ఇంత అధ్వానమా?
పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి వసతిపై సుప్రీం కోర్టు బృందం అసంతృప్తి
పలు పాఠశాలల సందర్శన పరిస్థితులపై ఆరా
మెదక్ టౌన్ /చిన్నశంకరంపేట / తూప్రాన్ /చేగుంట: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతిని తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం శుక్రవారం జిల్లాలో పర్యటిం చింది. పలు పాఠశాలల్లో పరిస్థితులు అధ్వానంగా ఉండడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిపోను మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేకపోవడంపై అధికారులను నిలదీశారు. మెదక్ మండలం, మెదక్ పట్టణం, రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, తూప్రాన్ మండలాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలను బృందం సభ్యులు సందర్శించారు.
పాఠశాలల్లోని మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను బృందం సభ్యులు పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బృందం ప్రతినిధులు అశోక్, కుమార్‌గుప్తా, టీవీ రత్నం, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలను మెరుగు పర్చేందుకే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమన్నారు. తాము పరిశీలించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామన్నారు. బృందం వెంట డీఈఓ నజీమొద్దీన్, ఆర్‌వీఎం పీఓ యాస్మిన్ బాషా, డిప్యూటీ ఈఓ లింబాద్రి జిల్లా అధికారులు ఉన్నారు.
చిన్నశంకరంపేటలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 500 మందికి ఒకటే మరుగుదొడ్డి ఉండటంపై బృందం సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే విషయమై జిల్లా అధికారులను ప్రశ్నించారు. పలు పాఠశాలల్లోని మరుగుదొడ్లను తాము వస్తున్నామనే శుభ్రం చేసినట్టుందని వారు వ్యాఖ్యానించారు. చేగుంటలో మరుగుదొడ్ల నిర్వహణ తీరుపై బృందం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడియారం పాఠశాలలోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం ఏదని?, ఇంకా ఎన్నాళ్లు నిర్మిస్తారని?, పాఠశాల అభివృద్ధి నిధులేం చేస్తున్నారని? ప్రధానోపాధ్యాయురాలిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
తూప్రాన్ మండలం మనోహరాబాద్, రామాయిపల్లి, పట్టణంలోని బాలుర,బాలికల పాఠశాలలను సం దర్శించారు. విద్యార్థుల హాజరు శా తం, సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు సదుపాయంపై హెచ్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు.