టీఆర్‌ఎస్‌లో చేరిన సినీ హీరో
అగ్రగామిగా తెలంగాణ - హోంమంత్రి నాయిని
బంజారాహిల్స్: భారతదేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని, చిత్ర పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతం ఇదేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఫిలించాంబర్ వద్ద జరిగిన కార్యక్రమంలో సినీ హీరో ఆకాష్ టీఆర్‌ఎస్‌లో చేరారు. హోం మంత్రి ఆయనకు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం నాయిని మాట్లాడుతూ అమెరికా తరహాలో హైదరాబాద్‌లో సినిమా నిర్మాణానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని సూచించారు. సినిమా పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.
నిర్మాతలందరినీ ఒక్కచోట చేర్చి సినిమా టౌన్‌షిప్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకునే విధంగా వనరులున్నాయని చెప్పారు. చంద్రబాబు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా తమ వాళ్లేనని సీఎం ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సినీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు పి.రామకృష్ణగౌడ్‌కు పార్టీ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజక వర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.