ఈసారి పొలిటికల్‌ సైన్స్‌ ప్రశ్నపత్రంలో తప్పులు | Inter Exams Mistakes Political Science Question Paper Telangana | Sakshi
Sakshi News home page

ఈసారి పొలిటికల్‌ సైన్స్‌ ప్రశ్నపత్రంలో తప్పులు

Published Fri, May 13 2022 1:00 AM | Last Updated on Fri, May 13 2022 2:55 PM

Inter Exams Mistakes Political Science Question Paper Telangana - Sakshi

పొలిటికల్‌ సైన్స్‌ ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో వేర్వేరుగా వచ్చిన ఒకే ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల్లో తప్పిదాలు  జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సంస్కృతం, హిందీ పేపర్లలో తప్పులురాగా.. గురువారం పొలిటికల్‌ సైన్స్, ఉర్దూ మీడియం మ్యాథ్స్‌ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్య వైఖరితో పరీక్షల విధానం ప్రహసనంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రశ్నే మారిపోయింది 
రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరి గాయి. సాధారణంగా విద్యార్థులు ఏ మీడియంలో పరీక్ష రాస్తే ఆ భాషలో ముద్రించిన ప్రశ్నపత్రాలను ఇస్తారు. ఇందులో భాష మారుతుందే తప్ప ప్రశ్నల్లో మార్పు ఉండదు. గురువారం ఇంగ్లిష్‌ మీడి యం పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌లో ఒక ప్రశ్న ఉంటే.. తెలుగు మీడియం పేపర్‌లో వేరే ప్రశ్న ఇచ్చారు. ప్రశ్నపత్రం సెక్షన్‌ ‘బి’లో ఐదు మార్కులకు 8వ ప్రశ్నగా "Point out the main provisi ons of the Independence of India Act 1947' అని ప్రశ్న ఇచ్చారు.

‘భారత స్వాతంత్య్ర చట్టం–1947లోని ముఖ్యాంశాలు రాయండి’అని దానికి అర్థం. కానీ తెలుగులో ఇచ్చిన పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌లో ‘భారత స్వాతంత్య పోరాటంలో హోమ్‌రూల్‌ ఉద్యమాన్ని వర్ణించండి’అనే ప్రశ్న ఇచ్చారు. ఇలా వేర్వేరుగా రావడంతో.. ఏ ప్రశ్నను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది, దేనికి మార్కులు వేస్తుందని విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కొందరు ఈ ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేశారు. మరికొందరు సమాధానం రాసినా మార్కులు రావేమోనని భయపడటం పరీక్ష కేంద్రాల వద్ద కన్పించింది. 

ఉర్దూలోనూ ఇదే తంతు 
గణితం పేపర్‌ను కొందరు విద్యార్థులు ఉర్దూ మీడియంలో రాశారు. అందులో ఇచ్చిన ఓ ప్రశ్న అర్థం లేకుండా ఉండటంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఒక లెక్కలో" FARJI'’అని ఇచ్చారు. అదేంటో ఎవరికీ అర్థం కాలేదు. విద్యార్థులు ఇదేమిటని ప్రశ్నించడంతో.. ఇన్విజిలేటర్లు, పరీక్ష కేంద్రం సిబ్బంది అప్పటికప్పుడు ఆ పదం అర్థమేంటో తెలుసుకునేందుకు హైరానా పడ్డారు. ఉర్దూ భాషా నిపుణులను సంప్రదించగా.. ఆ పదం " ZARBI' అని, లెక్కలో హెచ్చింపు అని అర్థమని చెప్పారు. ఇది పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు చేరేసరికి సమయం వృధా అయింది. 
 
వరుస తప్పిదాలు.. ఎందుకిలా? 
ఇంటర్‌బోర్డు నిపుణుల చేత అత్యంత గోప్యంగా పరీక్ష పత్రాలను తయారు చేయిస్తుంది. మొత్తం 12 సెట్లు రూపొందిస్తారు. అందులోంచి మూడింటిని ఎంపిక చేసి.. పరీక్ష కేంద్రాలకు పంపుతారు. పరీక్షకు సరిగ్గా అరగంట ముందు ఈ మూడు సెట్లలో ఒక సెట్‌ను ఖరారు చేస్తారు. అయితే ఈ సంవత్సరం ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో కొందరు అనుకూలమైన వ్యక్తులకు బాధ్యత అప్పజెప్పారని, వారికి అనుభవం లేకపోవడమే తప్పిదాలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కుమ్మక్కైనట్టు విమర్శలొస్తున్నాయి.

ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలోనే కార్పొరేట్‌ కాలేజీలతో మిలాఖత్‌ అయ్యారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. హిందీ ట్రాన్స్‌లేటర్లు ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వకపోవడం వెనుక కొందరు పైరవీకారుల పాత్ర ఉందనే విమర్శలున్నాయి. ఏదేమైనా పరీక్షల విభాగంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్‌ కూడా విన్పిస్తోంది. 

వేర్వేరుగా మూల్యాంకనం 
పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌లో తెలుగు, ఆంగ్ల భాషల్లో వేర్వేరుగా ప్రశ్నలు ఇవ్వడాన్ని గుర్తిం చాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేర్వేరుగా మూల్యాంకనం చేపడతాం. రెండు భాషల్లోనూ రెండు ప్రశ్నలకు మార్కులు వేస్తాం.
– సయ్యద్‌ ఒమర్‌ జలీల్, బోర్డు కార్యదర్శి

ఇలాగైతే విద్యార్థుల్లో కంగారే.. 
లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నప్పుడు ఇలాంటి తప్పిదాలు రాకుండా చూడాలి. పరీక్ష హాల్‌లో విద్యార్థులు ఇలాంటి గందరగోళానికి లోనైతే.. సక్రమంగా పరీక్ష రాసే అవకాశం ఉండదు. ఆ రోజు పరీక్షపై ప్రభావం చూపుతుంది. 
– పరశురాములు, జూనియర్‌ లెక్చరర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement