మళ్లీ మనమే టాప్ | Again we are topper in inter 1st year | Sakshi
Sakshi News home page

మళ్లీ మనమే టాప్

Published Fri, Apr 24 2015 4:08 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

మళ్లీ మనమే టాప్

మళ్లీ మనమే టాప్

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల

బాలికలదే హవా
వరుసగా 11 సార్లు మొదటిస్థానం
జిల్లాలో 76 శాతం ఉత్తీర్ణత

 
లబ్బీపేట : జూనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు తమ హవా కొనసాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పదేళ్లు అగ్రస్థానంలో ఉన్న జిల్లా విద్యార్థులు.. నవ్యాంధ్రలోను మొదటి స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియెట్‌లో జిల్లాకు ఎదురులేదని నిరూపించారు.  విజయవాడ విద్యలవాడగా తన పేరు నిలబెట్టుకుంటూ విజయపరంపర కొనసాగి స్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంట ర్మీడియెట్ మొదటి సంవత్సర ఫలితాలను తొలిసారిగా  నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.

ఈ ఫలితాల్లో నూతన ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తన అగ్రస్థానాన్ని ఈసారి కూడా నిలబెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 62.98 శాతం ఉండగా దాదాపు 13 శాతం ఎక్కువగా అంటే 76 శాతం ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఇది గత ఏడాది కంటే రెండు శాతం అధికం కావడం విశేషం. గత సంవత్సరం జిల్లా విద్యార్థులు 74 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఈ సంవత్సరం 63,164 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 47,989 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో  33,702 మంది బాలురు పరీక్షలు రాయగా 25,039 మంది ఉత్తీర్ణత సాధించారు.

వీరి ఉత్తీర్ణత 74 శాతంగా ఉంది. బాలికలు 29,462 మంది పరీక్షలు రాయగా 22,950 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత 78 శాతంగా ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం గత ఏడాది 75 శాతం ఉండగా, ఈ ఏడాది 78 శాతానికి పెరగడం విశేషం. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు రాసిన 1,126 మందిలో 544 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత 48 శాతంగా ఉంది. కాగా గత ఏడాది ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత 55 శాతం ఉండగా, ఈ ఏడాది ఏడు శాతం తగ్గింది.  

జిల్లాలో టాపర్లు వీరే
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు.  ఎంపీసీ, బైపీసీ టాప్ ర్యాంకులు జిల్లాకు రాకపోయినప్పటికీ ద్వితీయ స్థానంలో ఎక్కువ మంది నిలిచారు. వారిలో ఎంపీసీలో  ఎం.శర్వాణి 466/470 సాధించి జిల్లాలో టాపర్‌గా నిలవగా, చీమకుర్తి సాయి వరుణ్, వెనిగళ్ల మౌనిక, గుంటూరు సౌమ్య, మద్దాల నాగసాయి శ్రీ హరీష్‌లు 464/470 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 

బైపీసీలో మహ్మద్ అర్బాజ్, మర్రెడ్డి మేఘనారెడ్డి, కోడూరు సాయి యామిని, పెద్దిరెడ్డి గ్రీష్మబిందు, కూసమ్ వెంకట రాహుల్‌రెడ్డి, సయ్యద్ ఆయేషా, పి.లక్ష్మీ పూజిత, కొట్టా గాయత్రి సాయి గీతాంజలి  436 మార్కులతో జిల్లాలో టాపర్‌లుగా నిలిచారు. అదే విధంగా పి.చాంద్‌బాషా, బొడ్డపాటి దేవనందినిలు 435 మార్కులు సాధించగా, ఆచంట శ్రీలాస్య, శ్రీ తేజకృష్ణలు 434 మార్కులు సాధించారు.

కాగా  శ్రీ చైతన్య విద్యార్థులు ఎంపీసీలో ఒకరు 466 మార్కులు సాధించగా, 11 మంది 465 మార్కులు, 45 మంది 464 మార్కులు, 530 మంది 460 మార్కులు సాధించారు.  బైపీసీలో 436 మార్కులు ఇద్దరు సాధించగా, 435 మార్కులు 12 మంది, 434 మార్కులు 44 మంది, 428 మార్కులు 428 మంది సాధించి సత్తా చాటారు. కాగా గడిచిన ఐదేళ్లలో జిల్లాలో అత్యధికంగా 76 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు.
 
ప్రభుత్వ కాలేజీల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైతం ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది 37.8 శాతం ఉండగా,  ఈ ఏడాది 45 శాతం ఉత్తీర్ణులయ్యారు. అయితే 2013లో జిల్లాలో ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత శాతం 46.1గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement