Home Minister Naini
-
ప్రభుత్వ టీచర్ల పిల్లలు.. ప్రభుత్వ బడిలోకే రావాలి..
పాఠాలు చెప్పేది సర్కారు బడిలో.. పిల్లల్ని పంపేది ప్రైవేటు స్కూళ్లకా? ఇదెక్కడి న్యాయం?: హోంమంత్రి నాయిని - మంత్రి వ్యాఖ్యలపై టీచర్ల నిరసన.. ముందు నేతల పిల్లల్ని పంపాలని ఫైర్ - గందరగోళంగా గురుపూజోత్సవం.. నాయిని క్షమాపణతో శాంతించిన టీచర్లు సాక్షి, హైదరాబాద్: ‘‘నిరుపేదల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుంటే.. ఆ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం వారి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను భ్రస్టుపట్టిస్తూ పరోక్షంగా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటుకు కొమ్ముకాస్తున్నారు. విచ్చలవిడిగా సెలవులు వాడుకుంటూ ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు కారణమవుతున్నారు. ఈ దుస్థితి పోవాలి. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి. అప్పుడే ప్రభుత్వ విద్యాలయాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తాయి..’’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాస్థాయిలో ఎంపికైన 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీచర్లు తమ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. చాలామంది టీచర్లు, డాక్టర్లు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటు స్కూళ్లు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారని, ఇలాంటి వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ప్రభుత్వ టీచర్లు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవ హరిస్తే సమాజం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. మనలో సర్వేపల్లిలాంటి వారెందరు? సర్వేపల్లి రాధాకృష్ణలాంటి ఉపాధ్యాయులు మనలో ఎందరు ఉన్నారని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదని హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 80 శాతానికిపైగా ఉండేదని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం సగానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల హాజరు శాతమే కాదు చివరకు టీచర్ల హాజరు శాతాన్ని చూసి నోరెళ్లబెట్టాల్సి వస్తోందన్నారు. మనకు మనమే విద్యా వ్యవస్థను నాశనం చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు.. వారిలోని సృజనాత్మకతను గుర్తించి వెలికి తీసినప్పుడే గురువులపై గౌరవం పెరుగుతుందని, తాను ఇప్పుడు కలెక్టర్‌గా ఉన్నానంటే కారణం గురువులేనని చెప్పారు. ఉపాధ్యాయులకు యోగ్యత ఎంతో అవసరమని, అది లేకుంటే వృత్తికి న్యాయం చేయలేరని అన్నారు. ముందు మీరు చేర్పించండి..: టీచర్లు నాయిని వ్యాఖ్యలపై కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించి, ఆ తర్వాత టీచర్లకు సూచించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కావడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా తమకు నీతులు చెప్పడమేంటని హోంమంత్రిని ప్రశ్నించారు. దీంతో గురుపూజోత్సవ కార్యక్రమం కొంత గందరగోళంగా మారింది. చివరకు హోంమంత్రి క్షమాపణలు కోరడంతో టీచర్లు శాంతించారు. -
అనుక్షణం.. అప్రమత్తం..
ఏరియల్ సర్వే చేస్తున్న హోంమంత్రి నాయిని, సీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీజీపీ అనురాగ్ శర్మ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీజీపీ పర్యవేక్షణ హోంమంత్రి, సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏరియల్ సర్వే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తును డీజీపీ అనురాగ్ శర్మ, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం నుంచి ఖైరతాబాద్ గణేశ్ శోభా యాత్ర రాత్రి 10 గంటల వరకు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ ద్వారా అనురాగ్ శర్మ, అదనపు డీజీపీ అంజనీ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్, పీఅండ్ఎల్ ఐజీ సంజయ్‌జైన్, నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, శాంతి భద్రతల ఇన్చార్జి ఐజీ రమేశ్‌రెడ్డితో కలసి సీసీ కెమెరాల్లో వీక్షించారు. అనంతరం ఎల్బీస్టేడియం, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, చార్మినార్ ప్రాంతంలో శోభాయాత్రను పరిశీలించారు. హోంమంత్రి ఏరియల్ సర్వే.. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టులో నాయిని మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడు మధ్యాహ్నంలోపే నిమజ్జనం కావడం హర్షించదగ్గ విషయ మన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందని, నిమజ్జనోత్సవంలో ప్రజల సహకారం మరు వలేనిదని, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అనురాగ్‌శర్మ.. 1992 నుంచి.. భాగ్యనగరంలో నిమజ్జనాలకు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం అంత సులువుకాదు. అయితే డీజీపీ అనురాగ్‌శర్మ 1992 నుంచి నగరంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. సౌత్‌జోన్ డీసీపీగా 1992 జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అప్పటి నుంచి 1995 సెప్టెంబర్ వరకు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించారు. తదనంతరం నగర కమిషనర్‌గా 2012, 2013లో రెండుసార్లు యూనిట్ ఆఫీసర్‌గా గణేశ్ నిమజ్జన బందోబస్తులో పాల్గొన్నారు. ప్రస్తుతం డీజీపీ çహోదాలో నాలుగేళ్లుగా గణేశ్ నిమజ్జన బందోబస్తు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పదిసార్లు వినాయక నిమజ్జనాల్లో స్వయంగా పాల్గొనడం గర్వంగా ఉందని, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని డీజీపీ అనురాగ్‌శర్మ ‘సాక్షి’కి చెప్పారు. వైభవంగా మహాగణపతి నిమజ్జనం సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. సంప్రదా యానికి భిన్నంగా ఈసారి ఉదయం ఏడు గంటలకే శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటలలోపే నిమజ్జన వేడుకలు ముగిశాయి. భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్ నుంచి లక్డీకాఫూల్, టెలిఫోన్‌భవన్, సెక్రటేరియట్ మీదుగా వేలాది మంది భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర సాగింది. ఉదయం 10.25 గంటలకు మహాగణపతి బయలుదేరిన వాహనం ఎన్టీఆర్ రోడ్డులోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు చేరింది. అక్కడ గణనాథుడికి తుది పూజలు నిర్వహించిన అనంతరం వెల్డింగ్ పనులు చేపట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 1.57 గంటలకు భక్తుల జయజయ ధ్వానాల నడుమ నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
⇒ ఎమ్మెల్యే కోటాలో కృష్ణారెడ్డి, ఉళ్లోల్ల, మైనంపల్లి నామినేషన్లు దాఖలు ⇒ వీరి ఎన్నిక ఏకగ్రీవమే ⇒ 10న లాంఛనంగా ప్రకటన సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో టీఆర్ఎస్ పక్షాన నామినేషన్లను దాఖలు చేసిన ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉళ్లోల్ల గంగాధర్‌గౌడ్, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఈ కోటాలో ఖాళీ అయిన మూడు స్థానాలకు గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలయ్యాయి. బుధవారం వీరి నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 10న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక, సాయంత్రం 3 గంటలకు వీరు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించి, సర్టిఫికెట్లను అందజేయడం లాంఛన ప్రాయమే. మంగళవారం శాసనసభ కార్యదర్శి రాజా సదారాంకు కృష్ణారెడ్డి, హనుమంతరావు, గంగాధర్‌గౌడ్ నామినేషన్న్లు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్, పద్మారావుగౌడ్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, మల్లారెడ్డి, చీఫ్ విప్‌లు కొప్పుల ఈశ్వర్, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, పాషాఖాద్రీ, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజ్, రవీంద్రకుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, పలువురు నగర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థులు నివాళులర్పించారు. బురద జల్లడమే విపక్షాల లక్ష్యం: నాయిని కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని హోంమంత్రి నాయిని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడని, మంత్రులపై ఆరోపణలు చేస్తే మీడియాలో వార్తలు వస్తాయని అదే పనిగా అబద్ధాలు చెపుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ లేదని, ఉత్తమ్ ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని, ఆ మాటలు నమ్మి దిగ్విజయ్ తన స్థాయిని దిగజార్చుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉంటే ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఇప్పటికైనా విపక్షాలు బుద్ది తెచ్చుకుని అనవసర విమర్శలు మాని ప్రజలతో ఉంటూ, అభివృద్ధికి సహకరిస్తే మంచిదని హితవు పలికారు. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు, గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు రాబోతుండడంతో మండలిలో టీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందన్నా రు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని ఆదరణ కేసీఆర్‌కు ఉందని, ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చౌరస్తాలో ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమేనని ప్రతిపక్షాలకు నాయిని సవాల్ విసిరారు. -
తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన సవరణలను సభ తిరస్కరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌర సరఫరాల నిర్వహణ, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, రవాణా, హోంశాఖ, వ్యవసాయం, పశు సంవర్ధనం, మత్స్య పరిశ్రమ, సహకార రంగాలకు చెందిన పద్దులకు ఆదివారం ఆమోదం లభించింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా హోం మంత్రి నాయిని మాట్లాడుతూ, హైదరాబాద్‌తో పాటు ముఖ్యపట్టణాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఫ్లైఓవర్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పోలీసుల వారంతపు సెలవును త్వరలో అమలు చేస్తామన్నారు. భూసార పరీక్షలకు ప్రత్యేక వాహనం: పోచారం భూసార పరీక్షలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక వాహనం సమకూర్చనున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే పశువైద్యం కోసం కూడా 108 తరహాలో వాహనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
ఎన్ని‘కల’..పెళ్లికొడుకు!
నిన్న మొన్నటి వరకు నేనే అభ్యర్థిని అనుకున్నాడు... ఆరు నెలల క్రితం నుంచే బరిలో నిలిచి గెలిచేందుకు స్కెచ్చేశాడు. అన్నీ బాగున్నాయి..అధిష్టానం ఆశీస్సులూ ఉన్నాయి.. నాకు తిరుగు లేదనుకున్నాడు. శుక్రవారం సాయంత్రానికి సీను మారింది. రిజర్వేషన్ల ప్రకటనతో ఆ యువ నేతకు అంతులేని ఆశాభంగమైంది. తాను ఆశించిన స్థానం మహిళకు రిజర్వు చేయడంతో ఖంగుతిన్నాడు. ఒక రోజు గడిచింది... ఆలోచన మారింది. ఆశలు మళ్లీ చిగురించాయి. అర్జంట్‌గా పెళ్లి చేసుకుని.. తన భార్యనే పోటీలో దింపితే ఎలా ఉంటుందని ఆలోచన చేశాడు. ఎన్నికల ‘పెళ్లి’కి సిద్ధమవుతున్నాడు... ఇదీ కవాడిగూడ డివిజన్ (వార్డు నెం.90) నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకున్న టీఆర్ఎస్ నేత కల్వ గోపి కథ. గతంలో ఈ స్థానం ఎస్సీ జనరల్‌కు ఉంది. ఈసారి కూడా అదే ఉంటుందనుకున్నాడు. మరోవైపు హోం మంత్రి నాయిని కూడా నీకే టికెట్ అంటూ భరోసానిచ్చారు. కానీ రిజర్వేషన్లు గోపి కలను కల్లలు చేశాయి. ఇక పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదనుకుని ఆయన..ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్లు ఇక్కడ జోరుగా విన్పిస్తోంది. సీటిస్తానని మాటిస్తే వెంటనే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమని ఆయన టీఆర్ఎస్ అగ్రనేతలకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద సీటు మీద ఆశ..పెళ్లికి దారి తీస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. - కవాడిగూడ -
రూ.5కే భోజన పథకం ప్రారంభం
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో నాలుగు చోట్ల బుధవారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.5కే భోజనం పథకం ప్రారంభమైంది. హోం మంత్రి నాయిని ముఖ్యఅతిథిగా వచ్చి పథకాన్ని ప్రారంభించారు. రామంతాపూర్, కుషాయిగూడ, చిలుకానగర్, హౌసింగ్‌బోర్డు కాలనీల్లో పథకాన్ని ప్రారంభించిన అనంతరం హోంమంత్రి నాయిని స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత అక్కడే భోజనం కూడా చేశారు. కార్యక్రమంలో గ్రేటర్ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. - ఉప్పల్ -
టీఆర్ఎస్లో చేరిన సినీ హీరో
అగ్రగామిగా తెలంగాణ - హోంమంత్రి నాయిని బంజారాహిల్స్: భారతదేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని, చిత్ర పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతం ఇదేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఫిలించాంబర్ వద్ద జరిగిన కార్యక్రమంలో సినీ హీరో ఆకాష్ టీఆర్ఎస్లో చేరారు. హోం మంత్రి ఆయనకు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం నాయిని మాట్లాడుతూ అమెరికా తరహాలో హైదరాబాద్‌లో సినిమా నిర్మాణానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని సూచించారు. సినిమా పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. నిర్మాతలందరినీ ఒక్కచోట చేర్చి సినిమా టౌన్షిప్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకునే విధంగా వనరులున్నాయని చెప్పారు. చంద్రబాబు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా తమ వాళ్లేనని సీఎం ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సినీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు పి.రామకృష్ణగౌడ్‌కు పార్టీ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజక వర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.