ఆదోనిలో ఎరువులు, విత్తనాలు సీజ్
Published Wed, Jun 21 2017 11:43 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
ఆదోని అగ్రికల్చర్: నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న ఎరువులు, విత్తనాలను వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనరేట్ అడిషనల్ డైరెక్టర్ మద్దిలేటి హెచ్చరించారు. బుధవారం ఆదోనిలోని ఎరువులు, విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. ధరల పట్టిక లేకపోవడం, విక్రయించిన బిల్లు బుక్కులో రైతుల సెల్‌ఫోన్ నంబర్ నమోదు చేయకపోవడంతో.. సోమిశెట్టి సుబ్బారావు ఎరువుల దుకాణం యజమానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా, డీఏపీకి లింకు పెట్టి ఇతర మందులు అంటగట్టరాదని సూచించారు.
కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులను ఆయన ఆరాతీశారు. కంపెనీ అనుమతి పత్రం లేకపోవడంతో నిర్మాణ్ ఫర్టిలైజర్ కంపెనీకి చెందిన 126 ఎరువుల బస్తాలను సీజ్ చేశారు. భువనేశ్వరి విత్తన దుకాణంలో రికార్డులు సరిగా లేకపోవడంతో మైక్రో కంపెనీకి చెందిన 252 విత్తన ప్యాకెట్లకు సీజ్ చేశారు. సీజ్ అయిన ఎరువులు, విత్తనాల విలువ రూ.2,73,500 ఉంటుందని ఏడీ తెలిపారు. అనంతరం ఎస్‌వీఎఫ్ దుకాణాన్ని పరిశీలించారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఒకే చోట విక్రయిస్తుండడంతో మండిపడ్డారు. వేర్వేరుగా విక్రయించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడీఏ చంగల్‌రాయుడు, ఏఓ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement