సాక్షి, హైదరాబాద్: పత్తి విత్తనంలో జన్యు స్వచ్ఛతకు నిర్వహించే గ్రో ఔట్ టెస్ట్ (జీవోటీ)లపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. జీవోటీ పరీక్షల్లో నాసిరకం విత్తనాలని తేలుతున్నా మార్కెట్లో అవి విచ్చలవిడిగా లభిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జీవోటీ పరీక్షలు, నాసిరకపు విత్తనాలను కట్టడి చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇవే మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయాలంటూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లకు లేఖ రాశారు. ప్రస్తుత నెలలో (జనవరి) పత్తి విత్తన జన్యు స్వచ్ఛత పరీక్షలు నిర్వహించి మార్చి, ఏప్రిల్ నెలల్లో వాటి ఫలితాలు విడుదల చేస్తారు. అందువల్ల ఈ సమయంలోనే మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో 2 కోట్ల ప్యాకెట్ల విత్తనం!
రాష్ట్రంలో పత్తి విత్తన తయారీ అధికంగా జరుగుతోంది. 10–12 ప్రముఖ కంపెనీలు దాదాపు 30 వేలకు పైగా ఎకరాల్లో రైతులతో పంటను పండిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా, ఇతర ప్రాంతాల్లో మోస్తరు స్థాయిలో బీటీ పత్తి విత్తనోత్పత్తి జరుగుతోంది. దాదాపు రెండు కోట్ల ప్యాకెట్ల విత్తనం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుందని అంచనా. దేశానికి అవసరమయ్యే విత్తనంలో దాదాపు పావు వంతు ఇక్కడ్నుంచే వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నా విత్తనోత్పత్తిపై ఎలాంటి నియంత్రణ లేదు. విత్తనం ఉత్పత్తి అయ్యాక దాన్ని విక్రయించే సమయంలో సమస్యలు తలెత్తితే విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటుంది. కానీ విత్తనోత్పత్తి సమయంలో జరిగే అవకతవకల నియంత్రణకు ఎలాంటి నిబంధనల్లేవు. ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలు తయారు చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది బీటీ–2లో నాసిరకం విత్తనాలతోపాటు బీటీ–3 విత్తనాలు కూడా ఇక్కడే తయారయ్యాయి. వీటిలో బీటీ–3 విత్తనాలకు ఎలాంటి అనుమతి లేదు. విత్తనోత్పత్తిలో ఇంత విచ్చలవిడిగా అవకతవకలు జరుగుతున్నా ప్రభుత్వానికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
మార్కెట్‌లోకి వస్తున్నాయిలా..
పత్తి విత్తన కేలండర్ ప్రకారం మే ఒకటో తేదీ నుంచి జూలై 15 వరకు విత్తన సాగు చేస్తారు. సెప్టెంబర్ చివరి నుంచి నవంబర్ మధ్య కాలంలో పత్తి తీత ఉంటుంది. నవంబర్ తొలి వారం నుంచి జనవరి చివరి వరకు జిన్నింగ్ చేస్తారు. జనవరిలోనే నమూనాలు సేకరించి జీవోటీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి, ఏప్రిల్ మధ్య జీవోటీ ఫలితాలు ప్రకటిస్తారు. జీవోటీ పరీక్షల్లో విత్తన సామర్థ్యాన్ని గుర్తించి అది నాసిరకమా కాదా అని తేలుస్తారు. నాసిరకం అని తేలినా వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ మార్గదర్శకాలు ఖరారు చేశారు.
మార్గదర్శకాలివీ..
- విత్తన ధ్రువీకరణ ప్రమాణాల ప్రకారం హైబ్రీడ్ పత్తి విత్తన జన్యు స్వచ్ఛత 90 శాతం ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే వాటిని నాసిరకపు విత్తనంగా పరిగణిస్తారు. అలాంటి విత్తనాలను మార్కెట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశపెట్టకూడదు.
- జీవోటీ పరీక్షల్లో విఫలమైన విత్తనాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయాలి. అవసరమైతే జిల్లా స్థాయిలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలి. నాసిరకపు విత్తనాలని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి.
- జీవోటీ పరీక్షలు సరిగా జరగలేదని భావిస్తే మరోసారి నిర్వహించాలని కోరే హక్కు విత్తనోత్పత్తిదారులకు కల్పించారు. అందుకు తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.
- జీవోటీ పరీక్షల్లో నాసిరకం అని తేలినా మార్కెట్లోకి వస్తే దాన్ని ధ్వంసం చేయాలి. ఆ విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ వద్ద అరగంట పాటు కాల్చి వేయాలి. అప్పుడే అది మొలకెత్తే లక్షణాన్ని కోల్పోతుంది.
- విత్తనోత్పత్తిదారులకు, వ్యాపారులకు మధ్య ఒప్పందం ఉండాలి. దీని ప్రకారం ఎవరు అక్రమాలకు పాల్పడినా అందుకు సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాలి.
- విత్తనోత్పత్తి స్వచ్ఛందంగా ఉండాలి. ఎవరిపైనా ఒత్తిడి చేసి విత్తనోత్పత్తిలో పాల్గొనేలా చేయకూడదు.
- దళారుల ప్రమేయం లేకుండా కంపెనీలే రైతులతో విత్తనోత్పత్తి చేయించాలి.
- పత్తి విత్తనాన్ని జిన్నింగ్ చేసే సమయంలో విచక్షణారహితంగా రసాయనాలు కలుపుతున్నారు. ఇది పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. దీన్ని నిరోధించేందుకు జిన్నింగ్ మిల్లులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment