
ఉన్నత విద్యకు వారధిగా ఉండే ఇంటర్ విద్యకు 50 ఏళ్లు వచ్చాయి. 1968లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నద్ధమయ్యింది. దీనికోసం ఇంటర్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ బి.ఉదయలక్ష్మి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. 26వ తేదీ నుంచి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
తిరుపతి ఎడ్యుకేషన్: 1968కి ముందు ఇంటర్ స్థానంలో 11, 12 తరగతులుగా పాఠశాల విద్య బోర్డు కింద ఉండేది. అప్పట్లో పాఠశాల విద్య, ఉన్నత విద్యగా విద్యావిధానం ఉండేది. విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు 10+2+3 విద్యా విధానాన్ని తీసుకురావాలని కొటారి కమిషన్ సూచించింది. దీంతో పదో తరగతి తర్వాత ఇంటర్ విద్యను తీసుకురావాలని నిశ్చయించారు. అలా 1968లో తొలిసారిగా 11, 12 తరగతుల స్థానంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యను ప్రవేశపెట్టారు. పాఠశాల విద్య స్థానంలో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్యామండలిని 1969లో ఏర్పాటు చేశారు.
ఉన్నత విద్యకు వారధి ఇంటర్
ఉన్నత విద్యకు వారధిగా ఇంటర్ విద్య నిలుస్తోంది. ఇంటర్ విద్యలో ప్రతిభ కనబరిస్తేనే ఉన్నత విద్యలోకి అడుగులు వేయాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించిన ఇంటర్ విద్య ఉన్నత విద్యలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించి, విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి బాటలు వేస్తోంది. ఇంటర్ విద్య వచ్చినప్పటి నుంచి విద్యావిధానంలో సమూల మార్పులు వచ్చాయని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ ఉన్నత విద్యకు బంగారు బాటలు వేయడానికి ఇంటర్ విద్య దోహదపడుతోందని చెబుతున్నారు.
స్వర్ణోత్సవాల సంబరాలు
ఇంటర్ విద్యను ప్రవేశపెట్టి 50ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఇంటర్ విద్య బోర్డు స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇంటర్ విద్య ప్రాముఖ్యత, ఔన్నత్యంపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వివిధ పోటీలను నిర్వహించనుంది. జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనుంది. పోటీలతో పాటు ఆయా కళాశాలలున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీలు చేపట్టనుంది. దీనికోసం షెడ్యూల్‌ను ఇంటర్ విద్య విడుదల చేసింది.
26 నుంచి పోటీలు
స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు పండుగ వాతావరణాన్ని తలపించేలా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. వ్యాసరచన, వక్తృత్వ, ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు ఆయా కళాశాలల్లోనే నిర్వహించి, విజేతలను ఎంపిక చేస్తారు. వీటిని పరిశీలించి, విజేతలను ఎంపిక చేసి డిసెంబర్ 3నుంచి 7వ తేదీ వరకు జరిగే జోనల్ స్థాయి పోటీలకు, అక్కడ గెలుపొందిన వారికి 10 నుంచి 15వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో సంబరాలు నిర్వహించనున్నారు.
స్వర్ణోత్సవ కమిటీ
జిల్లావ్యాప్తంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అన్ని యాజమాన్య కళాశాలల్లో స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించనున్నారు. స్వర్ణోత్సవ వేడుకలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో 9మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఆర్‌ఐఓ/డీవీఈఓ, ముగ్గురు ప్రిన్సిపాల్స్, ముగ్గురు జూనియర్ లెక్చరర్లు, ఒక ఫిజికల్ డైరెక్టర్, ఒక లైబ్రేరియన్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.
స్వర్ణోత్సవాలు జరుపుకోవాలి
ఇంటర్ విద్య ఔన్నత్యాన్ని చాటేలా స్వర్ణోత్సవాలు జరుపుకోనున్నాం. ఈనెల 26వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 275 అన్ని యాజ మాన్య జూనియర్ కళాశాలల్లో పండుగ వాతావరణం తలపించేలా సంబరాలు నిర్వహించాలి. వాటిని ఫొటోలు, వీడియోలు తీసి పంపించాలి. ప్రతి కళాశాలలోనూ తప్పనిసరిగా స్వర్ణోత్సవాలు నిర్వహించాలి.–ఎం.కృష్ణయ్య, ఇంటర్ ప్రాంతీయపర్యవేక్షణాధికారి, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment