సాక్షి, అమరావతి: బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటం, అది ఇప్పటికే కొన్ని దేశాలకు వ్యాప్తి చెంది ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ టెస్టుల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. కరోనా సమయానికి మన రాష్ట్రం ఒక్క టెస్టు కూడా చేసే పరిస్థితి లేని దశ నుంచి నేడు రోజుకు 70 వేల టెస్టులు చేసే స్థాయికి వచ్చింది. తాజాగా రోజుకు 1.10 లక్షల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే దిశగా ల్యాబొరేటరీల స్థాయిని పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిలో మరిన్ని టెస్టులు చేసేందుకు వీలుగా మెషినరీని పెంచారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ల్యాబొరేటరీ వ్యవస్థను బలోపేతం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
పెద్ద ఎత్తున ఏర్పాట్లు
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 75 వేల వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. దీన్ని 1.10 లక్షలకు పెంచుతున్నారు. ఈ మేరకు తాజాగా మెషీన్లు కొనుగోలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున వచ్చినా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేశారు. భవిష్యత్‌లో రకరకాల వైరస్‌లకు సంబంధించిన వ్యాధుల నిర్ధారణకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తాజా సామర్థ్యానికి సరిపడా సిబ్బందినీ నియమిస్తున్నారు. మైక్రో బయాలజిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బందిని సుమారు 300 మందిని నియమించేందుకు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేశారు.
ట్రూనాట్ టెస్టులు నిలిపివేత
రాష్ట్రంలో మూడు రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్టీపీసీఆర్ గోల్డెన్ స్టాండర్డ్‌గా పిలుస్తారు. వైరాలజీ ల్యాబొరేటరీల్లో గొంతు లేదా ముక్కులో నుంచి తీసిన ద్రవాన్ని పరీక్షిస్తారు. ఇప్పుడు ఈ టెస్ట్ కిట్‌ల వ్యయం తగ్గింది. ట్రూనాట్ మెషీన్ల ద్వారా కూడా ఇదే పద్ధతిలో ప్రక్రియ జరుగుతుంది. కాకపోతే ఇందులో చిప్ పద్ధతిలో ఫలితం వస్తుంది. ఈ టెస్టుకు కొంచెం ఖరీదు ఎక్కువ. అందుకే ఇప్పుడు దీనిని నిలిపివేశారు. మూడోది ర్యాపిడ్ యాంటీజెన్. వీటిని కూడా క్రమంగా తగ్గిస్తూ కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయాలన్న ఉద్దేశంతో వైరాలజీ ల్యాబొరేటరీల సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా భవిష్యత్‌లో వైరస్ కారణంగా వచ్చే వ్యాధులను ప్రతి జిల్లాలోనూ తక్షణమే గుర్తించేందుకు వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment