కారుమంచిలో నకిలీ విత్తనాలు పట్టివేత
కారుమంచిలో నకిలీ విత్తనాలు పట్టివేత
Published Sat, Jun 10 2017 9:29 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
తంగరడోణలో 7లక్షలు విలువ చేసే కంది, పత్తి విత్తనాలు సీజ్
ఆస్పరి: మండలంలోని కారుమంచి, తంగరడోణ గ్రామాల్లో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. నకిలీ, అనుమతి లేకుండా విక్రయిస్తున్న పత్తి, కంది విత్తనాలను గుర్తించి సీజ్ చేశారు. మండలంలోని కారుమంచిలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారంతో ఏఓ పవన్ కుమార్, ఏఈఓలు నాగరాజు, జయరాం, సిబ్బందితో కలిసి కృష్ణ అనే వ్యక్తి ఇంటికెళ్లి తనిఖీలు చేశారు. 14 కేజీల నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి, 1950 పీడీ యాక్ట్ కింద అతడిపై కేసు నమోదు చేశారు. అలాగే తంగరడోణలో పరమేశ్వర్, సీతారామిరెడ్డి ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించి రూ.7లక్షలు విలువ చేసే పత్తి, కంది విత్తనాలను సీజ్ చేసి 1966 సీడ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన విత్తనాలను ఆలూరు ఏడీఏ రాజశేఖర్‌కు అప్పగించినట్లు ఏఓ చెప్పారు. ఎవరైనా గ్రామాల్లో, దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మినా, ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తప్పవని ఏఓ హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని మండల ప్రజలను కోరారు.
Advertisement