అనుక్షణం.. అప్రమత్తం.. | Home Minister, CP, GHMC Commissioner Ariel Survey on Ganesh immersion | Sakshi
Sakshi News home page

అనుక్షణం.. అప్రమత్తం..

Published Wed, Sep 6 2017 4:14 AM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

అనుక్షణం.. అప్రమత్తం..

అనుక్షణం.. అప్రమత్తం..

  • ఏరియల్‌ సర్వే చేస్తున్న హోంమంత్రి నాయిని, సీపీ
  • కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీజీపీ అనురాగ్‌ శర్మ
  • కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి డీజీపీ పర్యవేక్షణ
  • హోంమంత్రి, సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఏరియల్‌ సర్వే
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తును డీజీపీ అనురాగ్‌ శర్మ, నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం నుంచి ఖైరతాబాద్‌ గణేశ్‌ శోభా యాత్ర రాత్రి 10 గంటల వరకు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా అనురాగ్‌ శర్మ, అదనపు డీజీపీ అంజనీ కుమార్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్, పీఅండ్‌ఎల్‌ ఐజీ సంజయ్‌జైన్, నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి, శాంతి భద్రతల ఇన్‌చార్జి ఐజీ రమేశ్‌రెడ్డితో కలసి సీసీ కెమెరాల్లో వీక్షించారు. అనంతరం ఎల్బీస్టేడియం, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, చార్మినార్‌ ప్రాంతంలో శోభాయాత్రను పరిశీలించారు.
     
    హోంమంత్రి ఏరియల్‌ సర్వే..
    సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్‌ రెడ్డి, అదనపు డీజీపీ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రను ఏరియల్‌ సర్వే ద్వారా పర్యవేక్షించారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టులో నాయిని మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ వినాయకుడు మధ్యాహ్నంలోపే నిమజ్జనం కావడం హర్షించదగ్గ విషయ మన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందని, నిమజ్జనోత్సవంలో ప్రజల సహకారం మరు వలేనిదని, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
     
    అనురాగ్‌శర్మ.. 1992 నుంచి..
    భాగ్యనగరంలో నిమజ్జనాలకు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం అంత సులువుకాదు. అయితే డీజీపీ అనురాగ్‌శర్మ 1992 నుంచి నగరంలో గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. సౌత్‌జోన్‌ డీసీపీగా 1992 జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అప్పటి నుంచి 1995 సెప్టెంబర్‌ వరకు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించారు. తదనంతరం నగర కమిషనర్‌గా 2012, 2013లో రెండుసార్లు యూనిట్‌ ఆఫీసర్‌గా గణేశ్‌ నిమజ్జన బందోబస్తులో పాల్గొన్నారు. ప్రస్తుతం డీజీపీ çహోదాలో నాలుగేళ్లుగా గణేశ్‌ నిమజ్జన బందోబస్తు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పదిసార్లు వినాయక నిమజ్జనాల్లో స్వయంగా పాల్గొనడం గర్వంగా ఉందని, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని డీజీపీ అనురాగ్‌శర్మ ‘సాక్షి’కి చెప్పారు. 
     
    వైభవంగా మహాగణపతి నిమజ్జనం
    సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. సంప్రదా యానికి భిన్నంగా ఈసారి ఉదయం ఏడు గంటలకే శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటలలోపే నిమజ్జన వేడుకలు ముగిశాయి. భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్‌ నుంచి లక్డీకాఫూల్, టెలిఫోన్‌భవన్, సెక్రటేరియట్‌ మీదుగా వేలాది మంది భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర సాగింది. ఉదయం 10.25 గంటలకు మహాగణపతి బయలుదేరిన వాహనం ఎన్టీఆర్‌ రోడ్డులోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్దకు చేరింది. అక్కడ గణనాథుడికి తుది పూజలు నిర్వహించిన అనంతరం వెల్డింగ్‌ పనులు చేపట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 1.57 గంటలకు భక్తుల జయజయ ధ్వానాల నడుమ నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement