బడి 'బరువు' తగ్గాల్సిందే! | Government guidelines on books weight , teaching style | Sakshi
Sakshi News home page

బడి 'బరువు' తగ్గాల్సిందే!

Published Wed, Jul 19 2017 4:01 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

బడి 'బరువు' తగ్గాల్సిందే! - Sakshi

బడి 'బరువు' తగ్గాల్సిందే!

పుస్తకాల బరువు, బోధన తీరుపై సర్కారు మార్గదర్శకాలు
- తరగతుల వారీగా కచ్చితమైన నిబంధనలు
- బ్యాగుతో సహా ఉండాల్సిన బరువుపై స్పష్టత
విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడేలా చర్యలు
ఎస్‌సీఈఆర్టీ నిర్దేశించిన పుస్తకాలే వినియోగించాలని స్కూళ్లకు ఆదేశం
రోజూ అన్ని సబ్జెక్టుల పుస్తకాలు తీసుకురాకుండా ప్రణాళిక
గైడ్లు, ఇతర మెటీరియల్‌ వినియోగించవద్దని సూచన
ప్రాథమిక స్థాయిలో నో హోంవర్క్‌
ఆపై తరగతుల వారికి ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్‌ హోంవర్క్‌
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి..  
 
బండెడు పుస్తకాల బరువుతో నడుం వంగిపోతున్న బాల్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్‌ బ్యాగుల మోతకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. బ్యాగు సహా పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు అన్నీ కలిపి కూడా ఏయే తరగతులకు ఎంతెంత బరువులోపు ఉండాలో స్పష్టంగా నిబంధనలు రూపొందించింది. అంతేకాదు బట్టీపట్టే చదువులు కాకుండా విషయ పరిజ్ఞానం, అవగాహన, మానసిక ఎదుగుదలకు తోడ్పడేలా బోధన కొనసాగించాలని పాఠశాలలను ఆదేశించింది. ఆటపాటలతో శారీరక దృఢత్వానికి తోడ్పడే ప్రణాళికలనూ సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య మంగళవారం జీవో 22 జారీ చేశారు.
– సాక్షి, హైదరాబాద్‌
 
బడి సంచుల మోతపై వివిధ జిల్లాల్లో విద్యా శాఖ ఇటీవల సర్వే చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు 6 నుంచి 12 కిలోల బరువైన బ్యాగులను.. ఉన్నత పాఠశాలల్లో 12 నుంచి 17 కిలోల బ్యాగులను ప్రతి రోజు వీపుపై మోస్తున్నారని గుర్తించింది. ప్రతిరోజు అన్ని రకాల పాఠ్య పుస్తకాలు, చిత్తు, రాత నోటు పుస్తకాలు, గైడ్లు వంటివన్నీ స్కూల్‌ బ్యాగుల్లో తీసుకెళుతున్నారని తేల్చింది. ఇంత బరువును మోసుకెళ్లడం, కొన్ని పాఠశాలలు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటంతో ఈ బరువుతో మెట్లు ఎక్కడం వంటి వాటివల్ల పిల్లలు వెన్ను, మోకాలు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని... ఇది విద్యార్థుల శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతోందని గుర్తించింది. ఈ నేపథ్యంలో పిల్లలపై పుస్తకాల మోతను తగ్గించేలా మార్గదర్శకాలు రూపొందించింది.
 
వెంటనే అమల్లోకి..
తాజా మార్గదర్శకాల ప్రకారం బ్యాగుతో సహా 1, 2 తరగతుల పుస్తకాల బరువు 1.5 కిలోల వరకే ఉండాలి. 3, 4, 5 తరగతులకు 3 కిలోల వరకు.. 6, 7 తరగతులకు 4 కిలోల వరకు.. 8, 9, 10 తరగతులకు 4.5 నుంచి 5 కిలోల వరకు మాత్రమే బరువు ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఆదేశించారు.
 
బ్యాగుల భారం తగ్గింపుపై టీఎస్‌యూటీఎఫ్‌ హర్షం
పుస్తకాల బ్యాగుల భారం తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ( టీఎస్‌యూటీఎఫ్‌) హర్షం వ్యక్తం చేసింది. అయితే దీనిపై పర్యవేక్షణ యంత్రాంగాన్ని విద్యాశాఖ ఏర్పాటు చేసినప్పుడే అమలు సక్రమంగా జరుగుతుందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావ రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో..
6, 7 తరగతులకు 3 భాషలు, గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం మొత్తం 6 పుస్తకాలే ఉండాలి.
8, 9 ,10 తరగతులకు ఆ ఆరు పుస్తకాలతోపాటు జీవశాస్త్రంతో కలిపి 7 పుస్తకాలుండాలి.
ప్రతి సబ్జెక్టుకు 200 పేజీల నోట్‌బుక్‌ ఉండాలి. వాటిని ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్, ప్రాజెక్టులు, స్లిప్‌ టెస్టులకు వినియోగించాలి. ఇవి కూడా రోజూ తీసుకురావాల్సిన అవసరం లేదు.
ఒక చిత్తు నోట్‌ పుస్తకాన్ని ప్రతి రోజు తెచ్చుకోవాలి. దానిని అన్ని సబ్జెక్టుల క్లాస్‌వర్క్‌గా ఉపయోగించాలి.
పాఠ్యాంశాల చివరన ఉన్న ఎక్సర్‌సైజ్‌లను ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే పూర్తి చేయాలి. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్లను కేటాయించాలి.
6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు హోంవర్క్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో రోజు కేటాయించేలా ప్రణాళిక ఉండాలి. ఏ సబ్జెక్టుకు ఏ రోజు అనేది ఉపాధ్యాయుల సమావేశంలో చర్చించి నిర్ణయించాలి.
బ్యాగుతో సహా పుస్తకాల బరువు 6, 7 తరగతులకు 4 కిలోల వరకు.. 8, 9, 10 తరగతులకు 4.5 కిలోల నుంచి 5 కిలోల వరకే ఉండాలి.
 
ప్రాథమిక పాఠశాలలకు మార్గదర్శకాలివీ..
► 1, 2 తరగతులకు మాతృభాష, ఇంగిష్, గణితం పాఠ్య పుస్తకాలు.. 3, 4, 5 తరగతులకు ఈ మూడు పుస్తకాలతోపాటు అదనంగా పరిసరాల విజ్ఞానం పుస్తకాన్ని మాత్రమే వినియోగించాలి.
► ప్రాజెక్టులు, స్లిప్‌ టెస్టులు, ఎక్సర్‌సైజ్‌ల నమోదు కోసం ప్రతి సబ్జెక్టుకు 100 పేజీలకు మించని ఒక నోటు పుస్తకాన్ని మాత్రమే వినియోగించాలి. వీటిని కూడా రోజూ బడికి తేవాల్సిన అవసరం లేదు. ఒక్కో సబ్జెక్టు బుక్స్‌ మూడు రోజుల చొప్పున తేవాలి.
► చేతిరాతను మెరుగుపర్చేందుకు 100 పేజీల డబుల్‌ రూల్‌ నోటు పుస్తకం మాత్రమే ఉండాలి.
► విద్యార్థులు సీసాల్లో తాగునీటిని తేవాల్సిన అవసరం లేకుండా.. పాఠశాలల్లోనే సురక్షిత తాగునీటిని అందించాలి.
► ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వకూడదు.
► పాఠ్యాంశాల చివరలోని ఎక్సర్‌సైజులను ఉపాధ్యా యుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే చేయించాలి. వాటికోసం ప్రత్యేక పీరియడ్లను టైంటేబుల్‌లో పొందుపర్చాలి.
► పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగుతో సహా 1, 2 తరగతులకు 1.5 కిలోల వరకు.. 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోల వరకే బరువు ఉండాలి.
 
పాఠశాలలు తీసుకోవాల్సిన చర్యలివీ
ఏ రోజు ఏయే పాఠ్య పుస్తకాలను, నోటు పుస్తకాలను తీసుకురావాలో ముందుగానే చెప్పాలి.
బరువు సమానంగా పరుచుకునేలా.. రెండు వైపులా వెడల్పాటి పట్టీలు కలిగిన స్కూల్‌ బ్యాగులను ఎంపిక చేసుకునేలా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించాలి.
విద్యార్థులు పాఠశాలకు వెళ్లే వాహనం కోసం ఎదురుచూసేప్పుడు, స్కూల్‌ అసెంబ్లీలో ఉన్నపుడు బ్యాగును కింద పెట్టాలి.
బరువైన స్కూల్‌ బ్యాగుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.
ఎస్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన పుస్తకాలు కాకుండా ఇతర బోధన కోసమంటూ అదనపు, బరువైన, ఖరీదైన పుస్తకాలను సూచించవద్దు.
 
స్వీయ సామర్థ్యం పెంచేలా బోధన
స్టేట్‌ సిలబస్‌ను అమలు చేసే అన్ని పాఠశాలలు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) నిర్ణయించిన పుస్తకాలనే వినియోగించాలి. అంతకుమించి ఉపయోగించకూడదు.
విద్యార్థులు విషయ భావనలు గుర్తుంచుకోవడం కన్నా.. వాటిని అర్థం చేసుకునేలా విద్యా బోధనపై దృష్టి పెట్టాలి. చదవడం, గ్రహించడం, భావ వ్యక్తీకరణలో విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వాలి.
పాఠశాలల్లో, ఇంటివద్ద విద్యార్థుల చేత పుస్తకాలు, గైడ్లలోని విషయాలను పదే పదే రాయించడాన్ని స్కూళ్లు నివారించాలి. గైడ్లు, గైడ్లను పోలిన స్టడీ మెటీరియల్‌ వినియోగాన్ని నిరోధించాలి.
లైబ్రరీలో పుస్తకాలు చదవడం, క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
టీచర్లు విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం అంచనా వేస్తుండాలి. పిల్లలు స్వీయ ఆలోచన ద్వారా ఊహాశక్తితో సొంతంగా సమాధానాలు రూపొందించుకునేలా తీర్చిదిద్దాలి.
ప్రాథమిక నైపుణ్యాలైన చదవడం, రాయడం, అంక గణిత సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.
సిలబస్‌ పూర్తి చేసేందుకు యాంత్రికంగా పాఠాలు బోధించడం కాకుండా.. తరగతి గదిలో పరస్పర ప్రతిస్పందనలను ప్రోత్సహించాలి.
► చర్చ, భాషణలతోపాటు ప్రాజెక్టులు, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, పుస్తక సమీక్షలు, వర్తమాన సామాజిక అంశాలపై చర్చలు వంటి కీలక అభ్యసన ప్రక్రియల్లో పాల్గొనేలా చేయాలి.
► సాయంత్రం వేళల్లో పిల్లలను ట్యూషన్లు, హోంవర్కులకు పరిమితం చేయకుండా ఆటలు, క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. వినోదం, శారీరక కార్యక్రమాలు పిల్లల ఎదుగుదలకు అవసరం. అది వారి హక్కు కూడా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement