుల వాడకంతో వట్టిపోతున్నాయి. ఫలితంగా వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టినా ఆశించిన దిగుబడి రావడం లేదు. ఈ నేపథ్యంలో మట్టిలోని సాంద్రత దెబ్బ తినకుండా కాపాడేందుకు ప్రభుత్వం భూసార పరీక్షలు చేయించుకోవాలని రైతులకు కొన్నేళ్లుగా అవగాహన కల్పిస్తోంది. అయితే ఇప్పటివరకు భూసార పరీక్ష కేంద్రాలు జిల్లాలోనే ఉండడంతో రైతులు వాటిపై పెద్దగా ఆసక్తి చూపిం చడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కేంద్రాలను అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు తాజాగా 10 భూసార పరీక్షల పరికరాలను మంజూరు చేసింది. అందుబాటులో పది భూసార పరికరాలు.. వరంగల్ రూరల్ జిల్లాలో సుమారు 1.96 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరంతా ఏటా 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పం టలను సాగుచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల కొత్తగా 38 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)లను జిల్లాకు కేటాయించగా.. ఇటీవల వారు విధుల్లో చేరారు. ఇందులో భాగంగా వారు భూసార పరీక్షలు ఏ విధంగా చేయాలి, వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకునేలా అధికారులు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పదిహేను మండలాలు ఉండగా.. పది భూసార పరీక్షల పరికరాలు రావడం, ఏఈఓలు విధుల్లో చేరడంతో దాదాపు జిల్లా రైతులందరి భూముల భూసార పరీక్షలు నిర్వహించేందుకు వీలు ఏర్పడింది. ఇదే జరిగితే భూసార పరీక్షల నివేదిక ఆధారంగా ఏఈఓలు ఇచ్చే సూచనలతో రైతులు తగిన మోతాదులో మందులు వాడుతూ అధిక దిగుబడిలు సాధించి సాగులో విజయం సాధిస్తారు. -
అరకోటి నిధులు మట్టిపాలు..!
– రైతులకందని భూసార పరీక్ష ఫలితాలు – ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో సాయిల్హెల్త్ కార్డులు – హడావుడే తప్ప.. ఆచరణ శూన్యం కర్నూలు(అగ్రికల్చర్): భూసార పరీక్షలు తప్పనిసరి అంటూ ఊదరగొట్టిన వ్యవసాయ శాఖ.. పరీక్ష ఫలితాలను రైతులకు చేరవేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఖరీఫ్ సీజన్ మొదలై 50 రోజులు గడిచినా ఇప్పటి వరకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయలేదు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 2.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ పంటలు 20 నుంచి 40 రోజుల దశలో ఉన్నాయి. పైర్లలో ప్రస్తుతం పలు సూక్ష్మ పోషక లోపాలు ఉత్పన్నం అవుతున్నాయి. భూమిలో సూక్ష్మ పోషకాలైన∙బోరాన్, జింక్, ఐరన్, మెగ్నీషియంలు ఏ స్థాయిలో ఉన్నాయి.. ఎక్కువగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర విషయాలు భూసార పరీక్షల వల్ల తెలుస్తాయి. సకాలంలో రైతులకు ఈ ఫలితాలు చేరితే పంటల్లో ఏర్పడే పోషక లోపాలను సవరించుకునే అవకాశం ఉంది. ఏరువాక సందర్భంగా అక్కడక్కడ కొంతమందికి భూసార పరీక్ష ఫలితాలకు సంబంధించిన కార్డులను పంపిణీ చేశారు. తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. భూసార పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అరకోటికిపైగా ఖర్చు చేసింది. ఈ నిధులన్నీ మట్టిపాలయ్యాయి. ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో కార్డులు.. ఈ ఏడాది 68,098 మట్టి పరీక్షలు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా తీసుకుంది. ఇందుకోసం 68,535 మట్టి నమూనాలు సేకరించారు. వీటిని కర్నూలు, ఎమ్మిగనూరు, డోన్, నంద్యాలలోని భూసార పరీక్ష కేంద్రాలకు పరీక్షించారు. ఒక మట్టి నమూనా పరీక్షలు చుట్టుపక్కల భూములకూ వర్తిస్తాయి. ఈ ప్రకారం జిల్లాలో 2 లక్షల మంది రైతులకు భూమి ఆరోగ్య స్థితి కార్డులు (సాయిల్ హెల్త్‌కార్డులు) పంపిణీ చేయాల్సి ఉంది. ఈ సారి ఈ కార్డులను ప్రత్యేకంగా ల్యామినేషన్ చేయించి పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు 80 వేల కార్డులు ప్రింటు వేయించి, ల్యామినేషన్ చేయించి వాటిని ఏడీఏలకు పంపారు. అక్కడి నుంచి మండల వ్యవసాయ అధికారులు తీసుకెళ్లి రైతులకు పంపిణీ చేయాల్సింది. భూసార పరీక్షలను ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ శేషారెడ్డి పర్యవేక్షిస్తారు. ఒక్కో కార్డుకు దాదాపు రూ.10 వ్యయం చేసి ముద్రించి ల్యామినేషన్ చేయించారు. అయితే ఇవి ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో మూలకు పడిఉన్నాయి. ఖరీఫ్ మొదలై 50 రోజులు దాటినా మట్టిపరీక్ష ఫలితాలు జిల్లా మొత్తం మీద వెయ్యి మందికి కూడా చేరలేదు. నిధులు వ«థా.. ఒక్క భూసార పరీక్షకు వ్యవసాయ శాఖ రూ.32 ఖర్చు చేస్తుంది. 68,535 మట్టి పరీక్షలకు రూ.21.93 లక్షలు ఖర్చు చేసింది. ఒక పరీక్షకు కూడా మూడు కార్డులు తయారు చేసి రైతులకు పంపిణీ చేయాలి. ఇలా కార్డుల ముద్రణ ల్యామినేషన్‌కు రూ.15 ప్రకారం ఖర్చు చేస్తోంది. ఇందుకోసం రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది. మొత్తంగా భూసార పరీక్షల కోసం జిల్లాలో రూ.51.93 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇంత ఖర్చుపెట్టి పరీక్షలు చేసి, కార్డులు ముద్రించి, ల్యామినేషన్ చేయించిన వాటిని రైతులకు సకాలంలో చేర్చితేనే ఫలితం దక్కినట్లు. అయితే ఇవి రైతులకు చేరడం లేదు. ఈ ఏడాదే కాదు. ప్రతి ఏటా ఇదే తంతు నడుస్తోంది. భూసార పరీక్షలను ప్రభుత్వం చేస్తున్న నిధుల వ్యయం బూడిదలో పోసిన పన్నీరులా అవుతోంది. భూ ఆరోగ్య స్థితి కార్డులు పంపతున్నాం: శేషారెడ్డి, ఏడీఏ ఎమ్మిగనూ, భూసార పరీక్ష కేంద్రం ఈ ఏడాది 68,535 మట్టి పరీక్షలు చేశాం. ఒక పరీక్షకు మూడు కార్డులను ముద్రిస్తున్నాం. ఒక పరీక్షకు మూడు కార్డుల రూపంలో రైతులకు పంపిణీ చేస్తున్నాం. కార్డులు ప్రింట్ తీసి ల్యామినేషన్ చేయించి ఏడీఏలకు పంపుతున్నాం. ఇప్పటి వరకు 82 వేల కార్డులు పంపాం. ఏడీఏల నుంచి ఏఓలు తీసుకెళ్లి రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది.