మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో బాల, బాలికలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ప్రహరీ, ప్రయోగశాలలు, గ్రంథాలయం వంటి సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం ఏటా దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలోనూ కనీసం 70 శాతం సౌకర్యాలు కూడా అందుబాటులోకి రాకపోవడం శోచనీయం. పేద పిల్లలు చదువుతున్న పాఠశాలలు అంటే అధికారులకు అంత చులకన ఎందుకో అనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ప్రైవేటు పాఠశాలల్లో చిన్న సమస్య ఎదురైతే నిలదీసే రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి గురించి ఎక్కడా కూడా నోరు మెదపకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధి పనుల్లో పలువురు రాజకీయ నాయకులే భాగస్వాములు కావడం కూడా నిర్లక్ష్యానికి కొంతమేర కారణమవుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంత మేరకు సౌకర్యాలు కల్పించారో తెలుపుతున్నటువంటి పూర్తి సమాచారంతో జూన్ ఏడో తేదీన హాజరు కావాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది.
జిల్లాలో విద్యావ్యవస్థ
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 3,084, ప్రాథమికోన్నత పాఠశాలలు 444, ఉన్నత పాఠశాలలు 543 ఉన్నాయి. వీటిలో ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు రెండున్నర లక్షల మంది బాల, బాలికలు చదువుకుంటారు.
సౌకర్యాలు
ఇప్పటి వరకు జిల్లాలోని పాఠశాలలకు 10,910 తరగతి గదులు ఉన్నాయి. 1,176 పాఠశాలల్లో మాత్రమే ఫర్నిచర్ ఉంది. 2,769 మరుగుదొడ్లు బాలురకు, 3,813 మరుగుదొడ్లు బాలికలకు, 960 పాఠశాలల్లో బాలురకు తాగునీరు, 1,132 పాఠశాలల్లో బాలికలకు తాగునీరు, బాలురకు 2,012 మూత్రశాలలు, బాలికలకు 1,875 మూత్రశాలలు నిర్మించారు. ప్రతి 40 మంది విద్యార్థులకు కనీసం ఒక మరుగుదొడ్డి, మూత్రశాల ఉండాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులతో ఎన్ని చర్యలు తీసుకున్నా కేవలం పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మాత్రమే కొంత మేరకు సౌకర్యాలు ఉన్నాయి. కానీ మూరుమూల ప్రాంతాల్లోని సగం వరకు పాఠశాలల్లో సౌకర్యాలు లేనేలేవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నిర్వహణ లోపం
కొత్తవి నిర్మాణం లేకపోయినా పరవాలేదు. కనీసం నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలను ప్రతి రోజు సక్రమంగా విద్యార్థులకు అందుబాటులో ఉంచలేకపోతున్నారు. నిర్వహణ లోపం దాదాపు ప్రతి పాఠశాలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. బోధనేతర సిబ్బంది ఏ ఒక్క పాఠశాలలోనూ సరిపడా లేకపోవడంతో నిర్వహణ లోపం కచ్చితంగా ఉంటోంది. తాగునీరు పాఠశాల సమయంలో సరఫరా చేయాలంటే పగటి పూట గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదనేది జగమెరిగిన సత్యం. దీంతో నీటి కోసం వేసిన బోరు పనిచేయదు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు సమీప ఇళ్లలోకి వెళ్లాల్సిందే. అదేవిధంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉపయోగించాలంటే నీటి వసతి తప్పనిసరి. వీటిని శుభ్రంగా ఉంచాలంటే నీటితో పాటు, స్కావెంజర్లు కావాలి. నీటి వసతి, స్కావెంజర్లు లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి. పాఠశాల గదులను రోజువారీగా శుభ్రం చేయడానికి చాలా చోట్ల ఆయాలు లేకపోవడంతో పిల్లలతో పనులు చేయిస్తున్నారు. బోధనేతర సిబ్బంది 70 శాతం పాఠశాలల్లో లేకపోవడంతో ఉన్న సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రాక నిరుపయోగంగా మారాయి.
పనిభారం
జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగానే ఉం ది. దీనికి తోడు బోధనేతర సిబ్బంది పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ప్రధానోపాధ్యాయు లే అన్నీ తామై చేసుకోవాల్సిన దుస్థితి నెలకొం ది. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మండల విధ్యాధికారి, ఉప విద్యాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, ఆర్వీఎం, జిల్లా కలెక్టర్, క్లస్టర్ సమావేశాలు అంటూ అధిక సమయం వీటికే పడుతోంది. దీంతో సౌకర్యాల నిర్వహణ బాధ్యతలు కనుమరుగై పోతున్నాయనడానికి ఇది కూడా కారణంగా కనిపిస్తోంది. ఇన్ని కారణాల నేపథ్యంలో విద్యార్థులు మాత్రం సమస్యల మధ్యే చదువులు వెల్లదీస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిస్థితులు మారేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
సమస్యల బడులు!
Published Wed, May 14 2014 2:08 AM | Last Updated on Wed, Sep 5 2018 4:22 PM
Advertisement