సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు, మార్కుల వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన రీ వెరిఫికేషన్‌లో సున్నా మార్కులు వచ్చిన సమాధానాలు, అసలు దిద్దని సమాధానాలను మాత్రమే పరిశీలించి మార్కులు వేశారని పేర్కొన్నారు. అలాగే మార్కుల మొత్తాన్ని కూడా సరిచూశారని తెలిపారు. బోర్డు నిబంధనల ప్రకారం ఒకసారి మార్కులు వేసిన జవాబులను పునఃపరిశీలన చేయడం మాత్రం జరగదని స్పష్టంచేశారు. అంటే రీ వాల్యుయేషన్ ఉండదని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ఆయన కోరారు. రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన ఫస్టియర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాయడానికి సబ్జెక్టుకు రూ.150 చొప్పున కాలేజీలో ఫీజు చెల్లించి, ప్రిన్సిపాల్ ద్వారా బోర్డుకు మాన్యువల్ నామినల్ రోల్ పంపించాలని సూచించారు.
ఎంఈసీ విద్యార్థులు ఇది గమనించాలి...
ఎంఈసీ విద్యార్థులు గణితంలో 75 మార్కుల ప్రశ్నపత్రానికే సమాధానాలు రాసినప్పటికీ, వారికి వచ్చిన మార్కులను 50 మార్కులకు అనుగుణంగా గుణించి మెమోలో వేస్తారని అశోక్ వివరించారు. ఉదాహరణకు ఓ విద్యార్థికి గణితం పేపర్లో 18 మార్కులు వస్తే.. వాటిని 2/3తో గుణించి 12 మార్కులుగా నిర్ధారించి, ఆ మేరకు మెమోలో ప్రింట్ చేస్తారని తెలిపారు. అందువల్ల విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల కంటే మెమోలో తక్కువ వచ్చాయని ఆందోళన చెందకుండా ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
వెబ్‌సైట్‌లో ఇంటర్ జవాబు పత్రాలు
Published Wed, May 29 2019 2:05 AM | Last Updated on Wed, May 29 2019 2:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment