ప్రభుత్వ టీచర్ల పిల్లలు.. ప్రభుత్వ బడిలోకే రావాలి..
పాఠాలు చెప్పేది సర్కారు బడిలో.. పిల్లల్ని పంపేది ప్రైవేటు స్కూళ్లకా?
ఇదెక్కడి న్యాయం?: హోంమంత్రి నాయిని
- మంత్రి వ్యాఖ్యలపై టీచర్ల నిరసన.. ముందు నేతల పిల్లల్ని పంపాలని ఫైర్
- గందరగోళంగా గురుపూజోత్సవం.. నాయిని క్షమాపణతో శాంతించిన టీచర్లు
సాక్షి, హైదరాబాద్: ‘‘నిరుపేదల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుంటే.. ఆ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం వారి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను భ్రస్టుపట్టిస్తూ పరోక్షంగా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటుకు కొమ్ముకాస్తున్నారు. విచ్చలవిడిగా సెలవులు వాడుకుంటూ ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు కారణమవుతున్నారు. ఈ దుస్థితి పోవాలి. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి.
అప్పుడే ప్రభుత్వ విద్యాలయాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తాయి..’’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాస్థాయిలో ఎంపికైన 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీచర్లు తమ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. చాలామంది టీచర్లు, డాక్టర్లు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటు స్కూళ్లు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారని, ఇలాంటి వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ప్రభుత్వ టీచర్లు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవ హరిస్తే సమాజం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు.
మనలో సర్వేపల్లిలాంటి వారెందరు?
సర్వేపల్లి రాధాకృష్ణలాంటి ఉపాధ్యాయులు మనలో ఎందరు ఉన్నారని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదని హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 80 శాతానికిపైగా ఉండేదని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం సగానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల హాజరు శాతమే కాదు చివరకు టీచర్ల హాజరు శాతాన్ని చూసి నోరెళ్లబెట్టాల్సి వస్తోందన్నారు. మనకు మనమే విద్యా వ్యవస్థను నాశనం చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు.. వారిలోని సృజనాత్మకతను గుర్తించి వెలికి తీసినప్పుడే గురువులపై గౌరవం పెరుగుతుందని, తాను ఇప్పుడు కలెక్టర్‌గా ఉన్నానంటే కారణం గురువులేనని చెప్పారు. ఉపాధ్యాయులకు యోగ్యత ఎంతో అవసరమని, అది లేకుంటే వృత్తికి న్యాయం చేయలేరని అన్నారు.
ముందు మీరు చేర్పించండి..: టీచర్లు
నాయిని వ్యాఖ్యలపై కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించి, ఆ తర్వాత టీచర్లకు సూచించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కావడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా తమకు నీతులు చెప్పడమేంటని హోంమంత్రిని ప్రశ్నించారు. దీంతో గురుపూజోత్సవ కార్యక్రమం కొంత గందరగోళంగా మారింది. చివరకు హోంమంత్రి క్షమాపణలు కోరడంతో టీచర్లు శాంతించారు.