బాల్యం.. భారం..
బాల్యం మధుర జ్ఞాపకమని ఒకప్పుడు చెప్పుకునేవారు. మధుర జ్ఞాపకం మాటలా ఉంచితే.. విద్య.. వ్యాపారమైన ప్రస్తుత కాలంలో.. మితిమీరిన చదువుల భారంతో బాల్యం నలిగిపోతోంది. నూటికి తొంభై మార్కులు సాధించే విద్యార్థులు సైతం అన్నివైపుల నుంచీ వస్తున్న ఒత్తిడి చూసి, చదువంటే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది.
- చదువుల ఒత్తిడితో నలిగిపోతున్న చిన్నారులు
- ప్రమాదకరమంటున్న నిపుణులు
రామచంద్రపురం : ఉదయం 7 గంటలకు మోయలేనంత పుస్తకాల బరువుతో ఉన్న బ్యాగ్‌ను వీపుమీద వేసుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి చేరటం నేటి విద్యార్థులకు దాదాపు నిత్యకృత్యమైంది. రెండేళ్లు దాటిన మరుక్షణమే పిల్లలను బలవంతంగా పాఠశాలల్లో చేర్పించడం చాలామంది తల్లిదండ్రులకు అలవాటుగా మారింది. ఇక అక్కడినుంచి జీవితంలో స్థిరపడేవరకూ, స్థిరపడిన తరువాత కూడా చాలామంది తీవ్రమైన ఒత్తిడితోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ధోరణి విపరిమాణాలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా కొంతమంది పిల్లల జీవితాలు తలకిందులవుతుండగా, మరికొంతమంది ఒత్తిడి తట్టుకోలేక అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు.
సమస్యలకు దారి తీస్తున్న ఒత్తిడి
పరీక్షలే విద్యార్థులను భయపెట్టే భూతాలు. డైలీ టెస్టులని, వీక్లీ టెస్టులనీ, మంత్లీ టెస్టులని, అసైన్‌మెంట్‌లని.. ఇలా రకరకాల రూపాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మితిమీరిన హోంవర్కులు దీనికి తోడవుతున్నాయి. టెక్నో సంస్కృతిని ప్రోత్సహిస్తున్న కొన్ని కార్పొరేట్ విద్యావ్యాపార సంస్థలు ఎనిమిదో తరగతి నుంచే ఇంటర్ సిలబస్ బోధిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..
అమలుకు నోచని గ్రేడింగ్ విధానం
మార్కుల విధానంవల్ల పిల్లలపై వస్తున్న ఒత్తిడిని గమనించిన ప్రభుత్వం గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకూ ఏ పరీక్షలకూ మార్కులు వేయకూడదు. విద్యార్థులు రాసిన జవాబులనుబట్టి గ్రేడులు మాత్రమే ఇవ్వాలి. కానీ ఈ విధానం పదో తరగతి పరీక్షా ఫలితాలకు మాత్రమే పరిమితమైంది.
ఒత్తిడి తగ్గించండిలా..
- చిన్నతనంలోనే బడుల బందిఖానాల్లో చేర్చే పద్ధతికి స్వస్థి చెప్పాలి.
- ఐక్యూనుబట్టి పిల్లలను పైచదువులకు ప్రోత్సహించాలి. వారిపై చదువులను బలవంతంగా రుద్దకూడదు.
- సెలవు రోజుల్లో చదవమంటూ ఒత్తిడి చేయకూడదు.
- పిల్లల మనో వికాసానికి చిత్రలేఖనం, క్రీడలు, లలిత కళలపై ఆసక్తి కలిగించాలి.
- స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించాలంటూ ప్రొఫెసర్ యశ్‌పాల్ కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలి.
అనర్థాలకు దారి తీస్తుంది
తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి సరికాదు. విద్యా సంస్థల్లో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు మార్కుల కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలకంటే ముందు వారి మార్కులు తెలుసుకునేది తల్లిదండ్రులే. ఇది పిల్లలపై సహజంగా ఒత్తిడిని పెంచుతుంది.
- పి.మురళీమోహన్, న్యాయవాది
అదనపు సిలబస్‌తో భారం
విద్యార్థుల స్థాయికి సరిపోయిన సిలబస్‌ను ప్రభుత్వం తయారు చేస్తోంది. ఇది చాలదని విద్యాసంస్థల్లో అదనపు సిలబస్ రుద్దుతున్నారు. అదనపు సిలబస్ ఉన్న పాఠశాలల పైనే తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. పిల్లవాడి జ్ఞాపక శక్తికి మించిన సమాచారాన్ని వారిపై రుద్దుతున్నారు. - యు.గనిరాజు, పీడీ
ఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి
వారిష్టానికే వదిలేయాలి
చదువులో పిల్లలను నచ్చినది చేయమంటే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది. మంచి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.
- కె.శ్రీనివాసరావు,
అధ్యాపకులు, రామచంద్రపురం
సాంకేతికతను మరింతగా పెంచుకోవాలి
పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకోవటం ద్వారా పిల్లల బ్యాగ్‌ల బరువు తగ్గించవచ్చు. దీనికితగ్గ ప్రణాళికలను విద్యా శాఖ చేపట్టాలి. దీంతో చిన్నారుల్లో కొంతవరకూ ఒత్తిడి తగ్గుతుంది.
- ఎం.వెంకట్రావు, ప్రిన్సిపాల్, సన్ స్కూల్