
సాక్షి, హైదరాబాద్: కుర్చీలకు అతుక్కుపోయిన ‘మాజీ’లకు ఉద్వాసన పలకాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. పదవీ విరమణ పొందినా ఆయా శాఖల్లో సలహాదారులుగా, ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్న వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఇలా తిష్ట వేసిన వారితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని నిర్ధారణకు వచ్చింది. అన్ని శాఖల్లో ఇలా కొనసాగుతున్న వారిని గుర్తించి తొలగించాలని నిర్ణయించింది. ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారమే దీనికి కారణంగా కనిపిస్తోంది. పదవీ విరమణ పొందినా అదే శాఖలో కొనసాగుతున్న కొందరితోనే ఇంటర్ మార్కుల వ్యవహారంలో తప్పులు జరిగినట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది.
తాజాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన రాద్ధాంతం వెనుక ఈ అధికారుల పాత్ర ఉందని నిఘా వర్గాలు సీఎం కేసీఆర్ నివేదిక సమర్పించాయి. మాజీ అధికారులే బోర్డు పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పదవీ విరమణ పొందినా... అదే పోస్టుల్లో కొనసాగుతున్న ఉద్యోగులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో శాఖల వారీగా ఈ తరహాలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కతీయాలని సీఎం స్పష్టం చేశారు. మెరుగైన సేవలు అందిం చేందుకు అనుభవజ్ఞులను కొన్ని శాఖల్లో కొనసాగించాలని రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని పలు శాఖల్లో కొందరు పదవీ విరమణ పొందినా రకరకాల కారణాలతో అదే శాఖలో విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఆయా శాఖల్లోని రెగ్యులర్ ఉద్యోగులు, ‘విరమణ’ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
1,127 మంది ఉన్నట్లు లెక్క...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో 1,127 మంది ఉద్యోగులు కన్సల్టెంట్, ఓఎస్‌డీ పోస్టుల పేరు తో పాత విధులనే నిర్వర్తిస్తున్నారని తేలింది. ఇందులో మాజీ ఐఏఎస్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మొదలు కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఉన్నట్లు స్పష్టమైంది. వీరందరిని తొలగించాలని నిర్ణయించింది. పదవీ విరమణ చేసినా కన్సల్టెంట్లుగా అవే సీట్లలో కొనసాగుతుండడంతో పదోన్నతులు, పోస్టింగ్‌లలో దిగువ శ్రేణి అధికారులకు అన్యాయం జరుగుతోంది. శాఖలో వారి పెత్తనమే కొనసాగడంతో రెగ్యు లర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment