
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితా ల్లో తీవ్ర అన్యాయానికి గురైన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి గత కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు వద్ద చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వం కంటికి కనిపించవా? అని ప్రశ్నించారు. విద్యార్థుల గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకు బాధ్యుడిగా విద్యా శాఖ మంత్రి రాజీనామా చేస్తారా అని విద్యార్థి లోకం ఎదురు చూస్తోందన్నారు. గ్లోబరీనా సంస్థకు ప్రభుత్వ పెద్దలకు ఉన్న అనుబంధంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సంశయం ఏర్పడటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొచ్చి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment