ఇందూరు: ‘నీళ్లుంటే, బాత్‌రూంలుండవు.. బాత్‌రూంలుంటే నీళ్లుండవు. సన్నబియ్యం వండుతున్నరు.. కానీ కూరలు, పప్పులు నాణ్యంగా ఉండవు. పప్పును చూస్తే నీళ్లలో పసుపు కలిపినట్లుగా ఉంటుంది. కొన్ని హాస్టళ్లను చూస్తే పశువులా కొట్టాల్లా ఉన్నారుు.. ఇదేనా... పిల్లలకు ఇచ్చే సంక్షేమం..’ అని సాంఘిక సంక్షేమ స్థాయీసంఘం సంబంధిత శాఖాధికారులపై మండిపడింది. జిల్లా పరిషత్‌లో సాంఘిక సంక్షేమం స్థాయి సంఘం సమావేశం ఆ కమిటీ చైర్మన్ కున్యోత్ లత అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు సంక్షేమాధికారుల పనితీరును ఎండగట్టారు. చదివించే స్థోమత లేని పేద తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంతో వసతిగృహాలకు పంపుతున్నారు. అలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులనూ ఇస్తోంది. కానీ.. బాధ్యతలను నెరవేర్చాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వార్డెన్‌లు స్థానికకంగా ఉండాలని నిబంధనలు ఉన్నా.. పాటించడం లేదని ఆరోపించారు. సహాయ సంక్షేమాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే వార్డెన్‌లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కొన్ని వసతిగృహాల్లో విద్యార్థులకు పెట్టే భోజన మెనూ లేదని, హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అసహనం వ్యక్తం చేశారు.
తాగునీటి, టాయిలెట్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తాను విజిట్ చేసినప్పుడు నిజాలు బయటపడినట్లు తెలిపారు. తమ మండలంలో ఉన్న ఓ వసతిగృహం పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉందని, పశువుల కొట్టాన్ని తలపిస్తోందని స్థాయిసంఘం చైర్మన్ కున్యోత్ లత ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్, కుద్వాన్‌పూర్ వసతిగృహాల వార్డెన్‌ల పనితీరు బాగోలేదని, వారికి మెమోలు జారీ చేయాలని స్థాయీ సంఘం సభ్యులు తీర్మానించారు. కల్యాణలక్ష్మి పథకం కార్యక్రమాల్లో జడ్పీటీసీలను పిలువడం లేదని, ఇక ముందు తప్పనిసరిగా పిలువాలని నిర్ణయించారు.
సాక్షి కథనంతో ఆరా..
డిసెంబర్‌లో ఎస్సీ వసతిగృహాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన వాటిలో గోల్‌మాల్ జరిగిందని, నాణ్యత లేని దుప్పట్లు పంపిణీ చేశారని పక్షం రోజుల కిత్రం సాక్షి జిల్లా టాబ్లాయిడ్‌లో ‘దుప్పట్ల కొనుగోల్‌మాల్’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై జడ్పీ ఇన్‌చార్జి సీఈఓ, ఏజేసీ రాజారాం ఆరా తీశారు. స్థాయి సంఘ సమావేశానికి వచ్చిన ఏఎస్‌డబ్ల్యుఓ జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. దుప్పట్ల కొనుగోలు టెండర్లు పిలువడం మట్టుకే పరిశీలన కమిటీని సద్వినియోగం చేసుకున్నారని, పంపిణీ చేసే సమయంలో కమిటీ ముందు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతను చూడకుండా ఎలా పంపిణీ చేశారన్నారు.
దీని విషయంలో తనకు వివరణ ఇవ్వాలని దేశించారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఇంజినీరింగ్ శాఖ చేపడుతున్న భవనాల నిర్మాణాల నివేదిక పాతది ఇవ్వడంపై సంబంధిత అధికారిపై మండిపడ్డారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న బీసీ స్టడీ సర్కిల్‌లో అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్నాం మూడు గంటలకు పనుల స్థాయి సంఘ సమావేశం జరిగింది. భవనాలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు.
ఇదేనా ‘సంక్షేమం’..!
Published Fri, Feb 13 2015 3:46 AM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
Advertisement