government colleges
-
కూటమి సర్కార్.. ‘మెడికల్’ ద్రోహం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు కొత్త కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా పేద విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది.ఈమేరకు గత ప్రభుత్వం ఈ ఐదు చోట్ల సెకండరీ కేర్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టులను గతంలోనే మంజూరు చేశారు. పోస్టుల భర్తీ దాదాపుగా పూర్తయిన సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, హాస్టల్స్, క్యాంటీన్ల నిర్మాణం లాంటి పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో గత జూన్ 24న ఎన్ఎంసీ బృందాలు ఈ ఐదు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాయి. మదనపల్లెలో 12 శాతం, పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోనిల్లో కొంత మేర ఫ్యాకల్టీ, ఇతర వనరులను కల్పించాల్సి ఉన్నందున అనుమతులను నిరాకరిస్తున్నట్లు జూలై 6న కళాశాలలకు సమాచారం ఇచ్చింది. అయితే వనరుల కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాన్చిన కూటమి సర్కారు చివరి నిమిషంలో మొక్కుబడిగా అప్పీల్‌కు వెళ్లింది.అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో..కొత్త వైద్య కళాశాలలకు అనుమతులపై అప్పీల్ చేసిన నేపథ్యంలో పులివెందుల కళాశాలలో ఎన్ఎంసీ వర్చువల్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అయితే తాము జూన్ 24న ఇన్స్పెక్షన్ చేసినప్పటి పరిస్థితులే ఇంకా ఉన్నాయని, అంతకు మించి పెద్దగా పురోగతి లేదని ఎన్ఎంసీ ప్రతినిధులు గుర్తించినట్లు తెలిసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తామని గత వారం కళాశాలలకు ఎన్ఎంసీ సమాచారం ఇచ్చింది. అండర్ టేకింగ్ అంటే కళాశాలలో తరగతుల నిర్వహణ, అకడమిక్ కార్యకలాపాలకు అవసరమైన వసతులన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తుందని గ్యారంటీ ఇవ్వడం. అయితే అండర్ టేకింగ్ గడువు కూడా ఈనెల 12వతేదీతో ముగిసింది. దీనిపై వైద్యశాఖ సమాచారం ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తెలిసింది.పట్టుబట్టి సాధించిన వైఎస్ జగన్గతేడాది ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలకు తొలి దశ తనిఖీల్లో అనుమతులు రాకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లి అండర్ టేకింగ్ ఇచ్చింది. తద్వారా ఆ నాలుగు కళాశాలలకు వైఎస్ జగన్ అప్పట్లో పట్టుబట్టి అనుమతులు రాబట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అండర్ టేకింగ్ ఇవ్వలేదు. ఇక మిగిలిన నాలుగు కొత్త కళాశాలల్లో వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా జరగలేదు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్నా కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల విషయాన్ని పట్టించుకోకపోవడంపై వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.వైద్య కళాశాలలకు అనుమతులపై సందిగ్ధత కొనసాగుతున్న క్రమంలో ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. గతేడాది వైఎస్సార్ సీపీ హయాంలో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లు అదనంగా రాష్ట్రానికి సమకూరాయి. ఇక ఈ ఏడాది ఐదు కొత్త కళాశాలల్లో ఒక్కోచోట 100 చొప్పున 500 సీట్లు సమకూరుతాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త కళాశాలలకు అనుమతులు లభిస్తే 75 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన 425 సీట్లు పూర్తిగా మన రాష్ట్ర విద్యార్థులకే దక్కే పరిస్థితి ఉండేది. తద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల నెరవేరి అందుబాటులోకి వచ్చే వైద్యుల సంఖ్య పెరిగేది.ఆశలు ఆవిరి..నీట్ యూజీ–2024లో 598 మార్కులు సాధించా. కడప రిమ్స్ లేదా పులివెందుల కాలేజీలో సీటు సాధిస్తే అమ్మనాన్నలకు దగ్గరగా ఉండి ఎంబీబీఎస్ చదవచ్చని భావించా. పులివెందుల మెడికల్ కళాశాలలో ప్రవేశాలపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటైతే అదనంగా 500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని ఎంతోమంది విద్యార్థులు ఆశ పెట్టుకున్నారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి. – పెద్దిరెడ్డి వెంకట కేదార్‌నాథ్‌రెడ్డి, పోరుమామిళ్ల, వైఎస్సార్ జిల్లా -
ఫలించిన ప్రభుత్వ కృషి.. దుమ్ములేపిన ప్రభుత్వ కళాశాలలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలను మించిన ఫలితాలను సాధించి ఔరా అనిపించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించిన ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలను కూడా అభివృద్ధి చేసింది. వాటిలో చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని అందించింది. ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ హైస్కూళ్లను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసి వాటిలో ఇంటర్మీడియెట్ కోర్సులను ప్రవేశపెట్టింది. దీంతో గతంలో మండల కేంద్రాల్లో కళాశాలలు లేక చదువుమానేసే విద్యార్థులకు తమ నివాసాలకు సమీపప్రాంతాల్లోనే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇంటర్మీడియెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులు సైతం నిర్వహించింది. ఈ చర్యలన్నీ ఫలించి కార్పొరేట్ కళాశాలలు బిత్తరపోయేలా ప్రభుత్వ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో రికార్డులు సృష్టించారు. టాపర్‌గా తహురా అన్నమయ్య జిల్లా మదనపల్లె రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ రియాజ్ అలీ, షేక్ నూర్‌భాను కుమార్తె షేక్ తహురా స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివింది. తాజా ఫలితాల్లో 979 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ♦ కృష్ణా జిల్లా మొవ్వలో క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల జనరల్ కోర్సుల్లో 91.26 శాతం, వృత్తి విద్యా విభాగంలో 92.9 శాతం ఉత్తీర్ణతను సాధించింది. కళాశాల విద్యార్థులు ఎన్.హర్షిత (ఎంఈటీ)968, శ్రీవిద్య(ఎంపీసీ) 963, పి.శ్రావ్య (బైపీసీ) 953 మార్కులతో సత్తా చాటారు. అలాగే అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి ని ఎం.శ్వేత ఎంపీసీలో 951 మార్కులతో టాపర్‌గా నిలిచింది. చల్లపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 92 శాతం, ఫస్టియర్ విద్యార్థి నులు 87.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ♦ పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసకు చెందిన బర్ల లలిత ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కు 435 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తల్లిదండ్రులు సుశీల, సంగమేష్ భవన నిర్మాణ కూలీలు. లలిత విజయనగరంలోని నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఈ ఫలితాలను సాధించింది. ♦ ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి హెచ్.అజయ్ రాజు సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 985 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచాడు. అలాగే పెదపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ని జి.కళ్యాణి ఎంపీసీలో 975 మార్కులతో ఏలూరు జిల్లాలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎస్. కళ్యాణి ఎంఎల్‌టీలో 961 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది. నూజివీడు, కలిదిండి, ఆగిరిపల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా మంచి ఫలితాలను సాధించాయి. ♦ చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న దీక్షిత 975 మార్కులతో సత్తా చాటింది. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం సీఈసీలో నందిని 966, ఎంపీసీలో నందిని 945 మార్కులతో దుమ్ములేపారు. అలాగే పలమనేరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ గురుకుల కళాశాల, రామకుప్పం కళాశాల, చిత్తూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్, కుప్పం ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలల విద్యార్థులు కూడా అత్యుత్తమ మార్కులు సాధించారు. ఏపీ మోడల్ స్కూల్స్ అదుర్స్.. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో ఏపీ మోడల్ స్కూళ్ల విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు అధిక మార్కులు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 162 ఏపీ మోడల్ స్కూల్స్ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం 10,121 మంది పరీక్షలకు హాజరవగా 6,244 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ సెకండియర్ 9,896 మంది పరీక్షలకు హాజరవగా 7,017 మంది (71 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. నంద్యాల జిల్లా మిడ్తూరు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా నందవరం, శ్రీకాకుళం జిల్లా రాజపురం మోడల్ స్కూళ్లు సంచలన ఫలితాలను సాధించాయి. కేజీబీవీలు కేక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సైతం ఈసారి ఇంటర్ ఫలితాల్లో దుమ్ములేపాయి. కర్నూలు జిల్లా గూడూరు కేజీబీవీలో ఫస్టియర్ విద్యార్థి ని జి.విజయలక్ష్మి(ఎంపీసీ) 462/470 మార్కులతో సత్తా చాటింది. సీఈసీలో వి.నాగేశ్వరి 459, అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్‌లో యు.మానస 495, కంప్యూటర్ సైన్స్‌లో ఎం.యమున 494, ఎస్.హజీరాభాను 490 మార్కులు సాధించారు. సెకండియర్ ఫలితాల్లో మార్కాపురం కేజీబీవీ విద్యార్థి జి.లక్ష్మి అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్‌లో 980, విజయనగరం జిల్లా వేపాడ విద్యార్థి ని కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలో 978, పల్నాడు జిల్లా నకరికల్లు విద్యార్థి ని జె.లక్ష్మీప్రసన్న (ఎంపీసీ) 978, శ్రీకాకుళం కేజీబీవీ విద్యార్థి ని బి.హేమలత (ఎంపీసీ) 973, నర్సీపట్నం కేజీబీవీ విద్యార్థిని వి.నాగలక్ష్మి (బైపీసీ) 973 మార్కులతో రికార్డు సృష్టించారు. శాంతిపురం కేజీబీవీలో సీఈసీ ప్రథమ సంవత్సరం మాధవి 500కు 480, కేజీబీవీ కుప్పంలో జయంతి 500కు 473 మార్కులు సాధించారు. హైస్కూల్ ప్లస్‌ల్లో పెరిగిన ఉత్తీర్ణత రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ ప్రణాళికతో గతేడాది రాష్ట్రంలో 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్చారు. అయితే, వాటిలో 249 స్కూల్స్‌లో మాత్రమే గతేడాది ప్రవేశాలు కల్పించారు. వాటిలో ఈ ఏడాది 4,542 మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 1,262 మంది ఉత్తీర్ణులయ్యారు. బాల్య వివాహం నుంచి బయటపడి టాపర్‌గా.. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కి 421 మార్కులు సాధించిన ఎస్.నిర్మల సమాజంతో పోరాడి గెలిచింది. ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. ఆదిత్య ప్రతిభ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులు ఏడుగురు, 464 మార్కులు 20 మంది పొందారని పేర్కొన్నారు. బైపీసీలో 435, 434 మార్కులు, ఎంఈసీలో 489 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సీనియర్ ఎంపీసీలో 990, 989, బైపీసీలో 986, ఎంఈసీలో 978 మార్కులు పొంది తమ విద్యార్థులు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి దీపక్‌రెడ్డి, వైస్ చైర్మన్ సతీ‹Ùరెడ్డి, కో–ఆర్డినేటర్ లక్ష్మీకుమార్, డైరెక్టర్లు గంగిరెడ్డి, రాఘవరెడ్డి, ప్రిన్సిపాల్ మెయినా అభినందించారు. శ్రీచైతన్య విజయకేతనం విజయవాడ: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ బొప్పన తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో చింటు రేవతి రాష్ట్రస్థాయిలో 467 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీలో 440 మార్కులకు గాను టి.దివ్య రాష్ట్రస్థాయిలో 436 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. అలాగే సీనియర్ ఎంపీసీలో ఎ.వి.దుర్గామధులిక 1000 మార్కులకు గాను 992 మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చారని తెలిపారు. అలాగే బైపీసీలో ఎస్.పావని 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించినట్లు చెప్పారు. శ్రీప్రకాష్ విజయభేరి తుని: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంపీసీ ద్వితీయ ఏడాది విద్యార్థి ని టి.వెన్నెల 982/1000, డీడీ సాయి శ్రీనివాస్ 980/1000, బైపీసీలో కె.లాస్య నందిని 979/1000 మార్కులతో అగ్రస్థానం సాధించారని పేర్కొన్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరం డీవీఎల్ సాయి నిహారిక 464/470, ఎస్.మేఘన 463/470, బైపీసీలో జి.వర్షిణి 428/470 మార్కులు పొందారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత నరసింహారావు, కార్యదర్శి విజయ్‌ప్రకాష్ అభినందించారు. నారాయణ జయకేతనం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను పి.మేఘన 467, కె.ప్రసన్న 466 మార్కులు పొందారని పేర్కొన్నారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులు 14 మంది సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో 1000 మార్కులకు గాను 991, 991 టాప్ మార్కులు సాధించినట్లు చెప్పారు. బైపీసీలో 988 మార్కులతో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. సత్తా చాటిన శశి ఉండ్రాజవరం: ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శుక్రవారం తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు ఎం.నవ్యశ్రీ 990, బి.పార్వతి, కె.లిఖిత 989 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు కేఎస్ సాయి శివాని 987, ఎండీ అబ్దుల్ జాఫర్ 985 మార్కులు పొందారని తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను ఎం.లీలాకృష్ణారెడ్డి, డి.దుర్గా కౌసల్య 466, ఎస్కే ఇర్పాత్, బి.సహస్ర, బి.షన్మిత, టి.మనోజ్ఞ 465 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. బైపీసీలో 440 మార్కులకు టి.కీర్తి, పీవీ హసని, వి.ఖ్యాతి, ఎం.నిస్సి, సీహెచ్ తేజస్వి 435 మార్కులు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శశి విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు. తిరుమల విద్యాసంస్థల ప్రభంజనం రాజమహేంద్రవరం రూరల్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 466 మార్కులు 12 మంది సాధించారని చెప్పారు. బైపీసీలో 440కి 436 మార్కులు నలుగురు తెచ్చుకున్నారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఇద్దరికి 990 మార్కులు వచ్చాయని తెలిపారు. బైపీసీలో 1000 మార్కులకు గాను నలుగురు 989 మార్కులు పొందారని నున్న తిరుమలరావు వివరించారు. ‘విజ్ఞాన్’ విజయభేరి చేబ్రోలు: ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్ విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్స్ జె.మోహనరావు, వై.వెంకటేశ్వరరావు తెలిపారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు కె.లీలావతి (989), జి.వైశాలి (988), ఎం.స్నేహ (987), ఎస్కే.మీరావలి (987), కె.వంశీక్రిష్ణ (987), టి.సంజయ్ తేజ (986), సీహెచ్ మనస్వి (986), టి.సంజయ్ తేజ (986) మార్కులు సాధించారని తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో వి.కౌశిక్ (466), జీవీఏ తేజస్వి(464), వై.పార్థసారథి(464), జె.హేమంత్ సందీప్(464), కె.విష్ణువర్ధన్(464), ఆర్.శ్రీకాంత్(464), ఎం.అఖిలేష్ (464), ఎం.హర్ష వర్ధన్(464) మార్కులు సాధించారని చెప్పారు. సత్తా చాటిన భాష్యం గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీ విద్యార్థులు ఎం. హేమ ప్రియ హాసిని, జి సాయి మనోజ్ఞ 470 మార్కులకు 466 సాధించారని పేర్కొన్నారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో జి.చంద్రలేఖ్య వెయ్యి మార్కులకు గాను 990 మార్కులు, బి.అభిజ్ఞ, ఎం.లహరి పి.సాయి మనోజ్ఞ, కె.వినోదిని 988 మార్కులు సాధించినట్లు చెప్పారు. జూనియర్ బైపీసీలో భాష్యం మెడెక్స్ విద్యార్థులు ఎల్.నవ్య, షేక్ నసీమా 440కి 436 మార్కులు సాధించారని పేర్కొన్నారు. సీనియర్ బైపీసీలో ఎం.హాసిని లాలిత్య, ఇంటూరి యోషిత వెయ్యి మార్కులకు 985, శ్రీషా 984 మార్కులు సాధించినట్లు తెలిపారు. శ్రీగోసలైట్స్ విద్యార్థుల ప్రతిభ భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్ ఫలితాల్లో శ్రీ గోసలైట్స్ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి తమ ప్రతిభను కనబరిచారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి ని ఆలూరు కిరణ్మయి 990/1000 మార్క్‌లతో రాష్ట్రంలో సెకండ్ టాప్, కృష్ణాజిల్లాలో సెకండ్ టాప్‌లో నిలిచింది. అలాగే జూనియర్ ఇంటర్ విద్యార్థి ని ఇంజమూరి హరిచందన 435/440 మార్కులతో రాష్ట్రంలో సెకండ్ టాప్‌లో, కృష్ణాజిల్లాలో సెకండ్ టాప్‌లో నిలిచింది. ఈ సందర్భంగా శ్రీ గోసలైట్స్ చైర్మన్ నరేంద్ర బాబు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. శ్రీవిశ్వశాంతి విజయం భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్ ఫలితాల్లో కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన శ్రీవిశ్వశాంతి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు అత్యధికంగా 988, 984, 984, 982, 982, 981 మార్కులను సాధించారు. అదే విధంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 465, 464, 464, 463, 463, 463, 463, 462, 462, 462, 462, 462 మార్కులు పొందారు. ఈ ఘన విజయాలు సాధించిన విద్యార్థులను శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థల అధినేత మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు, డైరెక్టర్ మాదల సూర్యశేఖర్ అభినందించారు. -
ప్రభుత్వ కాలేజీల్లో 5,240 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యకాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను భారీగా పెంచేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించిం ది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల కొరత ఉండటం.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులకు మేలు చేసేలా వైద్య విద్య విస్తరణ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఐదు ఉండగా, ఇప్పుడు 17 ఉన్నాయి. ఈ సంవ త్సరంలో ఎనిమిది, 2023–24లో మరో ఎనిమిది కొత్త కాలేజీలు రానున్నాయి. సీట్ల విషయానికొస్తే.. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి ప్రభుత్వ కాలేజీల్లో 700 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 2022 నాటికి 2,840కి పెరిగాయి. వీటిని 2023–24 విద్యా సంవత్సరంకల్లా 5,240కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పీజీ మెడికల్ సీట్లు 2021 నాటికి 967 ఉండగా, వీటిని 2,500కు పెంచాలని నిర్ణయించింది. సూపర్‌స్పెషాలిటీ సీట్లు 2021 నాటికి 153 ఉండగా, వీటిని వెయ్యికి పెంచాలని నిర్దేశించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రచించినట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి. -
తెలంగాణలో 5,115 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,115 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,350 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని విశ్వవిద్యాలయం ప్రకటించింది. సోమవారం నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి నీట్లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. వారంలో ‘నీట్’రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఆందోళన చెందొద్దు.. రాష్ట్రంలో చాలామంది జాతీయస్థాయిలో వేలల్లో వచ్చిన ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో చూస్తే ర్యాంకు తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జాతీయస్థాయిలో 90 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు రాష్ట్రంలో కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో లక్షపైన ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ ఎంబీబీఎస్ సీటు వస్తుందంటున్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం త్వరలో మొదటి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తామని హెల్త్ వర్సిటీ వర్గాలు తెలిపాయి. అయితే తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా షెడ్యూల్ రాలేదని చెప్పాయి. అఖిల భారత కోటాకు 15 శాతం సీట్లు.. ఈసారి వైద్య విద్యా సంవత్సరం కరోనా కారణంగా నెలల పాటు వాయిదా పడింది. ఈసారి తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న దానిపై స్పష్టత రాలేదు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 15 శాతం సీట్లు అఖిల భారత కోటా కిందకు వస్తాయి. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్రం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. ఆలిండియా కోటాలో సీట్లు వచ్చినా కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తారో లేదోనన్న అనుమానాలను విశ్వ విద్యాలయం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
పరీక్షల బాధ్యత ప్రభుత్వ వర్సిటీలదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని అటానమస్ (స్వయం ప్రతిపత్తి), నాన్ అటానమస్ కాలేజీలలో ఇక నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల బాధ్యత పూర్తిగా ప్రభుత్వ యూనివర్సిటీలదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అటానమస్ కాలేజీలే సొంతంగా ప్రశ్న పత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసి, అన్ని కాలేజీలకూ ప్రభుత్వ యూనివర్సిటీలు తయారు చేసిన ప్రశ్న పత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అటానమస్ కాలేజీల్లో పరీక్ష విధానం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన ప్రతిభతో కూడిన విద్యను అందించడంతో పాటు పరీక్షల్లో అక్రమాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగా అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకు రావాలన్నారు. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. అన్ని కాలేజీలకు ఒకే విధానం ► ఇప్పటి వరకు ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులున్న నాన్ అటానమస్ కాలేజీలకు జేఎన్టీయూ (కాకినాడ), జేఎన్టీయూ (అనంతపురం)లు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తుండగా అటానమస్ కాలేజీల యాజమాన్యాలే ప్రశ్నపత్రాలు రూపొందించుకుని పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ► బీఏ, బీఎస్సీ, బీకాం తదితర నాన్ ప్రొఫెషనల్ కోర్సుల నాన్ అటానమస్ డిగ్రీ కాలేజీలకు ఆయా ఇతర యూనివర్సిటీలు పరీక్షలు పెడుతుండగా, అటానమస్ కాలేజీలు తమ పరీక్షలు తామే పెట్టుకుంటున్నాయి. ► ఇకపై అక్రమాలకు తావు లేకుండా అన్ని కాలేజీల్లో ఒకే రకమైన పరీక్షల విధానం అమలు చేయాలి. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, బీఏ, బీఎస్సీ, బీకాం తదితర నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల కాలేజీలన్నిటికీ ఈ విధానం వర్తిస్తుంది. ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలి ► ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది 6 వేల మంది పోలీసుల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ► ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సిహెచ్ఈ) చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన, 27న వసతి దీవెన ► ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్, ఏప్రిల్ 27న వసతి దీవెన కింద హాస్టల్, భోజన ఖర్చుల విడుదలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ► జగనన్న విద్యా దీవెన కింద దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50 వేల వరకు పెరుగుదల ఉందని, విద్యా దీవెన ద్వారా పిల్లల చదువులకు ఇబ్బంది రాదనే భరోసా తల్లిదండ్రుల్లో వచ్చిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. అందుకే గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షలకు పెరిగాయని చెప్పారు. ► ఎన్నికల నోటిఫికేషన్ల కారణంగా ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదలలో ఆలస్యమైంది. ► అటానమస్ కాలేజీల్లో యూనివర్సిటీలతో సంబంధం లేకుండా పరీక్షల నిర్వహణ అనేక అక్రమాలకు దారితీస్తోంది. ఈ దృష్ట్యా ఉన్నత ప్రమాణాలు ఏర్పడేలా అటానమస్ అయినా, నాన్ అటానమస్ అయినా అందరికీ ఒకే విధానంలో పరీక్షలు, ఫలితాలుండాలి. ఈ మేరకు ప్రభుత్వ యూనివర్సిటీలకు అధికారం కల్పించాలి. ► విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి. కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యా విధానాన్ని పరిశీలించాలి. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావడంతో పాటు ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలి. -
స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్స్ సరఫరా
సాక్షి, అమరావతి: ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు పెరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రారంభించనున్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 12–18 సంవత్సరాల విద్యార్థినులకు ప్రభుత్వం వీటిని ఇవ్వనుంది. శానిటరీ న్యాప్కిన్స్ కూడా కొనుగోలు చేయలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. దీని వల్ల బాలికల విద్యకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న కౌమార దశ బాలికలు 12.50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఒక్కొక్కరికి సంవత్సరానికి 120 ప్యాడ్స్ ప్రకారం 15 కోట్ల ప్యాడ్స్ కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం రూ.41.4 కోట్ల నిధులు అవసరం అవుతాయి. తక్కువ ధరతో సరఫరాకు ఆలోచన ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వైఎస్సార్ చేయూత దుకాణాల్లో శానిటరీ న్యాప్కిన్లను మహిళలకు తక్కువ ధరలకు విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ► ఇందు కోసం మెప్మా, సెర్ప్‌లు రాష్ట్ర స్థాయిలో టెండర్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ శానిటరీ నాప్కిన్లు లబ్ధిదారులకు ఎల్–1 రేటు కంటే 15% మార్జిన్‌తో అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చేయూత స్టోర్లు 35,105, పట్టణాల్లో 31,631 ఉన్నాయి. ► రాష్ట్రంలో 18–50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళల సంఖ్య సుమారు 1.26 కోట్లు ఉంటుదని అంచనా. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే– 4 (2015–16) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 67.5% మంది నెలవారీ పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జాతీయ సగటు 57.6%గా ఉంది. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – వి (2019–20) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 85.1% మంది రక్షణకు పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. (పట్టణాల్లో 90.6%, గ్రామీణ ప్రాంతాల్లో 82.5%) పరిశుభ్రమైన పద్ధతిలో స్థానికంగా తయారు చేసిన న్యాప్కిన్లు, శానిటరీ న్యాప్కిన్లు, టాంపోన్లు ప్రస్తుతం అందుతున్నాయి. మిగిలిన వారందరూ కూడా ఆరోగ్యకరమైన పద్ధతిని పాటించడం కోసమే ప్రభుత్వం చొరవ తీసుకుంది. -
రాష్ట్రంలోనూ 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా అమలు చేయడానికి ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఆయా సంస్థల్లో 10 శాతం సీట్లను పెంచి ఈ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర విద్యా సంస్థల్లో గతేడాది నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ).. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2020–21) అన్ని రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ఈ కోటా అమలు చేయాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ కాలేజీలకు ప్రయోజనం ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి వస్తే రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్లు పెరగనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, లా, పీజీ కాలేజీల్లో సీట్లు పెరుగుతాయి. 15 ఏళ్లుగా ఒక్క సీటు కూడా పెరగని ప్రభుత్వ కాలేజీల్లో 10 శాతం సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 300కు పైగా సీట్లు అదనంగా లభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,071 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోనూభారీ పెరుగుదల కోటా అమలుతో ప్రైవేటు కాలేజీల్లో కూడా భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ నిబంధనను ప్రైవేటు విద్యా సంస్థల్లో అమలు చేయాలా.. వద్దా అనేది సర్కారు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల్లో మొత్తం 6,52,178 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో డిగ్రీలోనే 4,43,269 సీట్లు ఉండగా.. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో 2,08,909 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం డిగ్రీ కోర్సులకు సంబంధించిన సీట్లు సగం కూడా భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ సీట్ల పెంపు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వృత్తి విద్యా కోర్సుల్లో 10 శాతం సీట్లను పెంచితే అదనంగా 20,890 సీట్లు అందుబాటులోకి వస్తాయి. -
ప్రతిష్టాత్మకంగా మూర్తిరాజు శత జయంతి వేడుకలు
సాక్షి, గణపవరం: మాజీ మంత్రి, విద్యాదాత, గాంధేయవాది దివంగత చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు శతజయంతి వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానుండటంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గణపవరంలోని చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదివారం మంత్రి శ్రీరంగనాథరాజు, ఎంపీ శ్రీధర్, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సందర్శించారు. కళాశాల ఆవరణను వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి పాల్గొనే వేదిక నిర్మాణం, ప్రజలు కూర్చోవడానికి ఏర్పాట్లపై సమీక్షించారు. జీవితాంతం గాంధేయవాదాన్ని ఆచరించి, విలువలు కలిగిన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందడమే కాక 100కు పైగా విద్యాలయాలు, కళాశాలలను స్థాపించిన ఆదర్శ నాయకుడు మూర్తిరాజు శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమం భావితరాలకు గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. తొలుత శత జయంతి వేడుకల ముగింపు కార్యక్రమాన్ని నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో మూర్తిరాజు నిర్మించిన గాంధీ భవనం వద్ద నిర్వహించాలని భావించారు. ఈ ప్రాంతాన్ని వారం క్రితం మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే వాసుబాబు పరిశీలించారు. అయితే ఈ ప్రదేశంలో భద్రతా కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల ట్రా ఫిక్ సమస్య ఉంటుందని కార్యక్రమాన్ని గణపవరం మూర్తి రాజు డిగ్రీ కళాశాలకు మార్చారు. ఇక్కడ మూర్తి రాజు జీవిత విశేషాలతో కూడిన చిత్రాల ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, ఇతర విశేషాలు తెలిపే ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు గాదిరాజు సుబ్బరాజు, మండల పార్టీ కనీ్వనర్ దండు రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి నడింపల్లి సోమ రాజు, పట్టణ కనీ్వనర్ బత్తి సాయి, నాయకులు తెనాలి సునీల్, తోట శ్రీను, సరిపల్లె చిన్నా, వెజ్జు వెంకటేశ్వరావు పాల్గొన్నారు. -
ఆరేళ్లయినా అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపుపై ఏళ్ల తరబడి నిరాసక్తత కొనసాగుతోంది. అటు యూనివర్సిటీలు, ఇటు ఉన్నత విద్యామండలి కూడా సీట్ల పెంపుపై ఆలోచనలు చేయడం లేదు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీనే పూర్తి కావడం లేదని, అందుకే డిమాండ్ ఉన్నా, కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడంపై దృష్టి పెట్టడం లేదని అధికారులు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ వంటి అనేక కోర్సులకు యూనివర్సిటీ కాలేజీల్లో భారీగా డిమాండ్ ఉంది. అయినా వాటిల్లో సీట్ల పెంపును ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అదే పరిస్థితి ఉన్నా తెలంగాణ వచ్చాక కూడా ఆ దిశగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి ఆలోచనలు చేయడం లేదు. కనీసం ఈ ఆరేళ్లలో ఒక్కసారి అయినా సీట్ల పెంపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన దాఖలు లేవు. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపును ఇటీవల నిలిపివేశారు తప్ప గతంలో ఆమోదించారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం సీట్ల పెంపు దిశగా ఆలోచనలు చేయడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో పదేళ్లుగా 420 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. కొన్ని మిగిలినా.. చేరే అవకాశంలేదు ప్రస్తుతం రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలోని 14 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,055 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌సహా దాదాపు ఆ సీట్లు అన్నీ వంద శాతం భర్తీ అవుతున్నాయి. చివరకు ఎన్ఐటీ, ఐఐటీలకు ఎవరైనా వెళ్లిపోతే మాత్రమే వందలోపు వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. వాటిల్లో చేరేందుకు స్లైడింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం వల్ల అవి ఖాళీగా ఉండిపోతున్నాయి. ఆ సీట్లలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు కొత్త సీట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లను పెంచవద్దని విధానపరమైన నిర్ణయం తీసుకుందని, అందుకే తాము ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. కానీ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఉండే డిమాండ్‌కు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలన్న ఆలోచనలు చేయకపోవడంతో విద్యార్థులకు ఏటా నిరాశ తప్పడం లేదు. ఇవే కాదు బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఫార్మసీ కాలేజీలు 3 మాత్రమే ఉండగా, వాటిల్లో కేవలం 180 సీట్లే ఉన్నాయి. ఫార్మసీ కోర్సులకు డిమాండ్ ఉన్నా సీట్ల పెంపును పట్టించుకోవడం లేదు. ఎంబీఏ కాలేజీలు 19 ఉండగా వాటిల్లో 1,290 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎంసీఏ కాలేజీలు 13 ఉండగా, వాటిల్లో 670 సీట్లు ఉన్నాయి. -
బీటెక్‌లో ఆన్లైన్ వ్యాల్యుయేషన్
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ పరిధిలో ఇకపై ఆన్లైన్లో వ్యాల్యుయేషన్ చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం ఎంటెక్‌లో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ వ్యాల్యుయేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన జేఎన్టీయూహెచ్.. ఇకపై బీటెక్‌లోనూ దానిని అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎంటెక్ పరీక్షల్లో ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్‌లో చేరే విద్యార్థుల సెమిస్టర్ పరీక్షల మూల్యాంకనాన్ని ఆన్లైన్లో చేపట్టాలని భావిస్తున్నట్లు జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. మరోవైపు పరీక్షల మూల్యాంకన విధానంలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక లెక్చరర్ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసిన తరువాత అతనికి తెలియకుండానే దానిని మళ్లీ మరో లెక్చరర్‌తో మూల్యాంకనం చేయిస్తున్నామని, తద్వారా మూల్యాంకనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఆ ఇద్దరు చేసిన మూల్యాంకనంలో భారీ తేడాలు ఉంటే మొదట మూల్యాంకనం చేసిన లెక్చరర్‌ను పిలిపించి మళ్లీ మూల్యాంకనం చేయిస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు జేఎన్టీయూలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గతేడాది ఎంటెక్‌లో ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టిన తాము ఈసారి ఎంటెక్‌లో 80 సీట్లతో డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకున్న కాలేజీలు.. ఈసారి రాష్ట్రంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు, కొన్ని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకునేందుకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అనుబంధ గుర్తింపు కోసం పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. వాటి విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. గతంలోనే ప్రభుత్వం రాష్ట్రంలో అదనంగా ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు వద్దని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి కోరినట్లు వివరించారు. మరోవైపు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ పరిశీలన తరువాత ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని వెల్లడించారు. నెలాఖరులో ఇంటర్వ్యూలు.. ఈ నెలాఖరులో 36 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనికోసం 340 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో 154 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, రోస్టర్ విధానంపై స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. -
ఆన్లైన్ ఆగమాగం
సాక్షి, హైదరాబాద్: ఇలాంటి అనేక సమస్యలతో రాష్ట్రంలోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు అన్న తేడా లేకుండా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో యాజమాన్యాలు బోర్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. రాష్ట్రంలో వొకేషనల్ కోర్సులు చదువుతున్న దాదాపు 70 వేల మంది విద్యార్థుల్లో అనేక మంది విద్యార్థుల పరీక్ష ఫీజులు బోర్డుకు చేరకపోవడం, చేరినా తప్పులు దొర్లడంతో యాజమాన్యాలు ఆగమాగం అవుతున్నాయి. ఇక గతంలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం తప్పుల తడకగా తయారైంది. దాంతో కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు వరుస తప్పుల కారణంగా బోర్డు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వొకేషనల్ విద్యార్థుల డేటా, ఓల్డ్ స్టూడెంట్స్ డేటా ఇప్పటివరకు అప్డేట్ కాలేదని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. తప్పుల తడకగా వచ్చిన విద్యార్థుల సమాచారంతో రేపు విద్యార్థులకు హాల్‌టికెట్లు జనరేట్ చేసే క్రమంలో అందరికి జనరేట్ కాకపోయినా, వాటిల్లో తప్పిదాలు దొర్లినా లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పుల సవరణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించినా బోర్డు కార్యదర్శి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో బోర్డు పరీక్షల నియంత్రణాధికారి చేతులెత్తేసినట్లు సమాచారం. ప్రత్యామ్నాయాలు ఉన్నా ససేమిరా.. తప్పుల తడకగా వచ్చిన సమాచారంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు జనరేట్ కష్టమని, అందులో తప్పులు దొర్లితే బోర్డుకే కాదు ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. డేటా సరిగ్గా ఉందా? లేదా? పొరపాట్లు ఉన్నాయా? ఉంటే వాటి సవరణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని పరీక్షల విభాగం ముఖ్య అధికారి మొత్తుకుంటున్నా బోర్డు కార్యదర్శి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బోర్డుకు వచ్చిన విద్యార్థుల ఫీజు చెల్లింపు వివరాలను కాలేజీల వారీగా వెబ్‌సైట్‌లోని వారి లాగిన్‌లో పెట్టి, మార్పులు ఉంటే తిరిగి పంపించమని అడుగుదామంటున్నా ఒప్పుకోవడం లేదని తెలిసింది. లేదా అన్ని కాలేజీలకు తమకు చేరిన డేటాను మెయిల్ చేసి, మార్పులు చేసి హార్డ్ కాపీలు తీసుకువస్తే బోర్డులో మార్పులు చేద్దామని సూచించినా ఒప్పుకోవడం లేదని సమాచారం. ఆ రెండింటిలో ఏది చేసినా తన వల్లే పొరపాట్లు జరిగాయని ఒçప్పుకున్నట్లు అవుతుందనే ఉద్దేశంతో బోర్డు కార్యదర్శి అందుకు ససేమిరా అంటున్నట్లు కొంతమంది అధికారులు పేర్కొన్నారు. తన హయాంలో ఈ పొరపాట్లు బయటకు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్లో ఎలాగూ కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి అధికారుల మార్పు ఉంటుందని, తాను వెళ్లిపోయాక కొత్తగా వచ్చే వారే చూసుకుంటారన్న ఆలోచనతో తప్పుల సవరణకు విముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఎందుకీ మొండితనం.. సమస్యలు ఉన్నాయని బోర్డు అధికారులకు, బోర్డు కార్యదర్శికి ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను (సీజీజీ) పక్కకు పెట్టి మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు ఓ ప్రైవేటు సంస్థకు పనులను అప్పగించడమే గందరగోళానికి కారణమైంది. పైగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, పరిస్థితి గందరగోళంగా మారిందని బోర్డు కార్యదర్శి అశోక్‌కు ఫిర్యాదులు అందినా స్పందించడం లేదని ప్రైవేటు యాజమాన్యాలే కాదు.. ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఉన్నాయని తెలిసినా వాటి పరిష్కారానికి వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా ప్రమాదకర పరిస్థితిని తెస్తున్నారని విమర్శిస్తున్నారు. తప్పులను సవరించకుండా, ఫీజు చెల్లించకుండా విద్యార్థులు నష్టపోయేలా చేసేందుకే కొంతమంది అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని, తద్వారా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రమాదం ఉందని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పేర్కొంటున్నారు. నల్లగొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో (వొకేషనల్) 44 మంది ఫార్మాటెక్ విద్యార్థులున్నారు. ఇప్పటివరకు వారి ఫీజు బోర్డుకు చేరలేదు. ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని ప్రయత్నిస్తున్నా డేటా కనిపించడం లేదు. ప్రతి రోజు బోర్డుకు మెయిల్ పంపుతుంటే అప్డేట్ చేస్తామంటున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఫీజు చెల్లింపు గడువు ముగిసిపోయింది. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ గందరగోళంలో పడ్డారు. దేవరకొండ దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో (వొకేషనల్) ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ (ఏఈటీ) కోర్సును 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారి ఫీజు వాస్తవానికి రూ. 11,490. కానీ వారందరి ఫీజు కింద ఆన్లైన్లో చెల్లించినపుడు రూ.7,440 మాత్రమే డిడక్ట్ అయి చలానా జనరేట్ అయింది. ఇద్దరు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వారి ఫీజులూ యాక్సెప్ట్ కావడం లేదు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లే దిక్కు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో సర్కారు కళాశాలల పరిస్థితి దారుణంగా ఉంది. రెగ్యులర్ లెక్చరర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్లు, గెస్ట్ అధ్యాపకులతోనే బోధన సాగుతోంది. ఇంకా ఖాళీల కొరత ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు లేకపోవడంతో జూనియర్ లెక్చరర్ల నియామకాలు జరగడం లేదు. గత నాలుగైదు ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాలు కూడా లేవు. ప్రతియేడు అవసరమున్నచోట గెస్ట్ లెక్చరర్లను నియమించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియ వల్ల కళాశాలల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లినప్పటికీ పూర్తిస్థాయిలో అధ్యాపకులు జిల్లాకు రాలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జూనియర్ కళాశాలల్లో..ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 13 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. 13 కళాశాలల్లో కలిపి మంజూరు పోస్టులు 175 కాగా, వీటిలో 13 మంది రెగ్యులర్, 132 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 30 మంది వరకు గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. లైబ్రేరియన్లు, పీడీల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారు. డిగ్రీ కళాశాలల్లో.. జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో కూడా ఖాళీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్నేళ్లుగా కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్లు లేరు. ఇన్చార్జి ప్రిన్సిపాల్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. దీంతో పాలన గాడిన పడడం లేదు. కళాశాలల అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఆదిలాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో 17 పోస్టులకు గాను ముగ్గురు మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. పది మంది కాంట్రాక్ట్ పద్ధతిన, ఒకరు గెస్ట్ లెక్చరర్ పనిచేస్తున్నారు. మరో ముగ్గురు ఆన్‌డ్యూటీపై విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ పురుషుల డిగ్రీ కళాశాలలో 34 పోస్టులకు గాను 22 మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది కాంట్రాక్ట్ పద్ధతిన, ముగ్గురు గెస్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో పది పోస్టులకు గాను ముగ్గురు విధులు నిర్వర్తిస్తుండగా, ఇందులో నుంచి ఒకరు ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలకు ఆన్‌డ్యూటీలో ఉన్నారు. ఒక లెక్చరర్ సెలవులో ఉండగా, ఒక లెక్చరర్ మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఈ కళాశాలకు ఇన్చార్జీ ప్రిన్సిపాల్‌గా ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా ఎనిమిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు బోధిస్తున్నారు. ఈ కళాశాలలో హిందీ పోస్టు మంజూరు లేకపోవడంతో గెస్ట్ లెక్చరర్‌తోనే ప్రతియేడు బోధిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. సంఖ్య పెరిగినా.. సౌకర్యాలు కరువు సర్కారు కళాశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి అనుగుణంగా సౌకర్యాలు, బోధన సిబ్బందిని ప్రభుత్వం నియమించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో నాణ్యమైన విద్య అందడంలేదని తెలుస్తోంది. జిల్లాలో డిగ్రీ కళాశాల ఫలితాల పరంగా చూస్తే కనీసం 20శాతం కూడా విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంలేదు. సరైన విద్యాబోధన లేకపోవడమే దీనికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. కళాశాలలకు నిధుల లేమి తీవ్రంగా వేధిస్తోంది. వేతనాలు సరిపడా నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తుంది. డిగ్రీ కళాశాలల్లో సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో న్యాక్ గుర్తింపు గ్రేడ్ తక్కువగా వస్తుంది. లెక్చరర్లు పూర్తిస్థాయిలో ఉంటేనే వారు కీలకంగా వ్యవహరిస్తారు. న్యాక్ ఏ–గ్రేడ్ గుర్తింపు ఉంటే నిధులు కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయని పలువురు లెక్చరర్లు పేర్కొంటున్నారు. -
తొలిరోజు పస్తులే !
రాయదుర్గంటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసి కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు వడ్డించడం అనే ప్రభుత్వ కొత్త కాన్సెప్ట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో అమలు కావాల్సిన మధ్యాహ్న భోజన పథకానికి మొదటిరోజు (బుధవారం) నుంచే బాలారిష్టాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా కేవలం 7 కళాశాలల్లో మాత్రమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. 63 మండలాల్లోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 5 ఎయిడెడ్ కళాశాలలు మొత్తంగా 47 కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 22 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు. బుధవారం జిల్లాలోని పెద్దపప్పూరు, తాడిపత్రి, గుదిబండ, మడకశిర, హిందూపురం, తనకల్లు, రాయదుర్గంలోని కళాశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం అమలైంది. రాయదుర్గంలో రెండు కళాశాలలు ఉండగా బాలికల జూనియర్ కళాశాలలో మాత్రమే భోజనం వడ్డించారు. సమీప పాఠశాల ఏజెన్సీ నుంచి మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాళ్లకు జీవో జారీ అయింది. అయితే కుకింగ్ ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనం వడ్డించేలా విద్యాశాఖ నుంచి తమకు ఆదేశాలు లేకపోవడంతోనే తాము హెచ్ఎంలకు ఆదేశాలు ఇవ్వలేదని పలువురు ఎంఓఈలు పేర్కొంటున్నారు. ఈ కారణంగా 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి రోజు మధ్యాహ్న భోజనం అమలు కాలేదు. అంతేకాదు కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలని ఎంఈఓ నుంచి ఆదేశాలు తమకు అందలేదని కొందరు వంట ఏజెన్సీ నిరా>్వహకులు చెబుతున్నారు. ఇలా అధికారుల మధ్య సమన్వయ లోపంతో పథకం ప్రారంభమైనా కళాశాల విద్యార్థులు పస్తులుండాల్సి వస్తోంది. అమలుపై శ్రద్ధ ఏదీ? ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మ«ధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రకటించింది. దీంతో కళాశాలకు దూరం నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చి చదువుకునే పేద విద్యార్థులు ఎంతో సంతోషపడ్డారు. అయితే అందుకు తగిన విధివిధానాలు రూపొందించడంలో సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 1 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆ దిశగా మందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. నెలరోజుల వ్యవధిలో ప్రభుత్వం జూనియర్ కళాశాలల వారీగా ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, వారికి ప్లేట్లు, గ్లాసులు ఎన్ని కావాలి, వంట వండటానికి ఎన్ని వంటపాత్రలు కావాలన్న దానిపై కసరత్తు చేయకపోవడంతోనే అన్ని కళాశాలల్లో మొదటి రోజు భోజనం అందలేదు. ఏజెన్సీలపై అదనపు భారం పాఠశాల కుకింగ్ ఏజెన్సీలకు మూడు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు స్వచ్ఛంధ, ప్రైవేటు సంస్థలకు భోజన పథకాన్ని అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అదనపు వంట పాత్రలు లేవు, విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసి కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించడంపై పలువురు విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. వివరాలు స్పష్టంగా ఉన్నాయి కళాశాలల్లో సమీప కుకింగ్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్చే జారీ చేసిన జీవో కాపీలను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపించాం. పాఠశాలల్లో అమలు చేసే మధ్యాహ్న భోజనాన్ని కళాశాల విద్యార్థులకు అమలు చేసేలా స్పష్టంగా వివరాలు జీవోలు ఉన్నాయి. అందుకు ఒక ప్రత్యేక ఖాతాను సైతం ఏర్పాటు చేసుకుంటే బిల్లులు మంజూరవుతాయి. గురువారం నుంచి అన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు ఎంఈఓలు కృషి చేయాలి.– చంద్రశేఖర్‌రావు, డీవీఈఓ -
కాలేజీ విద్యార్థులకు వరం
బోథ్ (ఆదిలాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్, మోడల్ స్కూళ్లలో అమలు చేయాలని భావిస్తోంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న దాదాపు పది వేల మంది విద్యార్థుల ఆకలి తీరనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాçహ్న భోజనం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించడంతో ఈ నెల 28న విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు సమావేశమై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. పథకం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. భోజనం పథకం అమలును అక్షయపాత్ర సంస్థకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమలుకు ప్రతిపాదనలు.. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన భోజన పథకం అమలు కోసం ప్రభుత్వం మూడు రకాల ప్రతిపాదనలు తయారు చేస్తోంది. విద్యార్థులకు కావాల్సిన సరుకులను ప్రభుత్వమే అందజేయడం, లేక అక్షయ ఫౌండేషన్‌కు అందించడం, లేదా పులిహోరా, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు వంటి తృణ ధ్యాన్యాలతో కలిపి విద్యార్థులకు అందించడం వంటి ప్రతిపాదనలను తయారు చేస్తోంది. కాగా మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టులో మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలో పదివేల మంది విద్యార్థులు.. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ జూనియర్, మూడు ప్రభుత్వ డిగ్రీ, ఒకటి ప్రభుత్వ బీఈడీ, ఒకటి ప్రభుత్వ డీఈడీ, ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆరు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 10,194 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనానికి రూ.5 కోట్ల వరకు సంవత్సరానికి ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అక్షయ ఫౌండేషన్ సంస్థ ద్వారా భోజన కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హాజరు పెరిగే అవకాశం.. ప్రభుత్వ కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టనుండడంతో ఆయా కళాశాలలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ఆకలి బాధలు తీరనున్నాయి. చాలా కళాశాలలు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోనే ఉండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉదయం పూట తినకుండానే వస్తున్నారు. మధ్యాహ్నం సైతం తినకుండా క్యాంటీన్లలో స్నాక్స్, బిస్కట్ వంటివి తింటూ ఆకలి తీర్చుకుంటున్నారు. దీంతో అలసిపోయి క్లాసులు వినలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మరికొందరు కళాశాలలకు రావడమే మానేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు వరంలా మారనుంది. దీంతో కళాశాలకు హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నాం.. పదవ తరగతి వరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఉండడం వల్ల అక్కడే తినేవాళ్లం. ఇంటర్మీడియట్లో చేరిన తరువాత మధ్యాహ్న భోజనం లేకుండా పోయింది. మధ్యాహ్నం వేళ ఇంటికి వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం ఉన్న క్లాసులకు ఆలస్యం అవుతోంది. అలసినట్లు అవుతోంది. – ఏ.రఘు, ఇంటర్ విద్యార్థి, బోథ్ -
కాలేజీ విద్యార్థులకూ ‘భోజనం’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కాలేజీల్లో చదువు కుంటున్న విద్యార్థులకు శుభవార్త. ఇంటి దగ్గర్నుంచి ఆదరాబాదరాగా లంచ్‌బాక్స్ తీసుకెళ్లాల్సిన పనికి స్వస్తి పలకండి. ఇకపై కాలేజీలోనే వేడివేడి భోజనాన్ని మధ్యాహ్నం భుజించొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జూనియర్ కాలేజీల్లో పథకం అమలుపై ఇదివరకే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మధ్యాహ్న భోజనంపై నిర్ణయం తీసుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ మంత్రివర్గ ఉప సంఘానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూల్లోని ఇంటర్ విద్యార్థులు.. డీఈడీ, బీఈడీ, పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై నిర్ణయం తీసుకుంది. అక్షయపాత్రకు బాధ్యతలు... ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంపై కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్, మోడల్ స్కూల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు.. డీఈడీ, బీఈడీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులు కలిపి దాదాపు 5 లక్షల మంది ఉంటారని విద్యాశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో అంతమంది విద్యార్థులకు ఏకకాలంలో భోజనం అందించడం సవాలే. ఈ నేపథ్యంలో పథకం అమలు బాధ్యతలను అక్షయపాత్రకు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పథకం అమలు కోసం వంట గదులు, సామగ్రిని సమాకూర్చుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అక్షయ పాత్ర సంస్థ ప్రతినిధులకు మంత్రులు స్పష్టం చేశారు. పథక అమలులో 3 రకాల ప్రతిపాదన లు మంత్రులు సూచించారు. 5 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కావాల్సిన సరుకులన్నీ ప్రభుత్వమే సరఫరా చేయడం... అక్షయపాత్ర సంస్థ స్వయం సమకూర్చుకోవడం.. అలాగే నిర్దేశించిన విద్యార్థులకు పులిహోరా, బ్లాక్ రైస్, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జల వంటి విభిన్న తృణ ధాన్యాలతో కూడిన భోజనాన్ని అందించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. అక్షయ పాత్ర సంస్థ ఏర్పాటు చేసిన వంటశాలలే కాకుండా కాలేజీలకు సమీపంలోని మెస్‌లు, హోటళ్ల సేవలు కూడా వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిం చాలని మంత్రులు వివరించారు. ఆగస్టు రెండోవారంలోపు కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తే.. మూడో వారంలో మరోమారు మంత్రివర్గ బృందం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్, మాధ్యమిక శిక్షా అభియాన్ సంయుక్త సంచాలకులు జి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన సర్కారు కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల హవా కొనసాగింది. ప్రైవేటు కాలేజీలను మించి ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో ప్రైవేటు కాలేజీల విద్యార్థులు 69 శాతం ఉత్తీర్ణత సాధించగా.. గురుకులాలు సహా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు 71 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంట ర్మీడియెట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. క్రమక్రమంగా ప్రైవేటు కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని.. ప్రభుత్వ కాలేజీల్లో పెరుగుతోందని కడియం చెప్పారు. ప్రైవేటు కాలేజీలే బాగుంటాయన్న భ్రమలు తొలగిపోతున్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం అధికంగా ఉందని తెలిపారు. మొత్తంగా ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికల ఉత్తీర్ణతాశాతం అధికంగా నమోదైనట్టు చెప్పారు. కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుశీల్‌కుమార్, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండింటా మేడ్చల్ టాప్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండింటిలోనూ మేడ్చల్ జిల్లా టాప్‌గా నిలిచింది. ఫస్టియర్‌లో 79 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ టాప్‌లో, 74 శాతంతో రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచాయి. 42 శాతం ఉత్తీర్ణతతో మెదక్ చివరి స్థానంలో నిలిచింది. వొకేషనల్‌లో 72 శాతం ఉత్తీర్ణతతో కొమురంభీం జిల్లా టాప్‌లో, 71 శాతంతో వనపర్తి రెండో స్థానంలో నిలవగా.. 46 శాతం ఉత్తీర్ణతతో నాగర్‌కర్నూల్, జగిత్యాల చివరి స్థానంలో నిలిచాయి. సెకండియర్ జనరల్ ఇంటర్లో 80 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్, కొమురంభీం జిల్లాలు టాప్‌లో నిలవగా.. 77 శాతంతో రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచింది. 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్ చివరి స్థానంలో ఉంది. వొకేషనల్‌లో 86 శాతం ఉత్తీర్ణతతో వనపర్తి ప్రథమ స్థానంలో, 84 శాతంతో కొమురంభీం రెండో స్థానంలో నిలవగా.. 55 శాతంతో సిద్దిపేట చివరి స్థానంలో నిలిచింది. సత్తా చాటిన గురుకులాలు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతలో గురుకులాలు సత్తా చాటాయి. 97.7 శాతం ఉత్తీర్ణతతో విద్యాశాఖ గురుకులాలు (టీఎస్ఆర్జేసీ) అత్యధిక ఉత్తీర్ణతను సాధించగా.. తరువాత స్థానంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాలు నిలిచాయి. మొత్తంగా గురుకులాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ కాలేజీలు కలిపి 71.42 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రైవేటు కాలేజీలు 69 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. 18 నుంచి మార్కుల మెమోలు ఇంటర్ ఫలితాలకు సంబంధించి మార్కుల మెమోలను ఈనెల 18 నుంచి విద్యార్థులకు అందజేయనున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. మెమోల్లో ఏవైనా తప్పిదాలు ఉన్నట్టయితే.. మే 14వ తేదీలోపు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ల ద్వారా బోర్డుకు దరఖాస్తు చేయాలని పేర్కొంది. నిర్దేశిత తేదీ తర్వాత వచ్చే వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. రీవెరిఫికేషన్, జవాబు పత్రాల ప్రతుల కోసం.. విద్యార్థులు తమ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, జిరాక్స్ ప్రతులు పొందేందుకు బోర్డు అవకాశం కల్పించింది. ఇందుకోసం విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి రీవెరిఫికేషన్/ రీకౌంటింగ్/ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్‌లో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని.. దరఖాస్తును పూరించాలని బోర్డు సూచించింది. ఈనెల 16 నుంచి 20వ తేదీలోపు ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలి. జవాబు పత్రాల నకలు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించాలి. నిర్ణీత తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించరు. -
ప్రభుత్వ టీచర్ల పిల్లలు.. ప్రభుత్వ బడిలోకే రావాలి..
పాఠాలు చెప్పేది సర్కారు బడిలో.. పిల్లల్ని పంపేది ప్రైవేటు స్కూళ్లకా? ఇదెక్కడి న్యాయం?: హోంమంత్రి నాయిని - మంత్రి వ్యాఖ్యలపై టీచర్ల నిరసన.. ముందు నేతల పిల్లల్ని పంపాలని ఫైర్ - గందరగోళంగా గురుపూజోత్సవం.. నాయిని క్షమాపణతో శాంతించిన టీచర్లు సాక్షి, హైదరాబాద్: ‘‘నిరుపేదల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుంటే.. ఆ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం వారి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను భ్రస్టుపట్టిస్తూ పరోక్షంగా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటుకు కొమ్ముకాస్తున్నారు. విచ్చలవిడిగా సెలవులు వాడుకుంటూ ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు కారణమవుతున్నారు. ఈ దుస్థితి పోవాలి. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి. అప్పుడే ప్రభుత్వ విద్యాలయాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తాయి..’’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాస్థాయిలో ఎంపికైన 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీచర్లు తమ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. చాలామంది టీచర్లు, డాక్టర్లు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటు స్కూళ్లు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారని, ఇలాంటి వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ప్రభుత్వ టీచర్లు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవ హరిస్తే సమాజం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. మనలో సర్వేపల్లిలాంటి వారెందరు? సర్వేపల్లి రాధాకృష్ణలాంటి ఉపాధ్యాయులు మనలో ఎందరు ఉన్నారని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదని హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 80 శాతానికిపైగా ఉండేదని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం సగానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల హాజరు శాతమే కాదు చివరకు టీచర్ల హాజరు శాతాన్ని చూసి నోరెళ్లబెట్టాల్సి వస్తోందన్నారు. మనకు మనమే విద్యా వ్యవస్థను నాశనం చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు.. వారిలోని సృజనాత్మకతను గుర్తించి వెలికి తీసినప్పుడే గురువులపై గౌరవం పెరుగుతుందని, తాను ఇప్పుడు కలెక్టర్‌గా ఉన్నానంటే కారణం గురువులేనని చెప్పారు. ఉపాధ్యాయులకు యోగ్యత ఎంతో అవసరమని, అది లేకుంటే వృత్తికి న్యాయం చేయలేరని అన్నారు. ముందు మీరు చేర్పించండి..: టీచర్లు నాయిని వ్యాఖ్యలపై కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించి, ఆ తర్వాత టీచర్లకు సూచించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కావడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా తమకు నీతులు చెప్పడమేంటని హోంమంత్రిని ప్రశ్నించారు. దీంతో గురుపూజోత్సవ కార్యక్రమం కొంత గందరగోళంగా మారింది. చివరకు హోంమంత్రి క్షమాపణలు కోరడంతో టీచర్లు శాంతించారు. -
వేలానికి వైద్య విద్య!
► సీమ మెడికల్ సీట్లు అమ్మేస్తున్నారు ► ప్రతిభావంతులను వెనక్కి నెట్టి.. వైద్యసీట్ల అమ్మకం ► ఒక్కో సీటుకు కోటి రూపాయల వరకు రేటు ► రెండో కౌన్సెలింగుకు ముందు బ్లాకవుతున్న సీట్లు వైద్య విద్య అంటే అందరికీ మక్కువే. మెడికల్ సీటు సాధించాలని అహోరాత్రాలు కష్టపడి చదివి మంచి ర్యాంకులు పొందిన తర్వాత కూడా సీటు రాకపోతే.. తమకు దక్కాల్సిన సీటు దొడ్డిదారిలో వేరేవాళ్లకు వెళ్లిపోయందని తెలిస్తే.. ఆ పసి హృదయాలు ఎంత తల్లడిల్లిపోతాయి! రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు విద్యార్థులు ఇప్పుడు ఇలాగే బాధపడుతున్నారు. ఎంసెట్‌లో తాము సాధించిన ర్యాంకుకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కచ్చితంగా సీటు వస్తుందని భావించినా చివరి నిమిషంలో అది కాస్తా చేజారిపోతుంటే ఏం చేయాలో తెలియక ఆ చిన్నారులు చివరకు మెడిసిన్ చదవాలన్న ఆశను కూడా చంపేసుకుంటున్నారు. రాయలసీమ పిల్లల విషయంలో ఎందుకిలా జరుగుతోందని అనుమానం వచ్చిన ఆర్టీఐ కార్యకర్త మర్రి రమణ.. ఈ పుట్టను మొత్తం కదిలించారు. అక్కడ తీగలాగితే డొంకంతా కదిలింది. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పది వైద్య కళాశాలల మీద అడ్మిషన్ల విషయంలో ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం ద్వారా ఖరారైంది. నాన్ మెరిట్ విద్యార్థులకు సీట్లు వస్తున్నాయని, మెరిట్ అభ్యర్థులకు మొండిచెయ్యి చూపుతున్నారని ఆయన అన్నారు. తనకు వచ్చిన ర్యాంకుతో తిరుపతి పద్మావతి వైద్యకళాశాలలో సీటు రావడం గ్యారంటీ అనే భావించానని, కానీ అక్కడికెళ్తే.. కౌన్సెలింగ్ ప్రారంభమైన గంటకే సీట్లన్నీ అయిపోయినట్లు చెప్పారని విధుప్రియ అనే విద్యార్థిని వాపోయింది. తన సీటును వేరేవాళ్లకు అమ్మేసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని చెప్పింది. ఒక్క పద్మావతి కళాశాలే కాదు.. తనకు కచ్చితంగా సీటు వస్తుందని భావించిన చాలా కాలేజీలలో ఆమెకు చుక్కెదురైంది. కేవలం డబ్బు, రికమండేషన్లు ఉన్నవాళ్లకే మెడికల్ సీట్లు వస్తున్నాయి తప్ప ప్రతిభావంతులకు ఏపీలోని ప్రభుత్వ కళాశాలల్లో వైద్యవిద్య చదువుకునే అవకాశం దొరకట్లేదని ఆమె తల్లి స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవంతా ఎందుకని, ఇక వైద్యవిద్య చదవాలన్న ఆశను విధుప్రియ వదిలేసుకుంది. కర్నూలుకు చెందిన సాయిశ్రీ కూడా మెడికల్ సీట్ల కుంభకోణం బాధితురాలే. ఆమెకు వచ్చిన ర్యాంకుకు కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఆమెకు దాదాపు సీటు ఖాయం అనుకుంటున్న సమయంలో వాళ్లు లేదు పొమ్మన్నారు. తర్వాత ఆమెకు ఎక్కడా సీటు రాలేదు. అయినా పట్టు వదలకుండా మరోసారి ప్రయత్నించాలని ఆమె భావిస్తోంది. ఇదంతా ఎలా జరుగుతోందని జాతీయ మీడియా కూడా దృష్టిపెట్టింది. దాంతో.. రెండో కౌన్సెలింగుకు ముందే సీట్లను బ్లాక్ చేస్తున్నారని తెలిసింది. వాటిని నాన్ లోకల్ విద్యార్థులకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. స్థానిక విద్యార్థులకు మంచి ర్యాంకు వచ్చినా సీట్లు ఇవ్వకుండా, వాటిని ఎన్నారై కోటాలో అమ్ముకుంటున్నట్లు సమాచారం. దాదాపు వంద సీట్ల వరకు ఇలా అమ్ముడుపోయాయని, ఒక్కో సీటును 80 లక్షల నుంచి కోటి వరకు అమ్మారని అంటున్నారు. అయితే.. వైద్య సీట్ల కేటాయింపులో తాము చేసేది ఏమీ లేదని, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయమే రిజర్వేషన్ల ప్రకారం, ర్యాంకుల ప్రకారం సీట్లు కేటాయిస్తుందని కర్నూలు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సీబీఐ విచారణతోనే న్యాయం రాజ్యాంగంలోని 371 డి అధికరణ ప్రకారం 85 శాతం సీట్లు స్థానికులకు, మిగిలిన 15 శాతం స్థానికేతరులకు ఇవ్వాలి. కానీ, రాయలసీమ వైద్య కళాశాలల్లో మాత్రం స్థానిక విద్యార్థులకు మంచి ర్యాంకులు ఉన్నా వాళ్లకు వైద్యసీట్లు ఇవ్వకుండా.. వాటిని అమ్మేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సీట్లు రాకపోవడంతో కొంతమంది హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లగా, వారికి మాత్రం న్యాయం జరిగిందని, అలా వెళ్లలేని విద్యార్థులకు వైద్యులయ్యే అవకాశం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రభుత్వ కాలేజీలే ఫస్ట్!
► ఇంటర్ సెకండియర్‌లో 66 శాతం ఉత్తీర్ణత ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం ఉత్తీర్ణత ► ఫస్ట్, సెకండియర్‌లో ఎప్పట్లాగే ఈసారి బాలికల హవా ► బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతమే ఎక్కువ.. ఏకంగా 10 శాతం తేడా ► మొత్తమ్మీద ఫస్టియర్‌లో 53.55 శాతం, సెకండియర్‌లో 62.95 శాతం ఉత్తీర్ణత ► ఫలితాల్లో రంగారెడ్డి ఫస్ట్.. నల్లగొండ లాస్ట్ ► విడుదలైన ఇంటర్ ఫలితాలు.. ఈ నెల 26 నాటికి మెమోలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు దుమ్మురేపాయి! ప్రైవేటు కాలేజీల కన్నా ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేటు కాలేజీలు 63 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రభుత్వ కళాశాలలు 66 శాతం ఉత్తీర్ణత సాధించాయి. శుక్రవారం ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయ ఆవరణలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయడం విశేషం. ప్రథమ సంవత్సరంలో మాత్రం ప్రైవేటు కాలేజీలే ముందున్నాయి. ఆ కాలేజీల ఉత్తీర్ణత 55 శాతం ఉండగా.. ప్రభుత్వ కాలేజీలు 45 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తంగా ద్వితీయ సంవత్సరంలో 62.95 శాతం మంది ఉత్తీర్ణులు కాగా... ప్రథమ సంవత్సరంలో 54 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎప్పట్లాగే ఈసారి కూడా బాలికలే అత్యధికంగా పాసయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలుర కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత శాతంతో టాప్‌గా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో..: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం జనరల్‌లో 4,20,180 మంది పరీక్షలకు హాజరు కాగా 2,25,033 మంది(53.55 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 2,14,191 మంది పరీక్షలు రాయగా.. 1,26,116 మంది (58.9 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2,05,989 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 98,917 మంది (48 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో 36,495 మంది పరీక్షలకు హాజరు కాగా 18,470 మంది (50.6 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో: సెకండియర్ జనరల్ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 3,89,883 మంది పరీక్షలకు హాజరు కాగా 2,45,469 మంది (62.95 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 1,98,266 మంది పరీక్షలకు హాజరు కాగా 1,34,111 మంది (67.64 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,91,,617 మంది పరీక్షలకు హాజరు కాగా 1,11,358 మంది (58.11 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ప్రైవేటు విద్యార్థులు 84,016 మంది పరీక్షలకు హాజరు కాగా.. 22,436 మంది (26.7 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 28,348 మంది పరీక్షలకు హాజరు కాగా 16,776 మంది (59.17 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో 4,7,87 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయగా 2,194 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండింటా రంగారెడ్డి టాప్ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా టాప్‌గా నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా... 65 శాతం ఉత్తీర్ణతతో ఖమ్మం రెండో స్థానంలో నిలిచింది. 53 శాతంతో మెదక్, నల్లగొండ చివరి స్థానాల్లో నిలిచాయి. ప్రథమ సంవత్సరంలో 69 శాతంతో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా, 56 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 41 శాతం ఉత్తీర్ణతతో నల్లగొండ చివరి స్థానంలో ఉంది. ఈ నెల 26 నాటికి మార్కుల మెమోలు మార్కుల మెమోలను ఈ నెల 26 నుంచి సంబంధిత రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ల (ఆర్ఐవో) నుంచి పొందవచ్చు. మూడు రోజుల్లో మార్కుల రిజిస్టర్లను ఆర్ఐవోలకు పంపిస్తారు. అలాగే మార్కుల జాబితాలను ఆర్ఐవోల నుంచి సంబంధిత ప్రిన్సిపల్స్ తీసుకెళ్లవచ్చు. వీలైనంత త్వరగా వాటిని విద్యార్థులకు అందజేయాలి. మార్కుల మెమోల్లో ఏమైనా పొరపాట్లు వస్తే మే 23 లోగా సంబంధిత ప్రిన్సిపల్స్ ద్వారా విద్యార్థులు ఇంటర్మీడియెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థుల్లో వివిధ గ్రేడ్లలో ఉత్తీర్ణులు ఇలా.. ‘ఎ’ గ్రేడ్‌లో: 1,10,242 (48.98 శాతం) ‘బి’ గ్రేడ్‌లో: 67,150 (29.84 శాతం) ‘సి’ గ్రేడ్‌లో: 32,208 (14.31 శాతం) ‘డి’ గ్రేడ్‌లో: 15,433 (6.85 శాతం) ద్వితీయ సంవత్సర జనరల్ విద్యార్థుల్లో వివిధ గ్రేడ్లలో ఉత్తీర్ణులు ఇలా.. ‘ఎ’ గ్రేడ్‌లో: 1,29,636 (52.81 శాతం) ‘బి’ గ్రేడ్‌లో: 73,818 (30.07 శాతం) ‘సి’ గ్రేడ్‌లో: 31,496 (12.83 శాతం) ‘డి’ గ్రేడ్‌లో: 10,519 (4.28 శాతం) సెకండియర్‌లో ఏటేటా పెరుగుతున్న ఉత్తీర్ణత గతంతో పోలిస్తే ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఏటేటా ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లుగా ఉత్తీర్ణత తీరు ఇలా ఉంది. జనరల్‌లో సెకండియర్ రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత.. సంవత్సరం హాజరైంది ఉత్తీర్ణులు ఉత్తీర్ణత శాతం 2013 3,88,619 2,32,994 59.95 2014 3,95,949 2,38,133 60.14 2015 3,78,973 2,32,742 61.41 2016 3,89,883 2,45,469 62.95 ప్రథమ సంవత్సరంలో తగ్గిన ఉత్తీర్ణత ప్రథమ సంవత్సరంలో గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది 55.62 శాతం ఉండగా ఈసారి అది 53.55 శాతానికి పడిపోయింది. గత నాలుగేళ్లుగా ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత.. సంవత్సరం పరీక్ష రాసింది పాసైంది శాతం 2013 4,37,248 2,19,679 50.24 2014 4,15,026 2,18,549 52.65 2015 4,31,363 2,39,954 55.62 2016 4,20,180 2,25,033 53.55 -
తెరిచేనాటికైనా.. తిప్పలు తప్పేనా?
* సమస్యల వలయంలో ప్రభుత్వ కళాశాలలు * శిథిలస్థితిలో భవనాలు, చాలని తరగతి గదులు * మరుగుదొడ్లు, సైకిల్ షెడ్లు కరువు * భర్తీ కాని అధ్యాపకుల పోస్టులు * పునఃప్రారంభం నాటికైనా ఇక్కట్లను * తప్పించాలంటున్న విద్యార్థులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ప్రభుత్వ కళాశాలకు ఎందుకు పోలే’దని విద్యార్థుల్ని అడిగితే.. ‘అక్కడ వసతుల్లేవు, పాఠాలు చెప్పడానికి అధ్యాపకులు లే’రంటారు! ‘ఎందుకలా’ అని ప్రిన్సిపాల్‌ను అడిగితే ‘ప్రతిపాదనలు పంపాం, ఇంకా మంజూరు కాలే’దంటారు. ‘ప్రతిపాదనలకు మోక్షం ఎప్పు’డని ప్రభుత్వాన్ని అడిగితే ‘ఖజానా ఖాళీ.. నిధుల్లేవు’ అని సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘ఇటు సమస్యలు తీరలేదు.. అటు విద్యార్థులు రాలేదు కాబట్టి రేషనలైజేషన్ సాకుతో కాలేజీలను మూసేస్తే పోలా..’ అని అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సమస్యల చట్రంలో ఇరుక్కొని పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. రోజురోజుకూ కొత్తకొత్త విధానాలు, హంగులతో ప్రైవేట్ కాలేజీలు దూసుకుపోతుంటే.. సమస్యల గుదిబండలతో ప్రభుత్వ కళాశాలలు వెనుకపడుతున్నాయి. కనీసం ఈ సెలవుల్లోనైనా సమస్యల్ని పరిష్కరించి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికైనా కష్టాలను తప్పిస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు. * జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అలాగే 15 డిగ్రీ కాలేజీలు, మరో 12 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి వసతులు కావాలన్నా సమకూర్చుకోవాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ నిధులు సకాలంలో మంజూరుగాక పనులు జరగడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలను తరచి చూస్తే.. * జిల్లా కేంద్రం కాకినాడలో ఉన్న పీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలలు వందేళ్ల నాటి శిథిల భవనాలకు తప్ప ఇప్పటికీ కొత్త వసతులకు నోచుకోలేదు. బాలాజీచెరువు సెంటర్లోని పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో ఉదయం ఇంటర్మీడియట్, మధ్యాహ్నం ఒకేషనల్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. జగన్నాథపురంలోని అన్నవరం సత్యదేవ కళాశాలలోనూ సౌకర్యాలు అంతంతమాత్రమే. * రాజమహేంద్రవరం అటానమస్ డిగ్రీ కళాశాలలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన పీజీ బ్లాక్ నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం శూన్యం. ఇక జూనియర్ కళాశాలలో దాదాపు 1,600 మంది విద్యార్థులున్నా సరిపడినన్ని తరగతి గదుల్లేవు. మరుగుదొడ్ల సమస్య పరిష్కారం కాలేదు. * రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని మురమండలోని పిచ్చుగ కోటయ్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు లేక రోడ్డు వెంబడి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ధవళేశ్వరం జూనియర్ కళాశాలలో రక్షిత మంచినీటి సౌకర్యం లేదు. సైకిల్‌స్టాండ్ లేక విద్యార్థుల సైకిళ్ళు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. * ఏలేశ్వరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కళాశాలకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో నేటికి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే నిర్వహించాల్సిన పరిస్థితి. * ముమ్మిడివరం ఎంజీఆర్ జూనియర్ కళాశాలను 30 ఏళ్ల క్రితం ఓ ప్రవాసాంధ్రుడు సమకూర్చిన విరాళంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. భవనం పైకప్పు పెచ్చులూడిపోయి వర్షాకాలంలో లీకవుతోంది. కిటీకీలకు అద్దాలు లేవు. * మామిడికుదురులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ భారీ వర్షం పడితే మునిగిపోతోంది. విద్యార్థుల సైకిళ్లకు షెడ్ లేదు. * సామర్లకోటలో 1972లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటును ప్రకటించినా నేటికీ జూనియర్ కళాశాల ఒక్కటే దిక్కు. మరుగుదొడ్లు, సైకిల్ షెడ్ లేవు. శిథిలమైన భవనాల శ్లాబ్ నుంచి పెచ్చులు రాలిపడుతుండటంతో విద్యార్థులకు గాయాలైన సంఘటనలూ ఉన్నాయి. * పిఠాపురం ఆర్ఆర్ బీహెచ్ఆర్ కళాశాలకు నూతన భవనం నిర్మించినా మరుగుదొడ్ల సమస్య తీరలేదు. విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. సైకిల్ స్టాండ్ లేదు. * రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డెరైక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఖాళీ. చివరకు ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టు కూడా ఖాళీగా ఉండడంతో గెస్ట్ లెక్చరర్‌తో పాఠాలు చెప్పిస్తున్నారు. * రాజానగరం నియోజకవర్గం కోరుకొండలోని రాజ బాబు జూనియర్ కళాశాలలో తరగతి గదులు విద్యార్థులకు సరిపోవడంలేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు అదనపు గదులు అందుబాటులోకి వచ్చినా సరిపోవు. ప్రహారీ లేక పశువులు ఆవరణలోకి చొరబడుతున్నాయి. * కొత్తపేటలోని విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తగినన్ని తరగతి గదులు లేవు. ఆరేళ్ల క్రితం అదనపు గదుల నిర్మాణం చేపట్టినా నిధులు విడుదల కాక భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. రావులపాలెం డిగ్రీ కళాశాలలో పాత భవనం విష సర్పాలకు నిలయంగా మారింది. ఆలమూరు డిగ్రీ కళాశాలను జూనియర్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు. * ఇంకా రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల, ద్రాక్షారామ పీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, తుని డిగ్రీ కళాశాల, రాజా జూనియర్ కళాశాల, మహిళా జూనియర్ కళాశాల, మండపేట నియోజకవర్గం రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల, అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాల, కరప మండలం వేళంగిలో మెర్లాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, జగ్గంపేట జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, గోకవరం జూనియర్ కళాశాల, రంగంపేట జూనియర్ కళాశాలలను పలు సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. సెలవుల అనంతరం తిరిగి తెరిచే నాటికైనా వాటిని పరిష్కరించి, తాము నిశ్చింతగా చదువుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
వృత్తి విద్యా కోర్సులకు ఏదీ గుర్తింపు!?
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే వృత్తి విద్యా కోర్సులకు సంబంధిత అధీకృత యూనివర్సిటీల నుంచి గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ కళాశాలలు కూడా గుర్తింపు లేకుండా కొన్ని కోర్సులను నిర్వహిస్తున్నారు. కోర్సులు నిర్వహిస్తున్నది ప్రభుత్వ కళాశాలలే కావడం వల్ల విద్యార్థులకు కూడా ఎటువంటి అనుమానాలు రావడం లేదు. వాస్తవానికి గుర్తింపు తీసుకు వచ్చేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఎచ్చెర్ల: వృత్తి విద్యా కోర్సులు నిర్వహించాలంటే సంబంధిత అధీకృత సంస్థల గుర్తింపు అవసరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ గుర్తింపులు ప్రస్తుతం కొన్ని కోర్సులకు సమస్యలుగా మారుతున్నాయి. కోర్సుల నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. అధీకృత సంస్థలు నిబంధనల ప్రకారం గుర్తింపు రావాలంటే ఆ మేరకు వసతులు, బోధకులు, ల్యాబ్స్, లైబ్రరీలు అవసరం. అప్పుడే కోర్సులు బలోపేతం అవుతాయి. మరో పక్క అధీకృత సంస్థల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎల్ఎల్బీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేదు. అయితే ప్రభుత్వ సంస్థ కావడంలో కోర్సును కొనసాగిస్తున్నారు. వర్సిటీ ఏర్పడిన తరువాత బీసీఐ బృందం వచ్చినా ఇక్కడ అమలు చేస్తున్న నిబంధనలు నేపథ్యంలో గుర్తింపు ఇవ్వలేదు. 60 సీట్లు ఉన్న ఈ కోర్సు బలోపేతం చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టవ లసి ఉంది. ఎల్ఎల్బీ కోర్సును పక్కాగా నిర్వహిస్తేనే బీసీఐ గుర్తింపు ఇస్తుంది. ప్రత్యేక కళాశాల, తరగతి గదులు, మూట్ కోర్టు, గ్రంథాలయం, అర్హతగల బోధకులు ప్రిన్సిపాల్ ఇలా అనేక వసతులు ఉండాలి. వర్సిటీ ఏర్పడక ముందు నుంచి ఏయూ పీజీ సెంటర్‌గా ఉన్నప్పటి నుంచే బీసీఐ గుర్తింపు లేదు. ప్రస్తుతం ఈ గుర్తింపు కోసం వర్సిటీ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీఐ బృందం త్వరలో వర్సిటీకి రానుంది. ఈ సారి గుర్తింపు వస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే... ఎంఎడ్: ఎంఎడ్ కోర్సుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ గుర్తింపు ఇవ్వాలి. ఈ కోర్సుకు గుర్తింపు ఉంది. పక్కాగా భవనాలు, బోధకులు, ప్రత్యేక గ్రంథాలయం ఉంది. బృందం సభ్యులు వచ్చినపుడు కామన్ లైబ్రరీ, ల్యాబ్స్ చూపిస్తున్నారు తప్ప, ఎన్సీటీఈ సంస్థ నిబంధనల మేరకు కోర్సు నిర్వహణకు డిజైన్ మాత్రం చేయడం లేదు. బీఎడ్ (మెంటల్లీ రిటార్డెడ్): ఈ కోర్సుకు గత ఏడాది మౌలిక వసతుల కొరత, అర్హులైన బోధకులు లేకపోవడం వల్ల రీహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్మిషన్లు రద్దు చేసింది. 2009లో ప్రారంభమైన కోర్సును 2015లో నిర్వహించలేదు. ఇటీవల మళ్లీ ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త భవనాలతో పాటు కొత్తగా అవసరమైన మానసిక శాస్త్రవేత్తలతో పాటు ఇతర పోస్టులను అవసరం మేరకు నియమించారు. గతంలో ఈ కోర్సును ముగ్గురు బోధకులతో నెట్టుకువచ్చేవారు. కోర్సు రద్దయిన నేపథ్యంలో బోధకునిగా కొన సాగుతున్న విశ్రాంత ఉద్యోగి డాక్టర్ యండ్ల రవికుమార్‌ను తొలగించారు. మరో ఇద్దరు సూ ర్యకళ, లలిత కుమారిలను మాత్రం కొనసాగించారు. ప్రస్తుతం ఈ కమిటీ సభ్యులు అనుమతి ఇస్తేనే ఈ ఏడాది రెండేళ్ల కోర్సు మళ్లీ పునర్‌ప్రారంభం అవుతుంది. మరో పక్క బీసీఐ, ఆర్సీఐ రెండూ ఢిల్లీకి చెందిన సంస్థలు కావడంతో పక్కాగా నిబంధనలు పరిశీలిస్తున్నారు. దక్షణాది సంస్థలు మాత్రం ప్రభుత్వ యూనివర్సిటీలు కావడంతో అంతగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుతం గుర్తుంపులకు ప్రధాన సమస్య రెగ్యులర్ బోధకులు లేక పోవడంగా నిష్ణాతులు చెబుతున్నారు. అర్హులైన బోధకులు కావాలంటే రెగ్యులర్ నియామకాలు కీలకం అన్నది చాలా మంది అభిప్రాయం. ఎల్ఎల్బీ కోర్సు గుర్తింపునకు కృషి ప్రస్తుతం ఎల్ఎల్బీ కోర్సుకు గుర్తింపు కోసం కృషిచేస్తున్నాం. బీసీఐ నిబంధనల మేరకు మౌలిక వసతు లు సమకూర్చడం, బోధకుల నియామకాన్ని అధికారులు చేపట్టారు. ప్రభుత్వ యూనివర్సిటీ కావడం వల్ల చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉండదు. త్వర లో బీసీఐ బృందం పర్యవేక్షణ చేయనుంది. - డాక్టర్ కె.కృష్ణమూర్తి, సమన్వయకర్త, ఎల్ఎల్బీ కోర్సుల బలోపేతానికి గుర్తింపు అవసరం వర్సిటీలో నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధిత అధీకృత సంస్థల నుంచి రావలసిన గుర్తింపుల కోసం కృషిచేస్తున్నాం. కోర్సులు బలోపేతం కావాలంటే గుర్తింపులు అవసరం. ప్రస్తుతం పక్కా భవనాలు నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో వసతి కొరత ఉండదు. మరో పక్క రెగ్యులర్ బోధకుల నియామకం జరిగితే శాశ్వితంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. - ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్, రిజిస్ట్రార్ కోర్సు : గుర్తింపు ఇవ్వవలసిన సంస్థ ఎల్ఎల్బీ : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంఎడ్ : నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ బీఎడ్ : రీహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (మెంటల్లీ రిటార్డెడ్) -
కడుపు నిండా తిను.. బాగా చదువుకో!
రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మధ్యాహ్న భోజనాన్ని డిగ్రీ విద్యార్థులకూ అందుబాటులోకి తెచ్చింది రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం. శనివారం జిల్లావ్యాప్తంగా కూకట్పల్లి, మల్కాజిగిరి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, తాండూరు, వికారాబాద్‌లోని డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులే సర్కారు కాలేజీల్లో చదువుతున్నారని భావించిన కలెక్టర్ రఘునందన్‌రావు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఒక పూట భోజనం పెట్టడం ద్వారా చదువుపై శ్రద్ధ పెరిగి, ఉత్తీర్ణతాశాతం పెరుగుతుందని అంచనా వేశారు. మధ్యాహ్నం వంట కోసం నిధులు కేటాయించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 1200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది. -
'కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం'
నంగునూరు (మెదక్) : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ కళాశాలల్లోనూ సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం మెదక్ జిల్లా నంగునూరు మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే ప్రభుత్వ కళాశాలల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామన్నారు. -
ప్రభుత్వ కాలేజీలే బెటర్..!
► ప్రైవేటుతో పోటీగా 69 శాతం ఉత్తీర్ణత మెరిట్ విద్యార్థులతో ► ప్రైవేటులో ఫలితాలు అంతంతే! ► సౌకర్యాలు కల్పిస్తే మరింత సత్తా చాటే అవకాశం సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో ప్రభుత్వ కాలేజీలు మెరిశాయి. ప్రైవేటు కాలేజీలతో పోటీపడి మరీ మంచి ఫలితాలు సాధించాయి. ప్రైవేటు కాలేజీలతో తామేమీ తీసిపోమని... జిల్లా సగటు ఫలితాలతో సమానంగా 69 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. పదో తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులను చేర్చుకుని కూడా ప్రైవేటు కాలేజీలు ఇంటర్మీడియట్లో అంతంత మాత్రమే ఫలితాలు సాధించాయి. మరోవైపు పదో తరగతిలో ప్రైవేటు విద్యార్థులతో పోలిస్తే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకుని కూడా ప్రైవేటుతో పోటీగా ఫలితాలు సాధించి...ప్రభుత్వ మార్క్ చెక్కు చెదరలేదని నిరూపించాయి. అయితే, ప్రభుత్వ కాలేజీలను వేధిస్తున్న అధ్యాపకుల కొరత, అదనపు తరగతుల నిర్మాణం, మౌలిక సదుపాయాల లేమి వంటి సమస్యలను ప్రభుత్వం తీరిస్తే మరింత మంచి ఫలితాలు సాధించగలమని ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్స్, లెక్చరర్లు పేర్కొంటున్నారు. ఫెయిలైన ‘ప్రైవేటు’ విద్యార్థులు 6,642 జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 30,270 మంది విద్యార్థులు హాజరవ్వగా...20,999 మంది పాసయ్యారు. జిల్లా సగటు ఉత్తీర్ణత శాతం 69 శాతం. ప్రైవేటు కాలేజీల్లో జిల్లాలో 22,413 మంది పరీక్షకు హాజరుకాగా 15,771 మంది విద్యార్థులు పాసయ్యారు. అంటే, మిగిలిన 6,642 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మరోవైపు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలల్లో 6,317 మంది సెకండియర్ ఇంటర్ పరీక్షకు హాజరుకాగా, 4,345 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కాలేజీల్లో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య కేవలం 1,972 మంది మాత్రమే. అం టే ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం కూడా జిల్లా సగటుతో సమానంగా 69 శాతం కావడం గమనార్హం. ఇక ఎయిడెడ్ కాలేజీల విషయానికి వస్తే జిల్లావ్యాప్తంగా 1540 మంది పరీక్షకు హాజ రుకాగా... 880 మంది ఉత్తీర్ణులయ్యా రు. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలను కలిపినా....2,632 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో ప్రతీ ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. -
బాలికలదే పైచేయి..
సీనియర్ ఇంటర్లో 54 శాతం ఉత్తీర్ణత.. రాష్ర్టంలో 8వ స్థానం -సర్కార్ కళాశాలల ఫలితాల్లో జిల్లా టాప్ - జిల్లా విద్యార్థినికి సీఈసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ - మెరుగుపడిన ఉత్తీర్ణత శాతం ఆదిలాబాద్ టౌన్ : సీనియర్ ఇంటర్మీడియెట్‌లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ఉత్తీర్ణత శాతంలో వారిదే హవా కొనసాగింది. గతంతో పోల్చుకుంటే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతంలో కాస్తంతా మెరుగుపడింది. గతానికంటే ఐదు శాతం పెరిగి.. ఈ ఏడాది జిల్లా 54 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో చివరి స్థానంలో నిలిచిన జిల్లా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరీక్ష ఫలితాల్లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్ధానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలల పరంగా రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలువడం గమనార్హం. ఇదిలా ఉండగా జైనూర్ ప్రభుత్వ కళాశాలలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం.. జనరల్ కోర్సుల్లో మొత్తం 22,251 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 12,093 మంది ఉత్తీర్ణత సాదించారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 10,694 మంది పరీక్షకు హాజరుకాగా 5,121 మంది పాసయ్యారు. 48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా బాలికలు 11,557 మంది పరీక్షకు హాజరుకాగా 6,972 ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్ కోర్సుల్లో మొత్తం 2,756 మంది పరీక్షకు హాజరు కాగా 1483 మంది ఉత్తీర్ణత సాధించారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 1,787 మందికి 894 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 50 శాతం నమోదైంది. బాలికలు 969 మందికి 589 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 61 శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలో వొకేషనల్ ఫలితాల్లో 8వ స్థానంలో నిలిచింది. ఫలితాలను గ్రేడ్, మార్కుల రూపంలో విడుదల చేశారు. 75 శాతం పైగా మార్కులు వచ్చిన వారికి ఏ-గ్రేడ్, 60-75 వరకు బి-గ్రేడ్, 50-60 వరకు సి-గ్రేడ్, 35-50 డి-గ్రేడ్ కేటాయించారు. ప్రభుత్వ కళాశాలల ఫలితాల్లో స్టేట్ ఫస్ట్.. ప్రభుత్వ కళాశాలలు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు దీటుగా మంచి ఉత్తమ సాధించాయి. ప్రభుత్వ కళాశాలల పరంగా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కళాశాలల్లో చదివిన విద్యార్థులు 5,451 మంది పరీక్షకు హాజరుకాగా 4,064 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 2,701 మందికి గాను 1,925 మంది పాసయ్యారు. 71.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,750 మంది పరీక్షకు హాజరుకాగా 2,139 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 77.78 శాతం నమోదైంది. వొకేషనల్ ఫలితాల్లో మొత్తం 643 మంది పరీక్షకు హాజరుకాగా 546 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 85గా నమోదైంది. బాలురు 490 మంది పరీక్షకు హాజరుకాగా 407 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 83.06 శాతం నమోదైంది. బాలికలు 153 మంది పరీక్షకు హాజరుకాగా 139 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.85 శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 4వ స్థానంలో నిలిచింది వందశాతం ఉత్తీర్ణత.. ప్రభుత్వ జూనియర్ కళాశాల జైనూర్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 93 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 93 మంది ఉత్తీర్ణత సాధించారు. నార్నూర్ జూనియర్ కళాశాలలో 98.73 ఉత్తీర్ణత సాధించారు. ఈ కళాశాలలో 79 మంది పరీక్ష రాయగా 78 మంది ఉత్తీర్ణులయ్యారు. సారంగాపూర్, జైపూర్ కళాశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 10 ప్రభుత్వ కళాశాలల్లో 90 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా సర్కార్ కళాశాలల్లో పలితాలు రావడంపై అయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేశారు. మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్ఐవో ప్రభాకర్ తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫీజు మే 6లోగా చెల్లించాలన్నారు. మే 1 నుంచి మార్కుల మెమోలను అందజేస్తామని తెలిపారు. రీకౌంటింగ్ కోసం రూ.100, జిరాక్స్ కాపీ కోసం రూ.600 డీడీ తీయాలని ఆయన సూచించారు. సత్తాచాటిన విద్యార్థులు ఆదిలాబాద్ టౌన్ : ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఉత్తమ మార్కులు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు. రాష్ట్రస్థాయిలో సీఈసీ గ్రూప్‌లో జిల్లా విద్యార్థిని పులి రాణి 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఎంపీసీలో నిర్మల్‌లోని దీక్ష కళాశాలకు చెందిన వినీత్‌కుమార్ 978 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. బైపీసీలో కె.నవత 958, సీఈసీలో ప్రశాంత్ 917 మార్కులు సాధించారు. ఎస్ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థిని సంకీర్తన ఎంపీసీలో 973, వి.రాణి బైపీసీలో 962 మార్కులు సాధించారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రీసెంట్ కళాశాలకు చెందిన సబా ఖానమ్ ఎంపీసీలో 966, గుల్నాజ్ 936, తన్వీర్ అహ్మద్ ఖాన్ 923 మార్కులు సాధించారు. బైపీసీలో ముషరఫ్ అర్జుమాండ్ 976, షాహిస్తా నజ్రీన్ 933, సానియా ఫాతిమ 971 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని విద్యార్థి కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపీసీలో హరితగౌడ్ 939, కె.అంకిత 938, ృసష్టి 929, బైపీసీలో మల్లికార్జున్ 897, సీఈసీలో ప్రాచి 910 మార్కులు సాధించారు. నలంద కళాశాల విద్యార్థులు ఎంపీసీలో హీన అగర్వాల్ 975, శ్వేత జెన్కర్ 970, జ్యోతి అమ్మాని 965, బైపీసీలో గేడం గోవర్ధన్ 926, సౌమ్య 918, సీఈసీలో సాయిరాం 910, ఎంఈసీలో అహుజ స్నేహ సుభాష్లాల్ 875 మార్కులు సాధించారు. పట్టణంలోని ఆదిత్య కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపీసీలో సౌమ్య యాదవ్ 948, బైపీసీలో షాహిద్ అన్సారీ 918 మార్కులు సాధించారు.