సాక్షి, అమరావతి: ఇంటర్ విద్యను కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఆదాయ మార్గంగా మార్చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా కుప్పలు తెప్పలుగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వాస్తవ సంఖ్యకు, రికార్డుల్లో చూపించే లెక్కకు ఎక్కడా పొంతన ఉండదు. నిర్ణీత ఫీజు కంటే పది రెట్లు ఎక్కువగా పిండుకుంటున్నా ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. అనుమతులు లేకుండా హాస్టళ్లను తెరుస్తున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
మూడొంతుల మంది ప్రైవేట్ కాలేజీల్లోనే..
రాష్ట్రంలో 3,361 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1,143 మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు కాగా తక్కిన 2,218 కాలేజీలు కార్పొరేట్ సంస్థలవే. గతంలో ప్రభుత్వం రూపొందించిన గణాంకాల ప్రకారం శ్రీచైతన్య పరిధిలో 186 కాలేజీలుండగా అందులో 1.52 లక్షల మంది చదువుతున్నట్లు పేర్కొంది. నారాయణ పరిధిలోని 152 కాలేజీల్లో 85 వేల మంది, ఎన్‌ఆర్‌ఐ యాజమాన్యం పరిధిలోని 38 కాలేజీల్లో 14 వేల మంది, శ్రీగాయత్రి పరిధిలోని 27 కాలేజీల్లో 12 వేల మంది, ఇతర ప్రైవేట్ కాలేజీల్లో మిగతా విద్యార్థులు చదువుతున్నట్లు తేల్చారు.
అప్పట్లో విద్యార్థుల సంఖ్య 7 లక్షలు మాత్రమే కాగా ఇప్పుడు ఇంటర్‌లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య గత ఏడాది 10.26 లక్షల వరకు ఉంది. వీరిలో 3 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా మిగతా వారంతా ప్రైవేట్ కళాశాలల్లోనే చేరుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు కొన్ని కాలేజీలకే ఇంటర్ గుర్తింపు తీసుకుని పలు బ్రాంచీలు నిర్వహిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి తదితర పట్టణాల్లో ఇలా జోరుగా విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి.
ఎండాకాలంలోనే ప్రవేశాలు పూర్తి
ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి బోర్డు పలు నిబంధనలు విధిస్తూ సరŠుయ్యలర్లు జారీ చేసింది. నిర్ణీత షెడ్యూల్ విధించినా కార్పొరేట్ విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం మార్చి 29 నుంచి మే 31 వరకు సెలవులు ఇచ్చి జూన్ 1న కాలేజీలను పునః ప్రారంభించాలి. మొదటి విడత ప్రవేశాలను అప్పుడే నిర్వహించాల్సి ఉండగా ప్రైవేట్ కాలేజీలు అంతకు ముందే వేసవి సెలవుల్లోనే చేపడుతున్నాయి. ఒక్కో సెక్షన్‌కు గరిష్టంగా 88 మంది చొప్పున ఎన్ని సెక్షన్లకు అనుమతి ఉంటే అంత మందిని మాత్రమే చేర్చుకోవాల్సి ఉన్నా పరిమితికి మించి ప్రవేశాలను కల్పిస్తున్నాయి.
రిజర్వేషన్లకు చెల్లుచీటీ
నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29% సీట్లు ఇవ్వాలి. అందులో బీసీ(ఏ) 7%, బీసీ(బీ) 10 శాతం, బీసీ(సీ) 1%, బీసీ(డీ) 7 శాతం, బీసీ(ఈ)కి 4% చొప్పున సీట్లు ఇవ్వాలి. దివ్యాంగులకు 3 శాతం, ఎన్‌సీసీ, క్రీడల కోటా కింద 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33% సీట్లు బాలికలకు కేటాయించాలి. ఈ నిబంధనలను కార్పొరేట్ కాలేజీలు ఎక్కడా పట్టించుకోవడం లేదు.
ఆన్‌లైన్‌లో ప్రవేశాలతో ఫీజుల దందాకు తెర
ఇంజనీరింగ్ మాదిరిగానే ఆన్‌లైన్‌లో ప్రవేశాల విధానాన్ని తెస్తే ప్రైవేట్ కాలేజీల అరాచకాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఫీజులను కూడా ప్రభుత్వమే ఆన్‌లైన్ ద్వారా సంబంధిత కాలేజీలకు చెల్లించేలా ఏర్పాటు చేస్తే అడ్డగోలు వసూళ్లకు తెర పడుతుందని, ప్రవేశాల్లో పారదర్శకత వస్తుందని సూచిస్తున్నారు. అయితే ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల విద్యా వ్యాపారానికి కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ముందుకు రావడం లేదు.
చీమల పుట్టల్లా హాస్టళ్లు...
ఒకవైపు లెక్కకు మించి ప్రవేశాలను కల్పిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అనుమతులు లేకుండానే కాలేజీలకు అనుబంధంగా ఇరుకు గదుల్లో హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కాలేజీల్లో ప్రవేశానికి నిబంధనల ప్రకారం డేస్కాలర్లకు రూ.12,500 చొప్పున మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.60 వేల నుంచి రూ.లక్షకు పైనే గుంజుతున్నాయి. ఇక హాస్టళ్లలో చేరేవారి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా పిండుకుంటున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment