హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ చైన్ థైరోకేర్ టెక్నాలజీస్ చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 8 ల్యాబ్‌లు ఉన్నాయి. 2020 నాటికి వీటి సంఖ్య 60కి చేరుకుంటుందని థైరోకేర్ ఫౌండర్ డాక్టర్ వేలుమణి శుక్రవారమిక్కడ తెలిపారు. విజయవాడ, వైజాగ్‌లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఒక్కో కేంద్రానికి కంపెనీ రూ.4 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 1,000 నగరాలు, పట్టణాల్లో 3,000 ఫ్రాంచైజీల ద్వారా శాంపిల్ కలెక్షన్ సెంటర్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. అతితక్కువ వ్యయానికే సేవలు అందిస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నామని వివరించారు. రోజుకు 3,00,000 పరీక్షలు జరుపుతున్నామని పేర్కొన్నారు.
ఫ్రెషర్లకే ఉద్యోగాలు..
కంపెనీ ఉద్యోగులు 1,200 మంది ఉన్నారు. వీరిలో ఫ్రెషర్లే 98 శాతం అని వేలుమణి చెప్పారు. ‘కంపెనీ ఏర్పాటుకు ముందు 50 ఉద్యోగాలకు ఇంటర్వ్యూకు వెళ్లినా అనుభవం లేదన్న కారణంతో నన్ను రిజెక్ట్ చేశారు. అందుకే ఫ్రెషర్లను మాత్రమే తీసుకోవాలన్న ది మా అభిమతం. రెండేళ్లలో శాంపిల్ కలెక్షన్ కేంద్రా లు మరో 7,000 రానున్నాయి.
ప్రతి కేంద్రం ద్వారా కనీసం 35 మందికి ఉపాధి లభిస్తోంది. ఫ్రాంచైజీల వద్ద 10,000 పైచిలుకు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. 2020 నాటికి రూ.600 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. 5 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment