నూతన ప్రభుత్వ కాలేజీలకు అనుమతులపై చేతులెత్తేసిన కూటమి సర్కార్
అండర్ టేకింగ్ ఇస్తే ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుమతులిస్తామన్న ఎన్‌ఎంసీ
ముగిసిపోయిన గడువు.. ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా అడుగులు
2024–25లో ఐదు కాలేజీలు మొదలైతే అదనంగా 500 సీట్లు అందుబాటులోకి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు కొత్త కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా పేద విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది.
ఈమేరకు గత ప్రభుత్వం ఈ ఐదు చోట్ల సెకండరీ కేర్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టులను గతంలోనే మంజూరు చేశారు. పోస్టుల భర్తీ దాదాపుగా పూర్తయిన సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, హాస్టల్స్, క్యాంటీన్ల నిర్మాణం లాంటి పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో గత జూన్ 24న ఎన్‌ఎంసీ బృందాలు ఈ ఐదు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాయి. మదనపల్లెలో 12 శాతం, పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోనిల్లో కొంత మేర ఫ్యాకల్టీ, ఇతర వనరులను కల్పించాల్సి ఉన్నందున అనుమతులను నిరాకరిస్తున్నట్లు జూలై 6న కళాశాలలకు సమాచారం ఇచ్చింది. అయితే వనరుల కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాన్చిన కూటమి సర్కారు చివరి నిమిషంలో మొక్కుబడిగా అప్పీల్‌కు వెళ్లింది.
అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో..
కొత్త వైద్య కళాశాలలకు అనుమతులపై అప్పీల్ చేసిన నేపథ్యంలో పులివెందుల కళాశాలలో ఎన్‌ఎంసీ వర్చువల్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించింది. అయితే తాము జూన్ 24న ఇన్‌స్పెక్షన్ చేసినప్పటి పరిస్థితులే ఇంకా ఉన్నాయని, అంతకు మించి పెద్దగా పురోగతి లేదని ఎన్‌ఎంసీ ప్రతినిధులు గుర్తించినట్లు తెలిసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తామని గత వారం కళాశాలలకు ఎన్‌ఎంసీ సమాచారం ఇచ్చింది. అండర్ టేకింగ్ అంటే కళాశాలలో తరగతుల నిర్వహణ, అకడమిక్ కార్యకలాపాలకు అవసరమైన వసతులన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తుందని గ్యారంటీ ఇవ్వడం. అయితే అండర్ టేకింగ్ గడువు కూడా ఈనెల 12వతేదీతో ముగిసింది. దీనిపై వైద్యశాఖ సమాచారం ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తెలిసింది.
పట్టుబట్టి సాధించిన వైఎస్ జగన్
గతేడాది ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలకు తొలి దశ తనిఖీల్లో అనుమతులు రాకపోవడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లి అండర్ టేకింగ్ ఇచ్చింది. తద్వారా ఆ నాలుగు కళాశాలలకు వైఎస్ జగన్ అప్పట్లో పట్టుబట్టి అనుమతులు రాబట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అండర్ టేకింగ్ ఇవ్వలేదు. ఇక మిగిలిన నాలుగు కొత్త కళాశాలల్లో వర్చువల్ ఇన్‌స్పెక్షన్ కూడా జరగలేదు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్నా కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల విషయాన్ని పట్టించుకోకపోవడంపై వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైద్య కళాశాలలకు అనుమతులపై సందిగ్ధత కొనసాగుతున్న క్రమంలో ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. గతేడాది వైఎస్సార్ సీపీ హయాంలో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లు అదనంగా రాష్ట్రానికి సమకూరాయి. ఇక ఈ ఏడాది ఐదు కొత్త కళాశాలల్లో ఒక్కోచోట 100 చొప్పున 500 సీట్లు సమకూరుతాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త కళాశాలలకు అనుమతులు లభిస్తే 75 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన 425 సీట్లు పూర్తిగా మన రాష్ట్ర విద్యార్థులకే దక్కే పరిస్థితి ఉండేది. తద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల నెరవేరి అందుబాటులోకి వచ్చే వైద్యుల సంఖ్య పెరిగేది.
ఆశలు ఆవిరి..
నీట్ యూజీ–2024లో 598 మార్కులు సాధించా. కడప రిమ్స్ లేదా పులివెందుల కాలేజీలో సీటు సాధిస్తే అమ్మనాన్నలకు దగ్గరగా ఉండి ఎంబీబీఎస్ చదవచ్చని భావించా. పులివెందుల మెడికల్ కళాశాలలో ప్రవేశాలపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటైతే అదనంగా 500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని ఎంతోమంది విద్యార్థులు ఆశ పెట్టుకున్నారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి. – పెద్దిరెడ్డి వెంకట కేదార్‌నాథ్‌రెడ్డి, పోరుమామిళ్ల, వైఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment