
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,294 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 9,63,546 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. దీనికి ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్‌లోకి అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు ఉదయం 8:30 గంటల కంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది.
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు..
ఈ సారి ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని తెలిపారు. ఇన్విజిలేటర్లు కూడా ఫోన్లను తీసుకెళ్లవద్దని పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే బోర్డు కార్యాలయంలోని కంట్రోల్‌రూమ్ 040–24601010, 040–24732369 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. 4,55,635 మంది ఫస్టియర్ విద్యార్థులు, 5,07,911 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
హాల్‌టికెట్లలో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే..
ద్వితీయ సంవత్సర పరీక్షల ప్రారంభ తేదీపై కొంత గందరగోళం నెలకొంది. మొదట్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే విద్యార్థుల హాల్‌టికెట్లలో మాత్రం మార్చి 2 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్నట్లు షెడ్యూల్ ముద్రించారు. దీంతో విద్యార్థులు కొంత గందరగోళానికి గురయ్యారు. దీనిపై అధికారులను సంప్రదించగా.. హాల్‌టికెట్‌లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.