సాక్షి, హైదరాబాద్: ఈసారి నీట్ పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని నిపుణులు విశ్లేషించారు. బాగా చదివినవారికి మధ్యస్థంగా, మామూలుగా వారికి కఠినంగా ఉంటుందని చెబుతున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ‘నీట్’పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో ఈసారి దరఖాస్తు చేసుకున్న వారిలో 95 శాతం మందికి పైగా పరీక్షకు హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. గత నాలుగేళ్లతో పోలిస్తే.. ఈసారి నీట్ కాస్త కఠినంగానే ఉందని పరీక్ష అనంతరం విద్యార్థులు, నిపుణులు చెప్పారు.
కరోనా కారణంగా గతేడాది వరకు సులువుగా ఉన్న పేపర్, ఈసారి కొంత కఠినం చేశారని చెబుతున్నారు. దీంతో ఈసారి కటాఫ్ మార్క్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. 2020లో జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్క్ 147 ఉండగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 113 గా ఉంది. ఇక 2021లో జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్క్ 138 కాగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కట్ ఆఫ్ మార్క్ 108గా ఉంది. గతేడాది (2022)జనరల్ కటాఫ్‌మార్క్ 117కాగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 93గా ఉంది. ఈ ఏడాది అది కాస్తా జనరల్ కేటగిరీలో 110, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 85 ఉండే అవకాశముందని అంచనా.
ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు..
గతేడాదితో పోలిస్తే ఈసారి నీట్ పేపర్ కఠినంగా ఉంది. నాలుగేళ్లలో 2020, 21లో పేపర్లు సులువుగా వచ్చాయి. అయితే అంతకుముందుతో పోలిస్తే గతేడాది కఠినంగా ఉంది. దీంతో కటాఫ్ మార్కు తగ్గింది. ఈ ఏడాది ఇంకా టఫ్‌గా ఉంది. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. కెమిస్ట్రీ పేపర్ కఠినంగా ఉంది. సహజంగా విద్యార్థులు కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్‌పై దృష్టిపెట్టి, థియరీ పార్ట్‌ను నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈసారి ఎక్కడో మూలల నుంచి థియరీ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. దీంతో పేపర్ కఠినంగా మారింది.
ఇక ఫిజిక్స్ గతేడాదితో పోల్చితే సులువుగానే ఉంది. నాలుగైదు ప్రశ్నలు తికమకగా ఇచ్చారు. ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లు ఏవీ కరెక్ట్‌గా లేవు. బాటనీ ప్రశ్నలు సులువుగా ఉన్నా, సుదీర్ఘంగా ఉన్నాయి. చదవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాయి. స్టేట్మెంట్ టైప్ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు విశ్లేషించారు.
430 మార్కులు వచ్చినా రాష్ట్రంలో కన్వీనర్ సీటు..
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి కాబట్టి తక్కువ మార్కులు వచ్చినా సీటు పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు జనరల్ కేటగిరీలో గతేడాది 450 మార్కులు వచ్చినవారికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. ఈ ఏడాది 430 మార్కులు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశముంది. గతేడాది 700కు పైగా మార్కులు వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఏడాది అంత మార్కులు వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది.
ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు సమాధానం లేదు
ఈసారి నీట్ పేపర్ కఠినంగా ఉంది. కెమిస్ట్రీ చాలా కఠినంగా వచ్చింది. ఫిజిక్స్‌లో నాలుగైదు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. వాటిని హడావుడిగా పెడితే తప్పవుతాయి. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లు కూడా సరిగా లేవు. కాబట్టి దానికి బోనస్ మార్కులు ఇవ్వాలి. 180 ప్రశ్నల్లో 179 మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
– శంకర్‌రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, కూకట్‌పల్లి
పేపర్ మధ్యస్థంగా ఉంది
నీట్ పరీక్ష బాగానే రాశాను. పేపర్ మధ్యస్థంగా ఉంది. కెమిస్ట్రీ ఫర్వాలేదు. నాకు కెమిస్ట్రీలో 160, ఫిజిక్స్‌లో 166 వచ్చే అవకాశముందని నేను రాసిన ఆన్సర్లను బట్టి
అంచనా వేశా. బాటనీలో కూడా మార్కులు బాగానే వస్తాయనుకుంటున్నా.
– ఆర్ని గోయల్, విద్యార్థి, హైదరాబాద్
ఫిజిక్స్, బాటనీ సులువుగా..
నీట్ పరీక్ష బాగానే రాశాను. కెమిస్ట్రీలో రెండు ప్రశ్నలు తప్పుగా రాసినట్లు అనిపించింది. కెమిస్ట్రీ మధ్యస్థంగా ఉంది. ఫిజిక్స్, బాటనీ పేపర్లు సులువుగా వచ్చాయి.
– లహరి, విద్యార్థిని, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment