ఏపీలో ఎంబీబీఎస్ సీటు దొరక్క నీట్ ర్యాంకర్ల నిర్వేదం
రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో ఈ ఒక్క ఏడాదే 700 సీట్లు కోల్పోయామని ఆవేదన
మెడికల్ కాలేజీలు నెలకొల్పి సీట్లు పెంచకపోగా.. వచి్చన సీట్లూ వద్దంటారా?
కోచింగ్‌కు రూ.లక్షలు వెచి్చంచిన విద్యార్థుల ఆశలు గల్లంతు
నీట్ స్కోర్ 500 దాటినా రిజర్వేషన్ వర్గాలకు కన్వీనర్ కోటాలో నిరాశే
సర్కారు ‘పీ4’ నిర్ణయంతో రెండేళ్లలో కోల్పోతున్న 1,750 వైద్య సీట్లు
‘ఏడాదిపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ యూజీ–2024లో 595 స్కోర్ చేశా. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్కోర్ చేసినా కన్వీనర్ కోటాలో సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తే మనకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరేవి. దీనికి తోడు టీడీపీ తన హామీ మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తే మరో 319 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగేవి. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్‌ఎంసీ అండర్ టేకింగ్ కోరినా ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.
పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్‌సీ సీట్లు మంజూరు చేస్తే మేం నిర్వహించలేమంటూ ప్రభుత్వమే లేఖ రాసి నాలాంటి విద్యార్థులకు తీవ్ర నష్టం తలపెట్టింది. ఇప్పటికే లాంగ్‌టర్మ్ కోచింగ్ రూపంలో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి కూడా సీటు రాకుంటే నా భవిష్యత్ అంధకారమే. తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు ఈసారి సీట్లు వస్తున్నాయి. అక్కడ 8 వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగడమే దీనికి కారణం. ఏపీలో మాత్రం వచ్చిన సీట్లు సైతం వద్దంటూ ప్రభుత్వమే లేఖ రాసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై చిత్తశుద్ధి లేని జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది...!’ విశాఖకు చెందిన నీట్ ర్యాంకర్ సాయి ఆక్రోశం ఇదీ!
సాక్షి, అమరావతి: వైద్య విద్యపై ఎంతో ఆశ పెట్టుకుని లాంగ్ టర్మ్ శిక్షణతో ఏడాదంతా సన్నద్ధమై మంచి స్కోర్ సాధించిన పలువురు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కాలేజీలు అందుబాటులోకి రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది 700, వచ్చే ఏడాది 1,050 చొప్పున మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో తమ ఆశలు గల్లంతవుతున్నాయని నీట్ ర్యాంకర్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? అని ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక ‘కోట్లు’న్న వారికే తెల్లకోటు భాగ్యం దక్కుతుందని పేర్కొంటున్నారు.
మంచి స్కోరైనా..సీట్ కష్టం
నీట్ యూజీలో అర్హత సాధించిన 13,849 మంది ఈసారి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నీట్‌లో 500–550 స్కోర్ చేసినా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓసీ విద్యార్థులైతే దాదాపు 600 స్కోర్ చేసినప్పటికీ అసలు సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయని, ఏపీలో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ వైద్య విద్య చదివే అదృష్టం లేదని వాపోతున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు గణనీయంగా పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో 8 కళాశాలలకు ఏకంగా 400 సీట్లు అదనంగా మంజూరవడం అక్కడి విద్యార్థులకు కలిసి వస్తోంది.
సీట్లు పెరిగింది గత ఐదేళ్లలోనే
⇒ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్‌లను నెలకొల్పడంతో పాటు నెల్లూరు ఎసీఎస్‌ఆర్ కళాశాల ఏర్పాటుకు బీజం వేశారు.
⇒ 2004కు ముందు, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య విద్యపై తీవ్ర ప్రభావం పడింది.
⇒ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు.
⇒ వీటిలో ఐదు కొత్త కళాశాలలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరడంతో వైద్య విద్యపై ఆశలు చిగురించాయి.
⇒ ఈ క్రమంలో ఈ ఏడాది మరో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా వాటిని ప్రైవేట్‌పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
⇒ దీంతో ఈ ఏడాది 750 సీట్లు సమకూరాల్సి ఉండగా కేవలం పాడేరు వైద్య కళాశాలలో కేవలం 50 సీట్లు అది కూడా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు వాటికి అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది.
⇒ ఇదే విషయం ఎంఎన్‌సీ (జాతీయ వైద్య కమిషన్) రాసిన లేఖ ద్వారా ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే.
⇒ ఈ ఏడాది మెడికల్ కాలేజీలు పెరిగితే తమ పిల్లలకు కచ్చితంగా సీటు వస్తుందనే అంచనాతో సగటున రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి నీట్ శిక్షణ ఇప్పించామని, అయితే స్కోర్ 500 దాటినా దక్కని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు.
⇒ పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్‌సీ సీట్లు మంజూరు చేయడం విస్మయం కలిగించిందంటూ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై నివ్వెరపోతున్నారు.
మా ఆశలను కాలరాశారు
గతేడాది నీట్‌లో 515 స్కోర్ చేశా. ఓసీ కేటగిరీలో 543 స్కోర్‌కు కన్వీనర్ కోటాలో చివరి సీట్ వచ్చింది. దీంతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. ఈసారి 555 స్కోర్ సాధించినా పోటీ తీవ్రంగా ఉంది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే నాకు సీటు దక్కేది. కనీసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసినా మాకు న్యాయం జరిగేది. ప్రభుత్వమే మా ఆశలను కాలరాసింది. మేనేజ్‌మెంట్ కోటాలో చేరాలంటే మా తల్లిదండ్రులకు తలకు మించిన భారం. ఇప్పటికే నాతోపాటు మా సోదరుడి లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. – ఎన్. సుచేతన, రాజంపేట, అన్నమయ్య జిల్లా
అప్పుడు అదృష్టం.. ఇప్పుడు!
నాకు ఇద్దరు కుమార్తెలు. 2023లో పెద్దమ్మాయి నీట్‌లో 530 మార్కులు సాధించి ఏలూరు కాలేజీలో సీట్ దక్కించుకుంది. ఆ విద్యా సంవత్సరంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం, అదనంగా 750 సీట్లు పెరగడం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు రెండో అమ్మాయి 543 మార్కులు సాధించినా ప్రభుత్వ సీట్ రావటం లేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఐదు కొత్త కళాశాలలు ప్రారంభం అయితే అదృష్టం కలసి వస్తుందని ఆశపడ్డాం. ప్రభుత్వమే వసతులు కల్పించలేమని చేతులెత్తేస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? అదే మా అమ్మాయి పక్క రాష్ట్రంలో ఉంటే మొదటి రౌండ్‌లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చేది. – సీహెచ్.ఉమామహేశ్వరరావు, పోలాకి మండలం, శ్రీకాకుళం
ప్రభుత్వమే వ్యాపారం చేస్తానంటే ఎలా?
సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నెరవేర్చకపోగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఉచితంగా వైద్య విద్య అందించడానికి కృషి చేయాలి. అంతేగానీ వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? గతేడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమై అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఎంతో సంతోషించాం. ఈ ఏడాది మరో ఐదు కొత్త కాలేజీల ద్వారా అదనంగా 750 సీట్లు వస్తాయని భావిస్తే పీపీపీ విధానం పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేశారు. – జి.ఈశ్వరయ్య, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment