( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022–23 నిర్వహణ విషయంలో కేంద్ర విద్యా శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గందరగోళ చర్యలే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేఈఈ షెడ్యూల్‌ను ఆరేడు నెలలకు ముందుగానే ప్రకటించాల్సి ఉన్నా తీవ్ర జాప్యం చేశారు. జనవరి లేదా ఫిబ్రవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్ నిర్వహించాల్సి ఉంది. అనంతరం ఏప్రిల్ లేదా మేలో రెండో విడత పరీక్షను జరపాల్సి ఉండగా పరీక్ష షెడ్యూల్, తేదీల విషయంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించారు.
విద్యార్థులకు ఇబ్బందులు..
ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత, మే 24 నుంచి 29 వరకు రెండో విడత నిర్వహించేలా ఎన్‌టీఏ షెడ్యూల్ ఇచ్చింది. అప్పటికే పలు రాష్ట్రాల ఇంటర్మీడియెట్, హయ్యర్ సెకండరీ బోర్డులు తమ పబ్లిక్ పరీక్షల తేదీలను ప్రకటించాయి. సరిగ్గా అవే తేదీల్లో జేఈఈ పరీక్షలు నిర్వహించేలా ఎన్‌టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. చివరకు ఇంటర్ పరీక్షల తేదీలను కొన్ని బోర్డులు మార్పు చేసుకున్నాయి. అప్పటికే బోర్డుల పరీక్షలతో జేఈఈ తేదీలు క్లాష్ అవుతుండడంతో ఎన్‌టీఏ మెయిన్ పరీక్ష తేదీలను ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహించేలా మార్పు చేసింది. తమ తొలి షెడ్యూల్‌ను మార్పు చేసిన ఇంటర్ బోర్డులు మళ్లీ తమ పరీక్షల తేదీలను మార్చుకోవలసి వచ్చింది. జేఈఈ మెయిన్ షెడ్యూళ్ల గందరగోళంతో పలు రాష్ట్రాల బోర్డులు/సీబీఎస్‌ఈ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.
ఓ వైపు ఇంటర్.. మరోవైపు జేఈఈ
ఎన్‌టీఏ అస్తవ్యస్త షెడ్యూళ్లతో విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తూనే జేఈఈ మెయిన్ రాయాల్సిన అగత్యం ఏర్పడింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను జేఈఈ మెయిన్ తొలి విడత ముగిశాక మే 6 నుంచి 24 వరకు నిర్వహించేలా మార్పు చేశారు. దీంతో విద్యార్థులు మెయిన్ తొలి విడత పరీక్షలకు సన్నద్ధమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటర్ పరీక్షలు ముగిశాక అయినా జేఈఈకి సిద్ధమవుదామనుకుంటే వెనువెంటనే మెయిన్ పరీక్షలు ప్రారంభమవుతుండడంతో ఆ అవకాశం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇంటర్ పరీక్షలకు, జేఈఈకి కనీసం 60–90 రోజుల వ్యవధి అవసరమవుతుందని, కానీ ఇక్కడ ఒక్కరోజు కూడా అవకాశం లేకుండా వెంటనే పరీక్షలకు సిద్ధపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సన్నద్ధతకు వీలుగా మెయిన్ పరీక్షల తేదీలను మార్పు చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment