ఆదిలాబాద్ టౌన్ : ‘పిల్లలందరూ బాగా చదువుకోవాలి.. తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలని..’ ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్న మాటలు బాగానే ఉన్నా.. వారికి సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను విద్యాశాఖ తుంగలో తొక్కుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా నిర్మించాలని ఇదివరకే రెండుసార్లు ఆదేశాలు జారీ చేసినా అమలుకు నోచుకోవడం లేదు.
ఇప్పటికీ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవంటే విద్యాశాఖ తీసుకుంటున్న బాగోగు చర్యలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా విద్యార్థులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధానంగా విద్యార్థినులు బయటకు వెళ్లలేక.. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక.. ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. ఇంకొన్ని చోట్ల అయితే.. తప్పనిసరిగా భావించి ఆరుబయటకు వెళ్తున్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. డీఈవో, ఆర్వీఎం జిల్లా కార్యాలయాలు ఉన్న జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నంబర్ 1, ఎస్బీహెచ్‌ఎస్, ఆర్పీఎల్, బాలికల ఉన్నత పాఠశాలలతోపాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా మరుగుదొడ్లు లేవు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ విజిట్ చేయగా.. విద్యార్థుల ఇబ్బందులు వెలుగులోకొచ్చాయి.
జిల్లాలో పరిస్థితి...
జిల్లాలో దాదాపు 4 వేల పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మరుగుదొడ్లు కల్పించాల్సిన బాధ్యత రాజీవ్ విద్యామిషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలకు అప్పగించారు. అయితే ఏ పాఠశాలలో ఎన్ని ఉన్నాయో కూడా అధికారులు లెక్క చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. 2011-12 విద్యా సంవత్సరంలో 1114 మంజూరు కాగా 1054 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు, 60 నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది.
2012-13 విద్యా సంవత్సరంలో వైకల్యం గల విద్యార్థుల సౌకర్యార్థం 261 మంజూరు కాగా 24 పూర్తయ్యాయి. 105 నిర్మాణ దశలో, 132 ఇంకా ప్రారంభం కానట్లు ఆర్వీఎం అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జిల్లాలో మొత్తం 3,534 మరుగుదొడ్లు ఉన్నాయని, మరో 4,235 మరుగుదొడ్లు అవసరం ఉన్నాయని ఆయా మండల విద్యాధికారులు పేర్కొంటున్నారు.
పెరుగుతున్న డ్రాపౌట్ల సంఖ్య..
పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవడంతో విద్యార్థినులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు పడుతూ చాలా మంది విద్యార్థినులు సక్రమంగా పాఠశాలకు హాజరు కావడం లేదు. మరికొంత మంది చదువు మానేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. పాఠశాల వేళల్లో విద్యార్థినులు మరుగుదొడ్లు వినియోగించాల్సి వస్తే ఆరుబయటే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉండడంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదని తెలుస్తోంది. ఉన్న కొన్ని మరుగుదొడ్లలో నీటి వసతి లేక ఉపయోగంలోకి రావడం లేదు.
నిధుల దుర్వినియోగం..
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు వాటిని తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో పాతవాటికే రంగులు పూసి నిధులు కాజేసిన దాఖలాలు ఉన్నాయి. మరికొన్ని పాఠశాలల్లో కాంట్రాక్టర్లు నాసిరకంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో నిర్మించిన కొన్ని నెలలకే అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఏదేమైనా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో విద్యార్థినులకు శాపంగా మారుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థినుల డ్రాప్‌ఔట్ సంఖ్యను తగ్గించి వారి సమస్యను తీర్చాలని పలువురు కోరుకుంటున్నారు.
నిలిచిపోయిన న్యాప్‌కిన్‌ల పంపిణీ..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు గతంలో పంపిణీ చేసిన న్యాప్‌కిన్‌లు ప్రస్తుతం అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకుని రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నెప్జల్ పథకం కింద ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు 2011-12 విద్యా సంవత్సరంలో దాదాపు 60 వేల మంది బాలికలకు న్యాప్‌కిన్‌లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యార్థులకు వాటి తయారీపై విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. రెండేళ్లుగా ఈ పంపిణీ నిలిచింది. దీంతో విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
నిర్మాణ పనులు జరుగుతున్నాయి..
- సత్యనారాయణరెడ్డి, డీఈవో
ఈ విద్యా సంవత్సరంలో 626 పాఠశాలలకు మరుగుదొడ్లను కలెక్టర్ మంజూరు చేశారు. వీటిని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ వారు చూస్తున్నారు. పాఠశాలలో పనులు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతాం. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండి వినియోగం లేని వాటిని వినియోగించేలా చూడాలని ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం.
ఇదేం దౌర్భాగ్యం..!
Published Thu, Dec 18 2014 4:01 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement