నగరి (చిత్తూరు జిల్లా) : పాఠశాలల్లో విద్యార్థుల హాజరును లెక్కించడానికి ఇకపై ‘ప్రెజెంట్ సార్../ఎస్ సార్’ అని అనరాదు. ఇందుకు బదులుగా ‘మరుగుదొడ్డి కట్టాము సార్../ మరుగుదొడ్డి కట్టలేదు సార్’ అని మాత్రమే విద్యార్థులతో చెప్పించాలి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యం చేరుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని కూడా వాడుకోవాలని నిర్ణయించింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉన్న విద్యార్థులు ‘ప్రెజెంట్ సార్’కు బదులు ‘కట్టాము’ అని, ఇంట్లో మరుగుదొడ్డి లేని విద్యార్థులు ‘కట్టలేదు’ అని చెప్పాల్సి ఉంటుంది.
ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రొసీడింగ్స్ నంబరు 448 మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకు ఈ ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాలని చిత్తూరు జిల్లా డీఈవో పాండురంగ స్వామి పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై ఉపాధ్యాయుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే అంశం అని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో చదివే పేద విద్యార్థినులకు ఈ అంశం ఇబ్బందికరమని, తోటి విద్యార్థుల మధ్య వారు కుంగిపోతారంటున్నారు.
ఈ పద్ధతి బాగోలేదు..
అన్ని ఇళ్లలోనూ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండాలనేది మంచి నిర్ణయమే. ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే దీనిని అమలు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. ఇప్పటికే పశు వైద్యులను పూర్తి సమయం ఈ పని కోసమే వినియోగిస్తున్నారు. ఉపాధ్యాయులనూ భాగస్వాములను చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో పెద్దలకు అవగాహన కలిగించడానికి పలు మార్గాలు ఉన్నాయి. వాటన్నింటినీ వదిలిపెట్టి పిల్లలను మానసికంగా ఇబ్బంది పెట్టడం ద్వారా పెద్దల్లో మార్పు తేవాలనుకోవడం సరికాదని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు.
‘హాజరు వేసే సమయంలో విద్యార్థులను మీ ఇంట్లో మరుగుదొడ్డి కట్టారా, లేదా అని రోజూ అడిగితే గ్రామాల్లో పలు సమస్యలు తలెత్తుతాయి. కొందరు విద్యార్థులు ఒత్తిడికి గురయ్యి.. పాఠశాలకు రావడం మానేసే ప్రమాదం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీ అధికారుల ద్వారా అవగాహన కల్పించాలి. అంతేకాని ఉపాధ్యాయులు, విద్యార్థులపై రుద్దడం తగద’ని చిత్తూరు జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి మునిరత్నం ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment