Task Pours
-
నకిలీ విత్తనాలపై నిఘా
ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలు విక్రయించే వారి బెడద ఎక్కువవుతోంది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి. దీంతో నకిలీలతో అన్నదాత బేజారవుతున్నాడు. పలు కంపెనీలకు చెందిన డీలర్లు ఈ విత్తనాలను గ్రామాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారే తప్పా గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టక ప్రతీ ఏటా రైతులను నట్టేట ముంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నకిలీలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. మండలాలు, డివిజన్, జిల్లాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపడుతోంది. అనుమతులు లేని విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో సాగు వివరాలు... ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. పత్తి 1లక్షా42వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా, సోయాబీన్ 28వేల హెక్టార్లలో, కందులు 25వేల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ఎక్కువ శాతం ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట సాగు చేస్తుండడంతో కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరుతో మార్కెట్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. వాటిలో నుంచి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాల డిమాండ్‌ను బట్టి ధర తక్కువ చేసి అమ్ముతున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలను అమాయక గిరిజన రైతులకు విక్రయించడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. 2017 సంవత్సరంలో జైనథ్, ఆదిలాబాద్, తాంసి మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా వేలాది మంది రైతుల పంట పొలాల్లో పంటలు ఏపుగా పెరిగినప్పటికీ కాయలు కాయకపోవడంతో నష్టాలను చవిచూశారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇటీవల నేరడిగొండ మండల కేంద్రంలో నకిలీ విత్తనాలను ప్యాకెట్లలో ప్యాక్ చేస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసులు సైతం నమోదు చేశారు. మండలానికో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. అయితే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మండలానికో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తహసీల్దార్, ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. ఆయా మండల కేంద్రాల్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలు, గోదాంల్లో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో పాటు ట్రాన్స్‌పోర్ట్‌ల వద్ద సైతం కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లాకు సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ బృందం వచ్చింది. రైల్వే స్టేషన్, జిన్నింగ్ మిల్లులు, గోదాములు, విత్తనాల డీలర్ల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీ బృందాలు వచ్చే విషయం నకిలీలకు ముందే తెలియడంతో ఆ రోజు షాపులు మూసి ఉంచుతున్నారు. దీంతో వారు ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంటుంది. రశీదు తప్పనిసరి.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నష్టం వాటిల్లినప్పుడు రశీదు ఉంటేనే ప్రభుత్వం తరపున సాయం అందే వీలుంటుంది. సంబంధిత కంపెనీపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. జిల్లాలో నకిలీ విత్తనాలతో అక్కడక్కడ నష్టపోతున్న అన్నదాతల నుంచి ఫిర్యాదులు అందుతున్నా విచారణ దశకు వచ్చే సరికి కేసు నీరుగారుతోంది. ఇం దుకు ప్రధాన కారణంగా కొనుగోలు దారుల వద్ద ఎలాంటి రశీదు లేకపోవడమే. గ్రామాలకు వచ్చి విత్తనాలను విక్రయించే వారు రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకుండా రైతులకు అంటగడుతున్నా రు. అవగాహన లేమి కారణంగా అన్నదాతలకు నష్టం వాటిల్లుతోంది. విత్తనాల ప్యాకెట్లపై ఎక్కడ తయారు చేశారు, ఎక్కడ ప్యాకింగ్ చేశారు, ఎవరు మార్కెట్ చేస్తున్నారనే సమాచారంతో పాటు అందులో మొలక శాతం, జెన్యూ స్వచ్ఛత తదితర విషయాలను ముద్రించాలి. అయితే విత్తన కంపెనీలు కొన్ని ఈ నిబంధనలు పాటించకుండా పుట్టగొడుగుల్లా మార్కెట్లోకి వస్తున్నాయి. స్థానికంగానే తయారీ.. ఇటీవల నేరడిగొండలో స్థానిక విత్తనాలకు రంగులు పూసి ప్యాకింగ్ చేస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇలాంటివి జిల్లాలో అక్కడక్కడ జరుగుతున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా పెడితే తప్పా అక్రమాలను అరికట్టడం సాధ్యం కాదు. దీంతోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యేవాటిపై తనిఖీలు ముమ్మరం చేస్తే కొంత వరకైనా రైతులను నకిలీల బెడద నుంచి కాపాడవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేని బీటీ–3, గ్లైసిల్, రౌండ్ఆ‹ఫ్ బీటీ ఇతర రాష్ట్రాల నుంచి ట్రావెల్స్ ద్వారా జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. పత్తి విత్తన సంచి ధర రూ.740 ఉండగా, దాదాపు వీరు రూ.600లకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు విత్తనాలు లభించడంతో రైతులు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖాధికారులు పట్టించుకోక పోవడంతో ఈ తతంగం జోరుగా సాగుతోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మంగీలాల్‌ను ఫోన్ ద్వారా పలుసార్లు సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
ఇసుకను కొల్లగొట్టె.. కోట్లు కూడబెట్టె
జిల్లాలో యథేచ్ఛగా ఇసుకాసురుల దందా గోదావరికి గుండెకోత కాలువలు, వాగులనూ వదలని అక్రమార్కులు కోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోని యంత్రాంగం కలెక్టర్ పేరుచెప్పి మరీ దందా సాగిస్తున్న ఓ ఎంపీడీవో టాస్క్‌పోర్స్ :‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు’ అన్న వేమన మాట ఎంతవరకూ నిజమో చెప్పడం కష్టం కావచ్చు కానీ.. ఇసుకను బొక్కి కోట్లాది రూపాయలు కొల్లగొట్టవచ్చని నిరూపిస్తున్నారు అక్రమార్కులు. అధికారం అండతో నాయకులు, వారి అనుచరులు, కొందరు అధికారులు గోదావరి గర్భాన్ని నిలువెల్లా తవ్వేస్తున్నారు. తమ్మిలేరు, జల్లేరు వాగులతోపాటు ఎర్రకాలువ, బైనేరు, తూర్పు, పడమర కాలువల నుంచి సైతం అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలని ఆశపడే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇసుకాసురుల్లో ప్రజాప్రతినిధులతోపాటు కొందరు అధికారులు సైతం ఉన్నారు. తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా బహిరంగంగానే సహజ సంపదను దోచేస్తున్నారు. జిల్లాలో ఇసుక ర్యాంపులు మూతపడటంతో అక్రమ వ్యాపారం ఊపందుకుంది. ప్రజాప్రతినిధుల అండతో అధికార పార్టీ నేతలు కొందరు ఇసుక దందా సాగిస్తున్నారు. గోదావరి తీరంలోని ఆచంట, పెనుగొండ, పెరవలి, యలమంచిలి మండలాలతోపాటు మెట్ట ప్రాంతంలోని దెందులూరు, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి, ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయగూడెం మండలాల్లో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. మెట్ట ప్రాంతానికి చెందిన ఓ ఎంపీడీవో అయితే కలెక్టర్ పేరు చెప్పి బహిరంగంగా తవ్వకాలు, తరలింపు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పంచాయతీల పేరుచెప్పి ఎర్రకాలువ ప్రాంతం నుంచి ఇసుక తరలిస్తున్నారు. ర్యాంపులు మూతపడినా.. జిల్లాలో 22 ఇసుక ర్యాంపులు ఉండగా, పర్యావరణ అనుమతులు లేని కారణంగా అక్టోబర్ 30న మూసివేశారు. కొవ్వూరు మండలంలో గోంగూరతిప్పలంక-1, 2 పేరుతో రెండు ర్యాంపులు నడుస్తున్నా గతనెల 7వ తేదీ నుంచి ఆన్లైన్ బుకింగ్ నిలిపి వేశారు. దీంతో సామాన్యులకు ఇసుక కష్టాలు మొదలయ్యాయి. పోల వరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పారిశ్రామిక వేత్తలు, బడా సంస్థల పేరిట బల్క్ బుకింగ్ ముసుగులో ఈ రెండుచోట్ల అక్రమ వ్యాపారానికి కొందరు పెద్దలు తెరలేపారు. ‘తూర్పు’ వే బిల్లు .. ‘పశ్చిమ’లో తవ్వకం కొవ్వూరు పరిసర ప్రాంతాలకు చెందిన వారు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ర్యాంపునుంచి ఇసుక తెచ్చుకుంటున్నారు. ఉదయం పూట ఆ ర్యాంపు నుం చి ఒక ట్రిప్పు వేసిన వాహనాలపై రాత్రివేళ అదే వే బిల్లుతో కొవ్వూరు ప్రాంతంలో తవ్విన ఇసుకను తరలిస్తున్నారు. జిల్లాలో సాగుతున్న ఇసుక అక్రమ తవ్వ కాలు, రవాణా వ్యవహారం హైకోర్టు మెట్లెక్కింది. ఇక్కడ సాగుతున్న వ్యవహారాలపై జిల్లా అధికారు లకు హైకోర్టు అక్షింతలు వేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా ఉన్నతా ధికారులు అక్రమాల జోలికి వెళ్లడం లేదు. దీనిని అలుసుగా చేసుకుని కొందరు చెలరేగిపోతున్నారు. అక్రమాలివిగో అచంట నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతం, నడిపూడి, పెదమల్లం, కోడేరు, భీమలాపురం ప్రాం తాల్లో అర్ధరాత్రి వేళ ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రెండు యూనిట్ల ఇసుకను రూ.14 వేలకు విక్రయిస్తున్నారు. ఆచంట మండలం అయోధ్యలంక పరిధిలోని పుచ్చల్లంకలో అక్రమ వ్యాపారం జోరుగా సాగిపోతుంది. అయోధ్యలంక, పుచ్చల్లంకు చెందిన టీడీపీ నేతలు అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పెరవలి మండలం కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ఉమ్మిడివారిపాలెం, ఖండవల్లి గ్రామాల్లోనూ అక్రమ వ్యాపారం పెద్దఎత్తున సాగుతోంది. పగటివేళ ఇసుక సేకరించి మూటలు కట్టి ఆటోల్లో తరలిస్తున్నారు. రాత్రివేళ ట్రాక్టర్లలో లోడ్ చేసి బయటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఇక్కడ ఇసుక తవ్వేవారి నుంచి ఓ ప్రజాప్రతినిధి పీఏ ట్రాక్టర్‌కు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. చింతలపూడి మండలంలో తమ్మిలేరు వాగులో క్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా దొడ్డిదారుల్లో తరలించేస్తున్నారు. ట్రక్కు ఇసుకను రూ. 3,800 నుంచి రూ.4,200కు విక్రయిస్తున్నారు. ఇటీవల నాగిరెడ్డిగూడెంలో భారీఎత్తున నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు కనుగొన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఎక్కడి ఇసుకను అక్కడే వదిలేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో మండలస్థాయి టీడీపీ నాయకుల కనుసన్నల్లో రాత్రి సమయాల్లో రవాణా చేస్తున్నారు. జల్లేరు, ఎర్రకాలువ, బైనేరు కాలువల నుంచి గుర్వాయిగూడెం, పంగిడిగూడెం, పేరంపేట, జల్లేరు, బైనేరు, మైసన్నగూడెం తదితర ప్రాంతాల నుంచి రవాణా చేస్తున్నారు. ట్రక్కు ఇసుకను రూ.3వేలకు పైగా విక్రయిస్తున్నారు. కొయ్యలగూడెం మండలంలో ఎర్రకాలువ, బైనేరు పడమటి, తూర్పు కాలువల్లో తవ్వకాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత ట్రక్కులతో ఇసుకను రవాణా చేస్తున్నారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. బుట్టాయగూడెం మండలంలో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఇసుక మాఫియా కొనసాగుతోంది. అల్లికాలువ, జల్లేరు, బైనేరు, కొవ్వాడ కాలువల నుంచి ఇసుక తవ్వి తరలిస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో కొవ్వూరు మండలం సీతంపేట, మద్దూరులంకల్లో రాత్రివేళ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. చిడిపి గ్రామ శివారున గండిపోశమ్మ ఆలయ సమీపంలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి.