ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాలి
ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థుల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తప్పిన సబ్జెక్టులకు తప్ప ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టుల ఇంప్రూవ్‌మెంట్‌కు ఇంటర్ బోర్డు అవకాశం ఇవ్వక పోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. శనివారం పరీక్ష ఫీజుకు తుది గడువు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఒకటి, రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాని వారు మిగతా వాటిల్లో మెరుగైన మార్కుల కోసం ఇంప్రూవ్‌మెంట్ రాసుకొనే అవకాశం ఉంది. కానీ బోర్డు అధికారులు అందుకు అనుమతించడం లేదు.
గడువు పెంచండి...
ఈ నెల 16న ఇంటర్ ఫలితాలు వచ్చాయి. మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టడానికి గడువు శనివారంతో ముగుస్తుంది. మే 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. కానీ, ఫెయిలైన విద్యార్థులు బెటర్‌మెంట్ కూడా రాయాలంటే ఇంటర్ బోర్డు అనుమతి కావాలని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇంటర్ బోర్డుకు వెళ్లి అడిగితే... అక్కడ అధికారులెవరూ నోరు మెదపడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా శనివారం బ్యాంకులు కూడా బంద్ ఉన్నాయని, ఇలాగైతే తమ పిల్లల భవిష్యత్ ఏం కావాలని వాపోతున్నారు. తమ పిల్లలకు బెటర్‌మెంట్ అవకాశం కల్పించాలని, ఫీజు గడువు పెంచాలని కోరుతున్నారు.