నకిలీ విత్తనాలపై నిఘా  | Task Force Police Attack On Fake Seeds Shops Adilabad | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలపై నిఘా 

Published Mon, May 27 2019 8:25 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

Task Force Police Attack On Fake Seeds Shops Adilabad - Sakshi

పట్టుకున్న నకిలీ విత్తనాలు (ఫైల్‌)

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రతీ ఏటా ఖరీఫ్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలు విక్రయించే వారి బెడద ఎక్కువవుతోంది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి. దీంతో నకిలీలతో అన్నదాత బేజారవుతున్నాడు. పలు కంపెనీలకు చెందిన డీలర్లు ఈ విత్తనాలను గ్రామాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారే తప్పా గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు.

దీంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టక ప్రతీ ఏటా రైతులను నట్టేట ముంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నకిలీలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. మండలాలు, డివిజన్, జిల్లాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో తనిఖీలు చేపడుతోంది. అనుమతులు లేని విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది.

జిల్లాలో సాగు వివరాలు...
ఆదిలాబాద్‌ జిల్లాలో 2లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. పత్తి 1లక్షా42వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా, సోయాబీన్‌ 28వేల హెక్టార్లలో, కందులు 25వేల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ఎక్కువ శాతం ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి పంట సాగు చేస్తుండడంతో  కొంతమంది ప్రైవేట్‌ వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరుతో మార్కెట్‌లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. వాటిలో నుంచి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాల డిమాండ్‌ను బట్టి ధర తక్కువ చేసి అమ్ముతున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలను అమాయక గిరిజన రైతులకు విక్రయించడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు.

2017 సంవత్సరంలో జైనథ్, ఆదిలాబాద్, తాంసి మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా వేలాది మంది రైతుల పంట పొలాల్లో పంటలు ఏపుగా పెరిగినప్పటికీ కాయలు కాయకపోవడంతో నష్టాలను చవిచూశారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇటీవల నేరడిగొండ మండల కేంద్రంలో నకిలీ విత్తనాలను ప్యాకెట్లలో ప్యాక్‌ చేస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసులు సైతం నమోదు చేశారు.

మండలానికో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ
ఆదిలాబాద్‌ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. అయితే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మండలానికో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తహసీల్దార్, ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. ఆయా మండల కేంద్రాల్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలు, గోదాంల్లో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో పాటు ట్రాన్స్‌పోర్ట్‌ల వద్ద సైతం కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లాకు సెంట్రల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం వచ్చింది. రైల్వే స్టేషన్, జిన్నింగ్‌ మిల్లులు, గోదాములు, విత్తనాల డీలర్ల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీ బృందాలు వచ్చే విషయం నకిలీలకు ముందే తెలియడంతో ఆ రోజు షాపులు మూసి ఉంచుతున్నారు. దీంతో వారు ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంటుంది.

రశీదు తప్పనిసరి..
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నష్టం వాటిల్లినప్పుడు రశీదు ఉంటేనే ప్రభుత్వం తరపున సాయం అందే వీలుంటుంది. సంబంధిత కంపెనీపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. జిల్లాలో నకిలీ విత్తనాలతో అక్కడక్కడ నష్టపోతున్న అన్నదాతల నుంచి ఫిర్యాదులు అందుతున్నా విచారణ దశకు వచ్చే సరికి కేసు నీరుగారుతోంది. ఇం దుకు ప్రధాన కారణంగా కొనుగోలు దారుల వద్ద ఎలాంటి రశీదు లేకపోవడమే. గ్రామాలకు వచ్చి విత్తనాలను విక్రయించే వారు రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకుండా రైతులకు అంటగడుతున్నా రు. అవగాహన లేమి కారణంగా అన్నదాతలకు నష్టం వాటిల్లుతోంది. విత్తనాల ప్యాకెట్లపై ఎక్కడ తయారు చేశారు, ఎక్కడ ప్యాకింగ్‌ చేశారు, ఎవరు మార్కెట్‌ చేస్తున్నారనే సమాచారంతో పాటు అందులో మొలక శాతం, జెన్యూ స్వచ్ఛత తదితర విషయాలను ముద్రించాలి. అయితే విత్తన కంపెనీలు కొన్ని ఈ నిబంధనలు పాటించకుండా పుట్టగొడుగుల్లా మార్కెట్లోకి వస్తున్నాయి.

స్థానికంగానే తయారీ..
ఇటీవల నేరడిగొండలో స్థానిక విత్తనాలకు రంగులు పూసి ప్యాకింగ్‌ చేస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇలాంటివి జిల్లాలో అక్కడక్కడ జరుగుతున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా పెడితే తప్పా అక్రమాలను అరికట్టడం సాధ్యం కాదు. దీంతోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యేవాటిపై తనిఖీలు ముమ్మరం చేస్తే కొంత వరకైనా రైతులను నకిలీల బెడద నుంచి కాపాడవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేని బీటీ–3, గ్‌లైసిల్, రౌండ్‌ఆ‹ఫ్‌ బీటీ ఇతర రాష్ట్రాల నుంచి ట్రావెల్స్‌ ద్వారా జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. పత్తి విత్తన సంచి ధర రూ.740 ఉండగా, దాదాపు వీరు రూ.600లకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు విత్తనాలు లభించడంతో రైతులు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖాధికారులు పట్టించుకోక పోవడంతో ఈ తతంగం జోరుగా సాగుతోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మంగీలాల్‌ను ఫోన్‌ ద్వారా పలుసార్లు సంప్రదించగా ఆయన స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement