పాఠశాల విద్యలోకి ఇంటర్‌ | Intermediate Education to be incorporated in school education in AP | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యలోకి ఇంటర్‌

Published Fri, Jul 13 2018 3:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

Intermediate Education to be incorporated in school education in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం మూడంచెలుగా ఏర్పాటైన ఉన్నత, మాథ్యమిక, ప్రాథమిక విద్యా వ్యవస్థను త్వరలో రెండంచెల వ్యవస్థగా మార్చనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో మిళితం చేయనున్నట్లు ప్రకటించారు.

ఇంటర్‌ విద్య ఇప్పటికే జాతీయ స్థాయిలో పాఠశాల విద్యలో భాగంగానే ఉందని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ‘విజ్ఞాన భూమి’ (నాలెడ్జ్‌ హబ్‌)గా తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయాల నుంచి తక్షణం కార్యాచరణను ఆరంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ లక్ష్య సాధనలో కీలకపాత్ర వహించాలని రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు చెందిన వీసీలకు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన వీసీల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.

వచ్చే వారం నుంచి ‘జ్ఞానధార’
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుం టున్న 18 లక్షల మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే కార్యక్రమా నికి రూపకల్పన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సాంకేతిక అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, నవ్యావిష్కరణలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం లాంటి లక్ష్యాలతో జూలై మూడో వారం నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమానికి ‘జ్ఞానధార’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఎవరైనా ఇంతకంటే మంచి పేరును సూచిస్తే పరిశీలిస్తామని చెప్పారు. విద్య, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో పేరు పొందిన ప్రముఖులను ఆహ్వానించి వారి నుంచి ప్రేరణ పొందేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సీఎం సూచించారు.

విద్యార్ధులతో మరిన్ని ఈవెంట్లు
ఒక్కో వర్శిటీలో ఒక్కో రోజు నిర్వహించే ఈ కార్యక్రమానికి తాను హాజరై 10 వేల మంది విద్యార్థులతో నేరుగా మాట్లాడతానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో పాల్గొనే విద్యార్థులను వివిధ పోటీల ద్వారా ఎంపిక చేయాలని సూచించారు.

పోలవరం, అమరావతి, ఇస్రో ప్రగతి, ఐటీఐవోటీ, స్టార్టప్స్‌ లాంటి అంశాలపై విద్యార్థులకు సదస్సు నిర్వహించాలన్నారు. సీఐఐతోపాటు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ఇందులో  భాగస్వాములుగా చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణ, సమన్వయ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యామండలి, ఆయా వర్శిటీలే దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలన్నారు. ఈవెంట్‌ రిజిస్ట్రేషన్లన్నీ ప్రత్యేకంగా రూపొందించే యాప్‌ ద్వారా జరుగుతాయి.

18న శ్రీకాకుళం నుంచి ప్రారంభం
ఈనెల 18న శ్రీకాకుళం డాక్టర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం నుంచి ‘జ్ఞానధార’ ఈవెంట్‌ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2న విజయనగరం జేఎన్‌టీయూలో, ఆగస్టు 17న విశాఖ ఏయూలో, ఆగస్టు 31న పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్‌ ఉద్యాన వర్శిటీలో, సెప్టెంబరు 14న రాజమహేంద్రిలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. మచిలీపట్నం కృష్ణా వర్శిటీ, విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీలకు కలిపి సెప్టెంబరు 30న కార్యక్రమం ఏర్పాటవుతుంది.

అక్టోబరు 12న నాగార్జున, ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయాలకు కలిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మిగిలిన వర్సిటీల్లో కూడా వరుసగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అవసరాన్ని బట్టి తేదీల్లో మార్పులు చేస్తారు. ప్రతి లక్ష మంది జనాభాకు 48 కళాశాలలతో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచిందని వీసీ సమావేశంలో ఉన్నత విద్యపై నివేదిక సమర్పించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యానాధ్‌ దాస్‌ తెలిపారు. 27 వర్శిటీలు, 7 జాతీయ ప్రాధాన్యం కలిగిన విద్యా సంస్థలు రాష్ట్రంలో వున్నాయన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిలో దేశంలో ఏపీ మూడవ స్థానంలో ఉందని చెప్పారు.

చదువుకుంటూ పనిచేసే విధానం రావాలి
నాలుగేళ్ల కళాశాల చదువు నలభై ఏళ్ల కెరియర్‌కు ఎలా ఉపకరిస్తుందో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని వీసీలను సీఎం కోరారు. పుస్తకాల్లో బోధించే సిద్ధాంతాలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంటోందన్నారు. ఆలోచనలు, ఆచరణకి దూరం పెరిగిపోయేలా మన విద్యావిధానం కొనసాగడం దురదృష్టకరమన్నారు.

వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటీవల ఐఎఎస్, ఎంసెట్, ఐఐటీలకు ఎంపికైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషమని చెప్పారు. ప్రతి వర్శిటీని నాలుగైదు పరిశ్రమలకు అనుసంధానం చేయడం ఇక నుంచి తప్పనిసరిగా జరగాలన్నారు. చదువుకుంటూ పనిచేసే అవకాశాలు కల్పిస్తూ ప్రతి విద్యార్ధిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధానాలు రావాలన్నారు.

హెరిటేజ్‌ను ఈ–కామర్స్‌ వైపు వెళ్లమన్నా
అందరూ ఐఐటీలోనే చదవాలనే ధోరణి సరికాదని, రానున్న కాలంలో ఆతిథ్యం, ఆహార పరిశ్రమకు ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సుల వైపు మళ్లాలని వీసీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఫ్లిప్‌కార్ట్‌ స్ఫూర్తితో తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌ను కూడా ఈ–కామర్స్‌ వైపు మళ్లమని సూచించానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement