ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రవీణ్ కుమార్
పత్తి అయినా, మరో పంటైనా.. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా? వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. పత్తి, కూరగాయలు, సోయా, వేరుశనగ.. పంట ఏదైనా సరే.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు(రెయిజ్డ్ బెడ్స్) చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకోవటం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రవీణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఎత్తుమడులపై పత్తిని సాగు చేయటంపై ప్రయోగాలు చేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు.
దుక్కి చేసిన పొలంలో ట్రాక్టర్ ద్వారా ఇలా ఎత్తు మడులు/బోదెలు తోలుకోవాలి
దుక్కి దున్ని, ట్రాక్టర్‌కు అమర్చిన బెడ్ మేకర్ ద్వారా బోదెలు తోలాలి. తగుమాత్రంగా వర్షం పడిన తర్వాత ఆ బెడ్‌పై ఒకే వరుసలో విత్తుకోవాలి. చదునుగా ఉండే పొలంలో సాగు చేసిన పత్తి పంట కంటే బోదెలు తోలి సాగు చేసిన పత్తి పంట మంచి దిగుబడినిచ్చింది.
వర్షం పడిన తర్వాత ఒక వరుసలో పత్తి విత్తనం వేసుకోవాలి
వర్షాలకు అధిక నీరు పొలంలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లిపోవటం వల్ల పత్తి పంట ఉరకెత్త లేదు. గాలి, వెలుతురు మొక్కల మొదళ్లకు బాగా తగలటం వల్ల, ఎత్తు మడిలో మట్టి గుల్లగా ఉండటంతో వేరు వ్యవస్థ బాగా విస్తరించటం వల్ల పంట ఆరోగ్యంగా ఎదిగింది.
ఎత్తు మడులపై ఆరోగ్యంగా పెరుగుతున్న పత్తి పైరు
ఫ్లాట్ బెడ్‌పై విత్తనాలు నాటిన దానితో పోల్చితే అధిక పత్తి దిగుబడులు రావటానికి ఎత్తు మడుల పద్ధతి బాగు ఉపయోగపడిందని డా. ప్రవీణ్ కుమార్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఒక వేళ వర్షాలు తక్కువ పడితే, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చినా కూడా ఎత్తుమడిపై ఉన్న పంట వేరు వ్యవస్థలో తేమ త్వరగా ఆరిపోదు. అందువల్ల బెట్టను తట్టుకునే శక్తి కూడా బోదెలపై నాటిన పంటకు చేకూరుతుంది. ఎత్తు మడులు / బోదెలపై పత్తి పంటను విత్తుకోవటం గురించి తాజా వీడియోను ‘కేవీకే ఆదిలాబాద్’ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు. రైతులు ఆ వీడియోను చూసి అవగాహన పెంచుకోవచ్చు.
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
(చదవండి: జీవన ఎరువుల ప్రయోగశాల)
Comments
Please login to add a commentAdd a comment