lavatories
-
ఇదేం దౌర్భాగ్యం..!
ఆదిలాబాద్ టౌన్ : ‘పిల్లలందరూ బాగా చదువుకోవాలి.. తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలని..’ ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్న మాటలు బాగానే ఉన్నా.. వారికి సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను విద్యాశాఖ తుంగలో తొక్కుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా నిర్మించాలని ఇదివరకే రెండుసార్లు ఆదేశాలు జారీ చేసినా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవంటే విద్యాశాఖ తీసుకుంటున్న బాగోగు చర్యలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా విద్యార్థులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధానంగా విద్యార్థినులు బయటకు వెళ్లలేక.. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక.. ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. ఇంకొన్ని చోట్ల అయితే.. తప్పనిసరిగా భావించి ఆరుబయటకు వెళ్తున్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. డీఈవో, ఆర్వీఎం జిల్లా కార్యాలయాలు ఉన్న జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నంబర్ 1, ఎస్బీహెచ్ఎస్, ఆర్పీఎల్, బాలికల ఉన్నత పాఠశాలలతోపాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా మరుగుదొడ్లు లేవు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ విజిట్ చేయగా.. విద్యార్థుల ఇబ్బందులు వెలుగులోకొచ్చాయి. జిల్లాలో పరిస్థితి... జిల్లాలో దాదాపు 4 వేల పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మరుగుదొడ్లు కల్పించాల్సిన బాధ్యత రాజీవ్ విద్యామిషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు అప్పగించారు. అయితే ఏ పాఠశాలలో ఎన్ని ఉన్నాయో కూడా అధికారులు లెక్క చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. 2011-12 విద్యా సంవత్సరంలో 1114 మంజూరు కాగా 1054 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు, 60 నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. 2012-13 విద్యా సంవత్సరంలో వైకల్యం గల విద్యార్థుల సౌకర్యార్థం 261 మంజూరు కాగా 24 పూర్తయ్యాయి. 105 నిర్మాణ దశలో, 132 ఇంకా ప్రారంభం కానట్లు ఆర్వీఎం అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జిల్లాలో మొత్తం 3,534 మరుగుదొడ్లు ఉన్నాయని, మరో 4,235 మరుగుదొడ్లు అవసరం ఉన్నాయని ఆయా మండల విద్యాధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న డ్రాపౌట్ల సంఖ్య.. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవడంతో విద్యార్థినులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు పడుతూ చాలా మంది విద్యార్థినులు సక్రమంగా పాఠశాలకు హాజరు కావడం లేదు. మరికొంత మంది చదువు మానేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. పాఠశాల వేళల్లో విద్యార్థినులు మరుగుదొడ్లు వినియోగించాల్సి వస్తే ఆరుబయటే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉండడంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదని తెలుస్తోంది. ఉన్న కొన్ని మరుగుదొడ్లలో నీటి వసతి లేక ఉపయోగంలోకి రావడం లేదు. నిధుల దుర్వినియోగం.. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు వాటిని తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో పాతవాటికే రంగులు పూసి నిధులు కాజేసిన దాఖలాలు ఉన్నాయి. మరికొన్ని పాఠశాలల్లో కాంట్రాక్టర్లు నాసిరకంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో నిర్మించిన కొన్ని నెలలకే అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఏదేమైనా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో విద్యార్థినులకు శాపంగా మారుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థినుల డ్రాప్‌ఔట్ సంఖ్యను తగ్గించి వారి సమస్యను తీర్చాలని పలువురు కోరుకుంటున్నారు. నిలిచిపోయిన న్యాప్కిన్ల పంపిణీ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు గతంలో పంపిణీ చేసిన న్యాప్కిన్లు ప్రస్తుతం అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకుని రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నెప్జల్ పథకం కింద ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు 2011-12 విద్యా సంవత్సరంలో దాదాపు 60 వేల మంది బాలికలకు న్యాప్కిన్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యార్థులకు వాటి తయారీపై విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. రెండేళ్లుగా ఈ పంపిణీ నిలిచింది. దీంతో విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. - సత్యనారాయణరెడ్డి, డీఈవో ఈ విద్యా సంవత్సరంలో 626 పాఠశాలలకు మరుగుదొడ్లను కలెక్టర్ మంజూరు చేశారు. వీటిని ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు చూస్తున్నారు. పాఠశాలలో పనులు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతాం. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండి వినియోగం లేని వాటిని వినియోగించేలా చూడాలని ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. -
బళ్లలో టాయిలెట్లేవి ?
పాలమూరు : పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం టాయిలెట్లు లేవు. జిల్లాలో 1559 పాఠశాలల్లో ఈ సమస్య ఉంది. అయినా, పాలకులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. జిల్లాలో 2,729 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 580 ప్రాథమికోన్నత పాఠశాలలు, 643 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందుకుగాను పాఠశాలల నిర్వహణకోసం ఏటా రూ. 3.95కోట్లు నిధులు మంజూరు చేస్తోంది. అయినా, వాటి ఫలితాలు ఎక్కడా కనబడడం లేదు. గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో అవి ఉపయోగంలో లేకుండా పోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1559 పాఠశాలల్లోని విద్యార్థులు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. 2,948 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ప్రహరీగోడ నిర్మాణాల్లేవు. దీంతో ఆయా పాఠశాలలన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. 794 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంలేదు. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా 600 అదనపు తరగతి గదులు అవసరం. ఈ సంఖ్య కేవలం విద్యాశాఖ లెక్కల ప్రకారం మాత్రమే.. వాస్తవానికి చూస్తే 75 శాతం వరకు పాఠశాలల్లో తగిన మౌలిక వసతుల్లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల వేళల్లో విద్యార్థినులు మరుగుదొడ్లు వినియోగించాల్సి వస్తే ఆరుబయటకు పోవాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా.. అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉండటంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీస వసతులు లేక కునారిల్లుతున్న పాఠశాలల్లో మరుగుదొడ్లు.. తాగునీటి సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు మూడేళ్ల కిందట ఆదేశించినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. 2009లో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చాక అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్న నిబంధనలున్నాయి. కానీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థినులు మధ్యలోనే బడి మానేస్తున్నట్లు తెలుస్తోంది. సమన్వయలోపం ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడిన సమన్వయలోపం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సర్కారు బడుల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సిన బాధ్యత ఆర్‌డబ్యుఎస్ శాఖదేనని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. ఆ శాఖ అధికారులు మేం పాఠశాలల్లో టాయ్లెట్లు ఎప్పుడో నిర్మించాం. వాటిని మనుగడలో ఉంచుకోకపోవడానికి బాధ్యులం మేంకాదు. మా లెక్కల ప్రకారం జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మింపచేశామని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు. -
సమస్యల బడులు!
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో బాల, బాలికలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ప్రహరీ, ప్రయోగశాలలు, గ్రంథాలయం వంటి సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం ఏటా దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలోనూ కనీసం 70 శాతం సౌకర్యాలు కూడా అందుబాటులోకి రాకపోవడం శోచనీయం. పేద పిల్లలు చదువుతున్న పాఠశాలలు అంటే అధికారులకు అంత చులకన ఎందుకో అనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చిన్న సమస్య ఎదురైతే నిలదీసే రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి గురించి ఎక్కడా కూడా నోరు మెదపకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధి పనుల్లో పలువురు రాజకీయ నాయకులే భాగస్వాములు కావడం కూడా నిర్లక్ష్యానికి కొంతమేర కారణమవుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంత మేరకు సౌకర్యాలు కల్పించారో తెలుపుతున్నటువంటి పూర్తి సమాచారంతో జూన్ ఏడో తేదీన హాజరు కావాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. జిల్లాలో విద్యావ్యవస్థ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 3,084, ప్రాథమికోన్నత పాఠశాలలు 444, ఉన్నత పాఠశాలలు 543 ఉన్నాయి. వీటిలో ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు రెండున్నర లక్షల మంది బాల, బాలికలు చదువుకుంటారు. సౌకర్యాలు ఇప్పటి వరకు జిల్లాలోని పాఠశాలలకు 10,910 తరగతి గదులు ఉన్నాయి. 1,176 పాఠశాలల్లో మాత్రమే ఫర్నిచర్ ఉంది. 2,769 మరుగుదొడ్లు బాలురకు, 3,813 మరుగుదొడ్లు బాలికలకు, 960 పాఠశాలల్లో బాలురకు తాగునీరు, 1,132 పాఠశాలల్లో బాలికలకు తాగునీరు, బాలురకు 2,012 మూత్రశాలలు, బాలికలకు 1,875 మూత్రశాలలు నిర్మించారు. ప్రతి 40 మంది విద్యార్థులకు కనీసం ఒక మరుగుదొడ్డి, మూత్రశాల ఉండాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులతో ఎన్ని చర్యలు తీసుకున్నా కేవలం పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మాత్రమే కొంత మేరకు సౌకర్యాలు ఉన్నాయి. కానీ మూరుమూల ప్రాంతాల్లోని సగం వరకు పాఠశాలల్లో సౌకర్యాలు లేనేలేవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిర్వహణ లోపం కొత్తవి నిర్మాణం లేకపోయినా పరవాలేదు. కనీసం నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలను ప్రతి రోజు సక్రమంగా విద్యార్థులకు అందుబాటులో ఉంచలేకపోతున్నారు. నిర్వహణ లోపం దాదాపు ప్రతి పాఠశాలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. బోధనేతర సిబ్బంది ఏ ఒక్క పాఠశాలలోనూ సరిపడా లేకపోవడంతో నిర్వహణ లోపం కచ్చితంగా ఉంటోంది. తాగునీరు పాఠశాల సమయంలో సరఫరా చేయాలంటే పగటి పూట గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదనేది జగమెరిగిన సత్యం. దీంతో నీటి కోసం వేసిన బోరు పనిచేయదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు సమీప ఇళ్లలోకి వెళ్లాల్సిందే. అదేవిధంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉపయోగించాలంటే నీటి వసతి తప్పనిసరి. వీటిని శుభ్రంగా ఉంచాలంటే నీటితో పాటు, స్కావెంజర్లు కావాలి. నీటి వసతి, స్కావెంజర్లు లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి. పాఠశాల గదులను రోజువారీగా శుభ్రం చేయడానికి చాలా చోట్ల ఆయాలు లేకపోవడంతో పిల్లలతో పనులు చేయిస్తున్నారు. బోధనేతర సిబ్బంది 70 శాతం పాఠశాలల్లో లేకపోవడంతో ఉన్న సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రాక నిరుపయోగంగా మారాయి. పనిభారం జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగానే ఉం ది. దీనికి తోడు బోధనేతర సిబ్బంది పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ప్రధానోపాధ్యాయు లే అన్నీ తామై చేసుకోవాల్సిన దుస్థితి నెలకొం ది. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మండల విధ్యాధికారి, ఉప విద్యాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, ఆర్వీఎం, జిల్లా కలెక్టర్, క్లస్టర్ సమావేశాలు అంటూ అధిక సమయం వీటికే పడుతోంది. దీంతో సౌకర్యాల నిర్వహణ బాధ్యతలు కనుమరుగై పోతున్నాయనడానికి ఇది కూడా కారణంగా కనిపిస్తోంది. ఇన్ని కారణాల నేపథ్యంలో విద్యార్థులు మాత్రం సమస్యల మధ్యే చదువులు వెల్లదీస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిస్థితులు మారేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుతున్నారు.