►ఫెయిలైన విద్యార్థులకు మొక్కుబడి తరగతులు
►మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
►90 శాతం కాలేజీల్లో ప్రారంభం కాని శిక్షణ
►25 నుంచి ఇన్‌స్టంట్ పరీక్షలు
3,814 మొదటి సంవత్సరం ఫెయిలైన విద్యార్థులు
1,972 ద్వితీయ సంవత్సరం ఫెయిలైన విద్యార్థులు
ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు కల్పిస్తాం.
- గత నెల 28న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటన
వాస్తవ పరిస్థితి
ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లకు ఇంటర్‌మీడియట్ బోర్డు అధికారులు మౌఖికంగా ఆదేశించినా.. లిఖితపూర్వక ఉత్తర్వులు లేకపోవడంతో జిల్లాలోని 90 శాతం కళాశాలల్లో ప్రత్యేక తరగతులు ఊసే కరువైంది. ఈనెల 25 నుంచి ఇన్‌స్టంట్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా మంత్రి చేసిన ప్రకటన ఎందుకూ కొరగాకుండా పోయింది.
కర్నూలు(జిల్లా పరిషత్) : సాక్షాత్తూ మంత్రి ప్రకటనకే విలువ లేకుండాపోయింది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివి ఫెయిలైన విద్యార్థులకు కనీసం మూడు వారాల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. నోటి మాటే తప్పితే లిఖిత పూర్వక ఆదేశాలు లేకపోవడంతో.. ఇంటర్‌మీడియట్ బోర్డు కమిషనరేట్ కూడా మౌఖిక ఆదేశాలతో సరిపెట్టింది. వేసవి సెలవుల్లో రెగ్యులర్ లెక్చరర్లు గైర్హాజరవుతారని.. కాంట్రాక్టు లెక్చరర్లు తప్పనిసరిగా తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో రెన్యూవల్ చేయబోమని సైతం స్పష్టం చేశారు.
ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొన్ని కళాశాలల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తుండగా.. తక్కిన కళాశాలలు ఆ ఆదేశాన్ని పెడచెవిన పెట్టాయి. మరో ఐదు రోజుల్లో ఇన్‌స్టంట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి హామీ చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం 35,602 మందికి గాను 20,661 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా 7,309 మంది విద్యార్థుల్లో 3,495 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 30,270 మందికి గాను 20,999 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 41 ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి 6,317 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,345 మంది పాసయ్యారు. ఇదిలాఉంటే వేసవి సెలవుల్లో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు వారి కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినా.. బస్సు పాసులు చెల్లవని ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో సొంత ఖర్చులతో కళాశాలలకు చేరుకునేందుకు విద్యార్థులు ముందుకు రాలేకపోయారు. మొత్తంగా మంత్రి ప్రకటన అభాసుపాలైంది.
మంత్రి మాట ఫెయిల్
Published Wed, May 20 2015 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement