Books Weight
-
బడి బ్యాగు బరువు తగ్గించాలి!
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో చదివే విద్యార్థులపై పుస్తకాల బరువు తగ్గించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలయ్యేలా చూడాలని పేర్కొంది. పుస్తకాల బరువు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలపై కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 70శాతం మంది స్కూల్ విద్యార్థులపై పుస్తకాల భారం అధికంగా ఉంటోంది. దీనితో పిల్లల కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మంది విద్యార్థులు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇంటికి రాగానే నీరసంగా, భుజాలు వంగిపోయి నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. దీర్ఘకాలం పాటు ఈ ప్రభావం ఉంటోందని.. ఈ ఆరోగ్య సమస్యలు విద్యార్థి చదువుపై శ్రద్ధ కోల్పోయేందుకు కారణం అవుతున్నాయని అధ్యయనం నివేదిక స్పష్టం చేసింది. మితిమీరిన పుస్తకాలు, చదువుతో విద్యార్థులు సరిగా నిద్రపోవడం లేదని.. దీనితో తరగతి గదిలో చురుకుగా ఉండటం లేదని పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని వివరించింది. ప్రైవేటు స్కూళ్లు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటం, శక్తికి మించిన బరువుతో పిల్లలు మెట్లు ఎక్కడం వల్ల సమస్య పెరుగుతోందని తెలిపింది. ఈ క్రమంలో బడి బ్యాగుల బరువు విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కచ్చితమైన నిబంధనలు ఉండేలా చూడాలని సూచించింది. ఐదేళ్ల నుంచి అడుగుతున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో స్కూల్ విద్యార్థులపై పుస్తకాల బరువు సమస్య తీవ్రంగా ఉందని ఈ అంశంపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ గతంలోనే స్పష్టం చేసింది. చిన్నప్పట్నుంచే విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్‌లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని మరికొన్ని అధ్యయనాలు కూడా తేల్చాయి. ఈక్రమంలో పుస్తకాల బరువు తగ్గించే చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యా శాఖ ఐదేళ్ల క్రితమే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ దిశగా కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. పిల్లలు మోసే పుస్తకాల బరువు వారి బరువులో పది శాతానికి మించి ఉండకూడదని పేర్కొంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కొంత కార్యాచరణ చేపట్టాయి. స్కూళ్లలో డిజిటల్ విధానం అమలు చేయాలని నిర్ణయించాయి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, అవకాశాలు పెరిగాయి. విద్యా సంస్థలు దీనిని సది్వనియోగం చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. హోంవర్క్ సహా కొన్ని రాత పనులను డిజిటల్ విధానంలోకి మార్చడం వల్ల బరువు తగ్గించే వీలుందని పేర్కొంది. ఐదేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో స్పందించలేదని.. ఇకనైనా ఆ దిశగా అడుగువేయాలని కేంద్ర విద్యాశాఖ తాజాగా అభిప్రాయపడింది. బ్యాగు బరువు ఇలా ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రెండో తరగతి విద్యార్థులకు 1.5 కిలోలు మాత్రమే పుస్తకాల బరువు ఉండాలి. 5 తరగతి వరకూ మూడు కేజీలు, 7వ తరగతి వరకు 4 కేజీలు, 9వ తరగతి వారికి 4.5 కేజీలు, పదో తరగతి వారికి 5 కేజీలకు మించి పుస్తకాల బరువు ఉండకూడదు. తెలంగాణ విద్యాశాఖ క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం.. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పుస్తకాల బరువు 12 కేజీల వరకు, ఉన్నత పాఠశాల విద్యార్థుల పుస్తకాల బరువు 17 కేజీల వరకు ఉంటున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఐదో తరగతి చదివే విద్యార్థులు ఏకంగా 40 పుస్తకాలను మోయాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, వర్క్ïÙట్స్, నోట్‌బుక్స్ ఇలా అనేకం బ్యాగులో కుక్కేస్తున్నారు. వీటికితోడు లంచ్ బాక్స్, నీళ్ల బాటిల్ కూడా కలసి పిల్లలపై భారం పడుతోంది. ప్రైవేటు స్కూళ్లు పుస్తకాల ముద్రణ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాల కారణంగా ప్రతిదీ కొనాల్సిందేనని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. భారంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి పుస్తకాల బరువు తగ్గించే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల చర్చించారు. ఈ అంశంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, కార్యాచరణను రూపొందించేందుకు అధికారులతో ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు పుస్తకాల బరువు అధికంగా ఉంటోందని.. అలాంటి వాటిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని ఆలోచనకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని, అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
బడి 'బరువు' తగ్గాల్సిందే!
పుస్తకాల బరువు, బోధన తీరుపై సర్కారు మార్గదర్శకాలు - తరగతుల వారీగా కచ్చితమైన నిబంధనలు - బ్యాగుతో సహా ఉండాల్సిన బరువుపై స్పష్టత - విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడేలా చర్యలు - ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పుస్తకాలే వినియోగించాలని స్కూళ్లకు ఆదేశం - రోజూ అన్ని సబ్జెక్టుల పుస్తకాలు తీసుకురాకుండా ప్రణాళిక - గైడ్లు, ఇతర మెటీరియల్ వినియోగించవద్దని సూచన - ప్రాథమిక స్థాయిలో నో హోంవర్క్ - ఆపై తరగతుల వారికి ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ హోంవర్క్ - ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి.. బండెడు పుస్తకాల బరువుతో నడుం వంగిపోతున్న బాల్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ బ్యాగుల మోతకు ఫుల్స్టాప్ పెడుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. బ్యాగు సహా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు అన్నీ కలిపి కూడా ఏయే తరగతులకు ఎంతెంత బరువులోపు ఉండాలో స్పష్టంగా నిబంధనలు రూపొందించింది. అంతేకాదు బట్టీపట్టే చదువులు కాకుండా విషయ పరిజ్ఞానం, అవగాహన, మానసిక ఎదుగుదలకు తోడ్పడేలా బోధన కొనసాగించాలని పాఠశాలలను ఆదేశించింది. ఆటపాటలతో శారీరక దృఢత్వానికి తోడ్పడే ప్రణాళికలనూ సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం జీవో 22 జారీ చేశారు. – సాక్షి, హైదరాబాద్ బడి సంచుల మోతపై వివిధ జిల్లాల్లో విద్యా శాఖ ఇటీవల సర్వే చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు 6 నుంచి 12 కిలోల బరువైన బ్యాగులను.. ఉన్నత పాఠశాలల్లో 12 నుంచి 17 కిలోల బ్యాగులను ప్రతి రోజు వీపుపై మోస్తున్నారని గుర్తించింది. ప్రతిరోజు అన్ని రకాల పాఠ్య పుస్తకాలు, చిత్తు, రాత నోటు పుస్తకాలు, గైడ్లు వంటివన్నీ స్కూల్ బ్యాగుల్లో తీసుకెళుతున్నారని తేల్చింది. ఇంత బరువును మోసుకెళ్లడం, కొన్ని పాఠశాలలు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటంతో ఈ బరువుతో మెట్లు ఎక్కడం వంటి వాటివల్ల పిల్లలు వెన్ను, మోకాలు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని... ఇది విద్యార్థుల శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతోందని గుర్తించింది. ఈ నేపథ్యంలో పిల్లలపై పుస్తకాల మోతను తగ్గించేలా మార్గదర్శకాలు రూపొందించింది. వెంటనే అమల్లోకి.. తాజా మార్గదర్శకాల ప్రకారం బ్యాగుతో సహా 1, 2 తరగతుల పుస్తకాల బరువు 1.5 కిలోల వరకే ఉండాలి. 3, 4, 5 తరగతులకు 3 కిలోల వరకు.. 6, 7 తరగతులకు 4 కిలోల వరకు.. 8, 9, 10 తరగతులకు 4.5 నుంచి 5 కిలోల వరకు మాత్రమే బరువు ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఆదేశించారు. బ్యాగుల భారం తగ్గింపుపై టీఎస్‌యూటీఎఫ్ హర్షం పుస్తకాల బ్యాగుల భారం తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( టీఎస్‌యూటీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. అయితే దీనిపై పర్యవేక్షణ యంత్రాంగాన్ని విద్యాశాఖ ఏర్పాటు చేసినప్పుడే అమలు సక్రమంగా జరుగుతుందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావ రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో.. ► 6, 7 తరగతులకు 3 భాషలు, గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం మొత్తం 6 పుస్తకాలే ఉండాలి. ► 8, 9 ,10 తరగతులకు ఆ ఆరు పుస్తకాలతోపాటు జీవశాస్త్రంతో కలిపి 7 పుస్తకాలుండాలి. ► ప్రతి సబ్జెక్టుకు 200 పేజీల నోట్‌బుక్ ఉండాలి. వాటిని ఫార్మేటివ్ అసెస్మెంట్, ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులకు వినియోగించాలి. ఇవి కూడా రోజూ తీసుకురావాల్సిన అవసరం లేదు. ► ఒక చిత్తు నోట్ పుస్తకాన్ని ప్రతి రోజు తెచ్చుకోవాలి. దానిని అన్ని సబ్జెక్టుల క్లాస్వర్క్గా ఉపయోగించాలి. ► పాఠ్యాంశాల చివరన ఉన్న ఎక్సర్‌సైజ్‌లను ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే పూర్తి చేయాలి. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్లను కేటాయించాలి. ► 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు హోంవర్క్ కోసం ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో రోజు కేటాయించేలా ప్రణాళిక ఉండాలి. ఏ సబ్జెక్టుకు ఏ రోజు అనేది ఉపాధ్యాయుల సమావేశంలో చర్చించి నిర్ణయించాలి. ► బ్యాగుతో సహా పుస్తకాల బరువు 6, 7 తరగతులకు 4 కిలోల వరకు.. 8, 9, 10 తరగతులకు 4.5 కిలోల నుంచి 5 కిలోల వరకే ఉండాలి. ప్రాథమిక పాఠశాలలకు మార్గదర్శకాలివీ.. ► 1, 2 తరగతులకు మాతృభాష, ఇంగిష్, గణితం పాఠ్య పుస్తకాలు.. 3, 4, 5 తరగతులకు ఈ మూడు పుస్తకాలతోపాటు అదనంగా పరిసరాల విజ్ఞానం పుస్తకాన్ని మాత్రమే వినియోగించాలి. ► ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులు, ఎక్సర్సైజ్ల నమోదు కోసం ప్రతి సబ్జెక్టుకు 100 పేజీలకు మించని ఒక నోటు పుస్తకాన్ని మాత్రమే వినియోగించాలి. వీటిని కూడా రోజూ బడికి తేవాల్సిన అవసరం లేదు. ఒక్కో సబ్జెక్టు బుక్స్ మూడు రోజుల చొప్పున తేవాలి. ► చేతిరాతను మెరుగుపర్చేందుకు 100 పేజీల డబుల్ రూల్ నోటు పుస్తకం మాత్రమే ఉండాలి. ► విద్యార్థులు సీసాల్లో తాగునీటిని తేవాల్సిన అవసరం లేకుండా.. పాఠశాలల్లోనే సురక్షిత తాగునీటిని అందించాలి. ► ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదు. ► పాఠ్యాంశాల చివరలోని ఎక్సర్సైజులను ఉపాధ్యా యుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే చేయించాలి. వాటికోసం ప్రత్యేక పీరియడ్లను టైంటేబుల్లో పొందుపర్చాలి. ► పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగుతో సహా 1, 2 తరగతులకు 1.5 కిలోల వరకు.. 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోల వరకే బరువు ఉండాలి. పాఠశాలలు తీసుకోవాల్సిన చర్యలివీ ► ఏ రోజు ఏయే పాఠ్య పుస్తకాలను, నోటు పుస్తకాలను తీసుకురావాలో ముందుగానే చెప్పాలి. ► బరువు సమానంగా పరుచుకునేలా.. రెండు వైపులా వెడల్పాటి పట్టీలు కలిగిన స్కూల్ బ్యాగులను ఎంపిక చేసుకునేలా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించాలి. ► విద్యార్థులు పాఠశాలకు వెళ్లే వాహనం కోసం ఎదురుచూసేప్పుడు, స్కూల్ అసెంబ్లీలో ఉన్నపుడు బ్యాగును కింద పెట్టాలి. ► బరువైన స్కూల్ బ్యాగుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ► ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పుస్తకాలు కాకుండా ఇతర బోధన కోసమంటూ అదనపు, బరువైన, ఖరీదైన పుస్తకాలను సూచించవద్దు. స్వీయ సామర్థ్యం పెంచేలా బోధన ► స్టేట్ సిలబస్‌ను అమలు చేసే అన్ని పాఠశాలలు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించిన పుస్తకాలనే వినియోగించాలి. అంతకుమించి ఉపయోగించకూడదు. ► విద్యార్థులు విషయ భావనలు గుర్తుంచుకోవడం కన్నా.. వాటిని అర్థం చేసుకునేలా విద్యా బోధనపై దృష్టి పెట్టాలి. చదవడం, గ్రహించడం, భావ వ్యక్తీకరణలో విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వాలి. ► పాఠశాలల్లో, ఇంటివద్ద విద్యార్థుల చేత పుస్తకాలు, గైడ్లలోని విషయాలను పదే పదే రాయించడాన్ని స్కూళ్లు నివారించాలి. గైడ్లు, గైడ్లను పోలిన స్టడీ మెటీరియల్ వినియోగాన్ని నిరోధించాలి. ► లైబ్రరీలో పుస్తకాలు చదవడం, క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ► టీచర్లు విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం అంచనా వేస్తుండాలి. పిల్లలు స్వీయ ఆలోచన ద్వారా ఊహాశక్తితో సొంతంగా సమాధానాలు రూపొందించుకునేలా తీర్చిదిద్దాలి. ► ప్రాథమిక నైపుణ్యాలైన చదవడం, రాయడం, అంక గణిత సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ► సిలబస్ పూర్తి చేసేందుకు యాంత్రికంగా పాఠాలు బోధించడం కాకుండా.. తరగతి గదిలో పరస్పర ప్రతిస్పందనలను ప్రోత్సహించాలి. ► చర్చ, భాషణలతోపాటు ప్రాజెక్టులు, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, పుస్తక సమీక్షలు, వర్తమాన సామాజిక అంశాలపై చర్చలు వంటి కీలక అభ్యసన ప్రక్రియల్లో పాల్గొనేలా చేయాలి. ► సాయంత్రం వేళల్లో పిల్లలను ట్యూషన్లు, హోంవర్కులకు పరిమితం చేయకుండా ఆటలు, క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. వినోదం, శారీరక కార్యక్రమాలు పిల్లల ఎదుగుదలకు అవసరం. అది వారి హక్కు కూడా. -
బ్యాగు భారం
పుస్తకాల బరువు మోయలేక చిన్నారుల తంటాలు విద్యార్థి బరువులో 10 శాతానికి మించి పుస్తకాల బరువు ఉండొద్దంటున్న చట్టాలు.. పట్టించుకోని విద్యాశాఖ అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ‘మోయలేని భారం’ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. బ్యాగు నిండా పుస్తకాల మోతతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు పుస్తకాల మోతతో పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రెండు, మూడు అంతస్తుల్లోని పాఠశాలల తరగతి గదుల్లోకి వెళ్లే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. పుస్తకాల భారం తగ్గించాలని 2006లోనే చట్టం చేసినా దాని అమలుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్కూళ్లలో పుస్తకాల బరువు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీబీఎస్ఈ తాజాగా ఆదేశించినా.. మన రాష్ట్రంలో ఆ దిశగా అధికారులు దృష్టిసారించడం లేదు. మళ్లీ బడి మొదలు కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులకు పుస్తక కష్టాలు మొదలు కానున్నాయి. విద్యార్థి శరీర బరువులో పుస్తకాల భారం 10% మించకూడదని చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్-2006 చెబుతున్నా.. 25% నుంచి 35% పైగా బరువుతో విద్యార్థుల నడ్డివిరిచే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కండరాల సమస్యలు, వెన్నుపూస ఒంగిపోవడం, వెన్నునొప్పి వంటి అనా రోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్యులు, నిఫుణులు చెబుతున్నారు. పుస్తకాల బరువు.. భారంగా చదువు రాష్ట్రంలోని 14 వేలకుపైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అత్యధికంగా నగరాల్లో చదువుతున్న వారే. ఇలాంటి వాటిల్లో బహుళ అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలే ఎక్కువ. బ్యాగు బరువుతో ఇబ్బంది పడే విద్యార్థులు పై అంతస్తుల్లోని తరగతులకు వెళ్లడానికి తంటాలు పడుతున్నారు. రెగ్యులర్ సిలబస్ పుస్తకాలతోపాటు డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జీకే, కంప్యూటర్, అసైన్మెంట్, డైరీ, రిజిస్టర్ వంటి పుస్తకాలతోపాటు క్లాస్ వర్క్, హోంవర్క్, తెలుగు, హిందీ, ఇంగ్లిషు, సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇలా ఒక్కో సబ్జెక్ట్‌కు 2 నుంచి 3 చొప్పున నోట్‌బుక్స్, అట్లాస్, డిక్షనరీ, స్పోర్ట్స్ డ్రెస్ వంటి వాటితో స్కూల్ బ్యాగు మోయలేని భారం అవుతోంది. యూకేజీ చదివే విద్యార్థి 14 కిలోలు ఉంటే.. బ్యాగు బరువే 3.5 కిలోలకు పైనే ఉంటోందని విద్యాశాఖ అంచనా. మూడో తరగతి విద్యార్థి బరువు 22 కిలోలు ఉంటే అతని పుస్తకాల బరువు 8 కిలోలకు పైనే. 35 కిలోల బరువుండే ఏడో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 10 కిలోలకుపైనే. స్కూల్ బ్యాగ్ బరువు అధికంగా ఉంటే శరీర ఎదుగుదల దెబ్బతింటుంది. ఎముకలు, కండరాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మెడ, భుజాలు, వెన్నుపూస పైభాగం, వెన్నుపూస కింది భాగం దెబ్బతింటాయి. దీంతో వెన్నునొప్పి వస్తుంది. వెన్నెముక, భుజాలు వంగిపోతాయి. ఈ ప్రభావం బాలికలపై తీవ్రంగా ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ అలసటకు గురవుతారు. శ్వాస సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది. చట్టం ప్రకారం ప్రభుత్వం, పాఠశాలల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాడ్ తరహాలో బ్యాగు వెనుక భాగంలో స్పాంజ్ కలిగిన బ్యాగులను తీసుకోవాలి. దానివల్ల బరువంతా నేరుగా భుజాలు, వెన్నుపూసపై పడదు. - డాక్టర్ శివనారాయణరెడ్డి, పిల్లల వైద్య నిపుణుడు చట్టం ఏం చెబుతోందంటే.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు స్కూల్ పుస్తకాలు మోయకూడదు. ఇతర తరగతుల వారు విద్యార్థి శరీర బరువుకంటే స్కూల్ బ్యాగు బరువు 10 శాతం మించి ఉండకూడదు. స్కూల్ బ్యాగు బరువు, రోజూ తెచ్చుకోవాల్సిన పుస్తకాలపై శాస్త్రీయ అంచనాతో పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు మార్గదర్శకాలు ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను స్కూల్లోనే దాచుకునేందుకు లాకర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలే విద్యార్థుల పుస్తకాలను స్కూల్లో పెట్టుకునేందుకు ప్రతి విద్యార్థికి లాకర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేయకపోయినా, ఈ నిబంధనలను పాటించకపోయినా ఆయా స్కూళ్లపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. రూ. 3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. జరిమానా విధించిన తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే పాఠశాలల గుర్తింపును రద్దు చేయవచ్చు. -
బాల్యం.. భారం..
బాల్యం మధుర జ్ఞాపకమని ఒకప్పుడు చెప్పుకునేవారు. మధుర జ్ఞాపకం మాటలా ఉంచితే.. విద్య.. వ్యాపారమైన ప్రస్తుత కాలంలో.. మితిమీరిన చదువుల భారంతో బాల్యం నలిగిపోతోంది. నూటికి తొంభై మార్కులు సాధించే విద్యార్థులు సైతం అన్నివైపుల నుంచీ వస్తున్న ఒత్తిడి చూసి, చదువంటే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. - చదువుల ఒత్తిడితో నలిగిపోతున్న చిన్నారులు - ప్రమాదకరమంటున్న నిపుణులు రామచంద్రపురం : ఉదయం 7 గంటలకు మోయలేనంత పుస్తకాల బరువుతో ఉన్న బ్యాగ్‌ను వీపుమీద వేసుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి చేరటం నేటి విద్యార్థులకు దాదాపు నిత్యకృత్యమైంది. రెండేళ్లు దాటిన మరుక్షణమే పిల్లలను బలవంతంగా పాఠశాలల్లో చేర్పించడం చాలామంది తల్లిదండ్రులకు అలవాటుగా మారింది. ఇక అక్కడినుంచి జీవితంలో స్థిరపడేవరకూ, స్థిరపడిన తరువాత కూడా చాలామంది తీవ్రమైన ఒత్తిడితోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ధోరణి విపరిమాణాలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా కొంతమంది పిల్లల జీవితాలు తలకిందులవుతుండగా, మరికొంతమంది ఒత్తిడి తట్టుకోలేక అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. సమస్యలకు దారి తీస్తున్న ఒత్తిడి పరీక్షలే విద్యార్థులను భయపెట్టే భూతాలు. డైలీ టెస్టులని, వీక్లీ టెస్టులనీ, మంత్లీ టెస్టులని, అసైన్మెంట్లని.. ఇలా రకరకాల రూపాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మితిమీరిన హోంవర్కులు దీనికి తోడవుతున్నాయి. టెక్నో సంస్కృతిని ప్రోత్సహిస్తున్న కొన్ని కార్పొరేట్ విద్యావ్యాపార సంస్థలు ఎనిమిదో తరగతి నుంచే ఇంటర్ సిలబస్ బోధిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. అమలుకు నోచని గ్రేడింగ్ విధానం మార్కుల విధానంవల్ల పిల్లలపై వస్తున్న ఒత్తిడిని గమనించిన ప్రభుత్వం గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ ఏ పరీక్షలకూ మార్కులు వేయకూడదు. విద్యార్థులు రాసిన జవాబులనుబట్టి గ్రేడులు మాత్రమే ఇవ్వాలి. కానీ ఈ విధానం పదో తరగతి పరీక్షా ఫలితాలకు మాత్రమే పరిమితమైంది. ఒత్తిడి తగ్గించండిలా.. - చిన్నతనంలోనే బడుల బందిఖానాల్లో చేర్చే పద్ధతికి స్వస్థి చెప్పాలి. - ఐక్యూనుబట్టి పిల్లలను పైచదువులకు ప్రోత్సహించాలి. వారిపై చదువులను బలవంతంగా రుద్దకూడదు. - సెలవు రోజుల్లో చదవమంటూ ఒత్తిడి చేయకూడదు. - పిల్లల మనో వికాసానికి చిత్రలేఖనం, క్రీడలు, లలిత కళలపై ఆసక్తి కలిగించాలి. - స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించాలంటూ ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలి. అనర్థాలకు దారి తీస్తుంది తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి సరికాదు. విద్యా సంస్థల్లో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు మార్కుల కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలకంటే ముందు వారి మార్కులు తెలుసుకునేది తల్లిదండ్రులే. ఇది పిల్లలపై సహజంగా ఒత్తిడిని పెంచుతుంది. - పి.మురళీమోహన్, న్యాయవాది అదనపు సిలబస్‌తో భారం విద్యార్థుల స్థాయికి సరిపోయిన సిలబస్‌ను ప్రభుత్వం తయారు చేస్తోంది. ఇది చాలదని విద్యాసంస్థల్లో అదనపు సిలబస్ రుద్దుతున్నారు. అదనపు సిలబస్ ఉన్న పాఠశాలల పైనే తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. పిల్లవాడి జ్ఞాపక శక్తికి మించిన సమాచారాన్ని వారిపై రుద్దుతున్నారు. - యు.గనిరాజు, పీడీ ఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వారిష్టానికే వదిలేయాలి చదువులో పిల్లలను నచ్చినది చేయమంటే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది. మంచి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. - కె.శ్రీనివాసరావు, అధ్యాపకులు, రామచంద్రపురం సాంకేతికతను మరింతగా పెంచుకోవాలి పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకోవటం ద్వారా పిల్లల బ్యాగ్‌ల బరువు తగ్గించవచ్చు. దీనికితగ్గ ప్రణాళికలను విద్యా శాఖ చేపట్టాలి. దీంతో చిన్నారుల్లో కొంతవరకూ ఒత్తిడి తగ్గుతుంది. - ఎం.వెంకట్రావు, ప్రిన్సిపాల్, సన్ స్కూల్