Minister ganta srinivasa Rao
-
ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయుల బదిలీలు, ఆదర్శ పాఠశాలలపై ఉత్కంఠ నెలకొంది. తొలుత బుధవారం టీచర్ల బదిలీలు, మోడల్ స్కూళ్ల హేతుబద్ధీకరణపై స్పష్టత వస్తుందని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యాశాఖాధికారులు రోజంతా ఎదురు చూశారు. కానీ రాత్రి వరకూ ప్రభుత్వం దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో గురువారం ఏదో ఒక నిర్ణయం వెలువడవచ్చన్న అభిప్రాయానికొచ్చారు. జిల్లాలో 3,321 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఏజెన్సీ ప్రాంతంతో పాటు వాగులు, వంకలు, గెడ్డలు, రైల్వే ట్రాకులకు దగ్గరగా ఉన్న స్కూళకు, మైనార్టీ, ఎయిడెడ్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు హేతుబద్ధీకరణ నుంచి మినహాయింపునిచ్చింది. ఇవన్నీ పోగా 2,600 స్కూళ్లున్నాయి. వీటిలో విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటరు పరిధిలో రెండుకు మించి పాఠశాలలుంటే అందులో 80 మంది పిల్లలున్న స్కూలుని మోడల్‌గా గుర్తించి, రెండో పాఠశాలలను మూసివేస్తారు. అందులో పిల్లలను మోడల్ స్కూల్‌కు బదలాయిస్తారు. ఇలా జిల్లాలో 162 ప్రైమరీ స్కూళ్లు మూతపడనున్నాయి. వీటితో పాటు కిలోమీటరు లోపు, 80 మందికిపైగా విద్యార్థులున్న 142 పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చనున్నారు. అలాగే 80 కంటే తక్కువ హాజరున్న బడులను పాజిటివ్ కన్సాలిడేషన్ స్కూళ్లుగా నడపనున్నారు. వీటిలో 30 మంది పిల్లలకు ఒకరు, 60 మంది ఉంటే ఇద్దరు చొప్పున టీచర్లను కేటాయిస్తారు. ప్రైమరీ మోడల్ స్కూల్లో మాత్రం 20 మందికి ఒకరు చొప్పున 80 మందికి నలుగురు టీచర్లను నియమిస్తారు. 12న విజయవాడలో డీఈఓలతో మంత్రి గంటా భేటీ విజయవాడలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈవోలు, సర్వశిక్షా అభియాన్ పీవోలతో టీచర్ల బదిలీలు, సీనియారిటీ, విద్యార్థుల ఆధార్ సీడింగ్, పాఠశాలల్లో మరుగుదొడ్ల ప్రగతి తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 12న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఒక అభిప్రాయానికొచ్చే దాకా బదిలీలు, మోడల్ స్కూళ్ల హేతుబద్ధీకరణపై స్పష్టత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా మంగళవారం నాటికి ఉన్న ఆదేశాల మేరకు 2013లో బదిలీ అయి రిలీవ్ కాని 33 మంది స్కూల్ అసిస్టెంట్లు, 124 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆయా స్కూళ్లలో బుధవారం చేరాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేని కారణంగా ఆ ప్రక్రియ కూడా వాయిదా పడింది. -
బతుకు చూపించే వాడే బడి పంతులు!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఒకప్పుడు బతకడానికి బడిపంతులు అనేవారని.. అయితే ఈరోజు బతుకు చూపించేవాడు బడిపంతులు అని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నగర శివారులోని ఎంజీఎం ఫంక్షన్ హాలులో ప్రాంతీయ విద్యా సదస్సు మంగళవారం జరిగింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల విద్యాశాఖ, ఎస్ఎస్ఏ అధికారులు, ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు కీలకమన్నారు. కొన్ని చోట్ల ఎక్కువమంది టీచర్లు తక్కువమంది విద్యార్థులు, మరి కొన్నిచోట్ల తక్కువ మంది టీచర్లు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారన్నారు. దీనికి రేషనలైజేషన్ చేపట్టి నిష్పత్తి సమానంగా ఉండేలా చూస్తామని తెలిపారు. అంతేకాని ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తామని జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. ప్రభుత్వ విద్య అమలులో కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని, అలాంటి వృత్తికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి పాఠశాలలోనూ మొక్కలు నాటాలన్నారు. పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ మార్పు టీచర్ల చేతుల్లో ఉందన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల సాధనకు హెచ్ఎంలు ఈసారి బాగా కష్టపడ్డారన్నారు. 93 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషమే అయినా...తక్కిన ఏడు శాతం విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుదామని ప్రశ్నించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని కోరారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు సొంతబడిగా భావించి బాధ్యతగా పని చేయాలన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు మరుగుదొడ్లు కావాలని అడుగుతున్నా పట్టించుకోని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు, హెచ్ఎంలతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ విప్ యామినిబాల, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, పార్థసారథి, ఉన్నం హనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ రమణకుమార్ పాల్గొన్నారు. -
ఇంకా నాన్చుడే
నెల్లూరు(విద్య) : ఊరించి ఊరించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పష్టతలేని నోటిఫికేషన్‌తో అభ్యర్థులు అనేక ఇబ్బందులుపడ్డారు. ఎట్టకేలకు టెట్‌కమ్ టీఆర్టీను నిర్వహించారు. ఫలితాలను విడుదల చేశారు. ఉద్యోగాల భర్తీకోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రోజుకో అనుమానం అభ్యర్థుల్లో తలెత్తుతోంది. టెట్ కమ్ టీఆర్టీలో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను హైదరాబాద్ నుంచి విడుదల చేస్తారని ఊహాగానాలు వాస్తవమయ్యేలా ఉన్నాయి. ఆ జాబితాను అనుసరించి పోస్టులు భర్తీ చేస్తారని చెప్పుకుంటున్నారు. జిల్లా నుంచి రోస్టర్ పాయింట్, మెరిట్ జాబితాను హైదరాబాద్‌కు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు అందుకోవడం ఈ వాదనకు బలం చేకూర్చింది. అలాగైతే జిల్లాస్థాయిలో డీఎస్సీ నిర్వహించడం ఎందుకని విద్యార్థుల్లో ప్రశ్నలు రేగుతున్నాయి. జిల్లాలో రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను సేకరించి జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ చేపట్టి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఈసారి జరిగిన డీఎస్సీలో నియామక ప్రక్రియ ఉంటుందని వస్తున్న ఊహాగానాలతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాస్థాయిలోనే ఎంపికలు జరుగుతుంటే పలువురికి అన్యాయాలు జరిగిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. హైదరాబాద్ స్థాయిలో ఎంపికలు జరిగితే అవకతవకలు జరిగితే తెలిసేదెలా అని అభ్యర్థుల్లో నైరాశ్యం చోటు చేసుకుంటుంది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మాటేమిటి..? : ఈనెల15న కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేసే సమయంలో గంటాపథంగా చెప్పారు. అయితే ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ సైతం విడుదల చేయలేదు. కోర్టు కేసుల నేపథ్యంలో జాప్యం జరుగుతుందని సమాచారం. ఈ క్రమంలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయం అభ్యర్థులను వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన అందరినీ ఒకేచోటకు చేర్చి నియామకపత్రాలు అందజేస్తారా లేదా జిల్లాస్థాయిలోనే పోస్టింగ్ ప్రక్రియ జరుగుతుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది. తర్జనభర్జన...: తాజాగా వెబ్ కౌన్సెలింగ్‌ను తెరపైకి తెచ్చేందుకు అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో ఈప్రయోగం ఫలిస్తుందా? అనే సందేహం లేకపోలేదు. ఈ విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ర్యాంకుల ఆధారంగా ఆన్లైన్లోనే వారికి కావాల్సిన పాఠశాలలను ఎంపిక చేసుకొనేలా అవకాశం ఇస్తారని కూడా ప్రచారంలో ఉంది. దీంతో డీఈఓ కార్యాలయం, జిల్లా ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండానే హైదరాబాద్ నుంచి నియామకాలు చేపట్టాలంటున్నారు. నోటిఫికేషన్ నుంచి అనేక మలుపులు తిరిగినా డీఎస్సీ నియామకాల్లో సైతం పలు ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం గమనార్హం. -
మరోవారం ఉత్కంఠ
అందుబాటులోకి రాని జిల్లాల వారీ వివరాలు సబ్జెక్టుల వారీగా మార్కుల తెలియక అయోమయం డీఎస్సీ అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం విశాఖ ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షా ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. జిల్లాల వారీ ఫలితాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. మార్కులు మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పూర్తిస్థాయిలో ఫలితాలు తెలియడానికి ఈ నెల 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు, రోస్టర్ విధానం, క్వాలిఫై అయిన వారి వివరాలు 9వ తేదీ నాటికి అందిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని 1,056 పోస్టులకుగాను గత నెల 9,10,11 తేదీల్లో జరిగిన డీఎస్సీ పరీక్షలకు 36,490 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందరి మార్కులు కలిపి ప్రకటించడంతో స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, ఎస్జీటీ, పీఈటీ విభాగాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. మార్కులు తెలిసినా పోస్టు వస్తోందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. వెబ్సైట్లో అత్యధికంగా 166 మార్కులు వచ్చినట్టు ప్రకటించినా.. ఆ మార్కులు ఏ సబ్జెక్టుకు సంబంధించినవో ఆ అభ్యర్థికి తప్ప ఎవరికీ తెలియడంలేదు. ఆయా సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు కూడా తెలియడం లేదు. అభ్యర్థుల గందరగోళం: జిల్లాల వారీగా ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తమ మార్కుల వివరాలు చూసుకుంటున్న అభ్యర్థులు, తాము ఏ స్థానంలో ఉన్నామో?, పోస్టు వస్తుందో? రాదో అనే గందరగోళంలో ఉన్నారు. గతంలో వచ్చిన డీఎస్సీ ఫలితాల్లో పూర్తిస్థాయి సమాచారం వెంటనే అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల ఫలితాలు కలిపి ప్రకటించడంతో వెబ్సైట్లో మార్కులు చూసి కూడా అంచనాకు రాలేకపోతున్నారు. రిజర్వేషన్ ఉన్నవారు కటాఫ్ ఎంత ఉంటుందని తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఈ నెల 9వ తేదీ వరకు అభ్యర్థులకు తప్పదు. -
నవ్యాంధ్ర నిర్మాణానికి పునరంకితమవుదాం
నవనిర్మాణ దీక్షలో ఆర్థిక మంత్రి యనమల సాక్షి, విశాఖపట్నం : నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ర్ట విభజన చేయడంతోపాటు విభజన చట్టంలో కూడా ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాకుండా తీరని రెవెన్యూలోటుతో పాటు భారీ అప్పులను అంటగట్టారన్నారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో అందరం సమష్టిగా శ్రమించి నవ్యాంధ్ర నిర్మించుకుందామన్నారు. విభజన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం స్థానిక గవర్నర్ బంగ్లా నుంచి ఏయూ వరకు నవ నిర్మాణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏయూ కాన్వొకేషన్ హాలులో జరిగిన సమావేశంలో సభికులతో నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ వర్గానికి లోటు రానీయకుండా చేస్తున్నామన్నారు. అర్హులందరికీ రెండు లక్షల పింఛన్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించి పేదరికాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని త్వరలో తరలిస్తామన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోయే తమకు పవిత్ర గ్రంథమని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే బెల్టుషాపులు రద్దు చేశామని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచామని, రైతు రుణమాఫీ చేశామని, రేపటి నుంచి డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, ఎస్పీ కోయ ప్రవీణ్, డీఐజీ రవిచంద్ర, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు, వుడా వీసీ బాబూరావు నాయుడు, జేసీలు జె.నివాస్, డీవీ రెడ్డి, డీఆర్వో కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
టీడీపీకి పూర్వ వైభవం
మినీ మహానాడులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా కడప రూరల్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక మేడా కన్వర్షన్లో నిర్వహించిన మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. కార్యకర్తలు సూచించిన పనులను అధికారులు చేయాలన్నారు. మినీ మహానాడులో ఆయా నియోజకవర్గాల వారీగా వచ్చిన సమస్యల పరిష్కారం గురించి హైదరాబాద్‌లో జరిగే మహానాడులో చర్చిస్తామన్నారు. విభజన కారణంగా లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. కడప నగరంలో ఒక ఎకరా స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) మాట్లాడుతూ జిల్లాలో పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి చేయూత నివ్వాలన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు సుధాకర్ యాదవ్, మాజీ ఎంపీ గునిపాటి రామయ్య, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, రమేష్‌కుమార్‌రెడ్డి, విజయమ్మ తదితరులు మాట్లాడుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగే మహానాడులో జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలను అధికారులు గౌరవించాలన్నారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, జిల్లా పేరును గతంలోలా ‘కడప’గానే ఉంచాలని, మైదుకూరులో కేపీ ఉల్లి ఎగుమతి కేంద్రం ఏర్పాటు, చెన్నూరు చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించాలని, రాజంపేటలో ఆల్సిన్ ఫ్యాక్టరీని తెరిపించాలని, కమలాపురంలో డ్రైనేజీ వ్యవస్థ, రైల్వేకోడూరులో మినీ ప్రాజెక్టుల నిర్మాణం, బద్వేలులో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు పలు ప్రతిపాదనలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బహ్మయ్య, గోవర్దన్‌రెడ్డి, ఎద్దుల సుబ్బరాయుడు, హరిప్రసాద్, దుర్గాప్రసాద్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మంత్రి మాట ఫెయిల్
►ఫెయిలైన విద్యార్థులకు మొక్కుబడి తరగతులు ►మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ►90 శాతం కాలేజీల్లో ప్రారంభం కాని శిక్షణ ►25 నుంచి ఇన్స్టంట్ పరీక్షలు 3,814 మొదటి సంవత్సరం ఫెయిలైన విద్యార్థులు 1,972 ద్వితీయ సంవత్సరం ఫెయిలైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు కల్పిస్తాం. - గత నెల 28న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటన వాస్తవ పరిస్థితి ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మౌఖికంగా ఆదేశించినా.. లిఖితపూర్వక ఉత్తర్వులు లేకపోవడంతో జిల్లాలోని 90 శాతం కళాశాలల్లో ప్రత్యేక తరగతులు ఊసే కరువైంది. ఈనెల 25 నుంచి ఇన్స్టంట్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా మంత్రి చేసిన ప్రకటన ఎందుకూ కొరగాకుండా పోయింది. కర్నూలు(జిల్లా పరిషత్) : సాక్షాత్తూ మంత్రి ప్రకటనకే విలువ లేకుండాపోయింది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివి ఫెయిలైన విద్యార్థులకు కనీసం మూడు వారాల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. నోటి మాటే తప్పితే లిఖిత పూర్వక ఆదేశాలు లేకపోవడంతో.. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనరేట్ కూడా మౌఖిక ఆదేశాలతో సరిపెట్టింది. వేసవి సెలవుల్లో రెగ్యులర్ లెక్చరర్లు గైర్హాజరవుతారని.. కాంట్రాక్టు లెక్చరర్లు తప్పనిసరిగా తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో రెన్యూవల్ చేయబోమని సైతం స్పష్టం చేశారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొన్ని కళాశాలల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తుండగా.. తక్కిన కళాశాలలు ఆ ఆదేశాన్ని పెడచెవిన పెట్టాయి. మరో ఐదు రోజుల్లో ఇన్స్టంట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి హామీ చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం 35,602 మందికి గాను 20,661 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా 7,309 మంది విద్యార్థుల్లో 3,495 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 30,270 మందికి గాను 20,999 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 41 ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి 6,317 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,345 మంది పాసయ్యారు. ఇదిలాఉంటే వేసవి సెలవుల్లో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు వారి కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినా.. బస్సు పాసులు చెల్లవని ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో సొంత ఖర్చులతో కళాశాలలకు చేరుకునేందుకు విద్యార్థులు ముందుకు రాలేకపోయారు. మొత్తంగా మంత్రి ప్రకటన అభాసుపాలైంది. -
ఎన్నికల హామీలు నెరవేరుస్తాం
మంత్రి గంటా శ్రీనివాసరావు పెనుకొండ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమందేపల్లి గ్రామంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల, స్త్రీ శక్తి భవన్, ఉర్దూ పాఠశాల, వాణిజ్య సముదాయాలను ఆయన మంత్రి పరిటాల సునీతతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో మంత్రి గంటా మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సోమందేపల్లి, పెనుకొండ ప్రాంతాలలో పాలిటెక్నిక్ కళాశాలతో పాటు సోమందేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించి విద్యార్థులకు బాసటగా నిలుస్తామన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి, మంత్రి పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు ప్రసంగించారు. -
మళ్లీ మనమే టాప్
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల ► బాలికలదే హవా ► వరుసగా 11 సార్లు మొదటిస్థానం ► జిల్లాలో 76 శాతం ఉత్తీర్ణత లబ్బీపేట : జూనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు తమ హవా కొనసాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పదేళ్లు అగ్రస్థానంలో ఉన్న జిల్లా విద్యార్థులు.. నవ్యాంధ్రలోను మొదటి స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియెట్‌లో జిల్లాకు ఎదురులేదని నిరూపించారు. విజయవాడ విద్యలవాడగా తన పేరు నిలబెట్టుకుంటూ విజయపరంపర కొనసాగి స్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంట ర్మీడియెట్ మొదటి సంవత్సర ఫలితాలను తొలిసారిగా నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నూతన ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తన అగ్రస్థానాన్ని ఈసారి కూడా నిలబెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 62.98 శాతం ఉండగా దాదాపు 13 శాతం ఎక్కువగా అంటే 76 శాతం ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఇది గత ఏడాది కంటే రెండు శాతం అధికం కావడం విశేషం. గత సంవత్సరం జిల్లా విద్యార్థులు 74 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఈ సంవత్సరం 63,164 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 47,989 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 33,702 మంది బాలురు పరీక్షలు రాయగా 25,039 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత 74 శాతంగా ఉంది. బాలికలు 29,462 మంది పరీక్షలు రాయగా 22,950 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత 78 శాతంగా ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం గత ఏడాది 75 శాతం ఉండగా, ఈ ఏడాది 78 శాతానికి పెరగడం విశేషం. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు రాసిన 1,126 మందిలో 544 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత 48 శాతంగా ఉంది. కాగా గత ఏడాది ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత 55 శాతం ఉండగా, ఈ ఏడాది ఏడు శాతం తగ్గింది. జిల్లాలో టాపర్లు వీరే ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీ టాప్ ర్యాంకులు జిల్లాకు రాకపోయినప్పటికీ ద్వితీయ స్థానంలో ఎక్కువ మంది నిలిచారు. వారిలో ఎంపీసీలో ఎం.శర్వాణి 466/470 సాధించి జిల్లాలో టాపర్‌గా నిలవగా, చీమకుర్తి సాయి వరుణ్, వెనిగళ్ల మౌనిక, గుంటూరు సౌమ్య, మద్దాల నాగసాయి శ్రీ హరీష్‌లు 464/470 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బైపీసీలో మహ్మద్ అర్బాజ్, మర్రెడ్డి మేఘనారెడ్డి, కోడూరు సాయి యామిని, పెద్దిరెడ్డి గ్రీష్మబిందు, కూసమ్ వెంకట రాహుల్‌రెడ్డి, సయ్యద్ ఆయేషా, పి.లక్ష్మీ పూజిత, కొట్టా గాయత్రి సాయి గీతాంజలి 436 మార్కులతో జిల్లాలో టాపర్లుగా నిలిచారు. అదే విధంగా పి.చాంద్‌బాషా, బొడ్డపాటి దేవనందినిలు 435 మార్కులు సాధించగా, ఆచంట శ్రీలాస్య, శ్రీ తేజకృష్ణలు 434 మార్కులు సాధించారు. కాగా శ్రీ చైతన్య విద్యార్థులు ఎంపీసీలో ఒకరు 466 మార్కులు సాధించగా, 11 మంది 465 మార్కులు, 45 మంది 464 మార్కులు, 530 మంది 460 మార్కులు సాధించారు. బైపీసీలో 436 మార్కులు ఇద్దరు సాధించగా, 435 మార్కులు 12 మంది, 434 మార్కులు 44 మంది, 428 మార్కులు 428 మంది సాధించి సత్తా చాటారు. కాగా గడిచిన ఐదేళ్లలో జిల్లాలో అత్యధికంగా 76 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. ప్రభుత్వ కాలేజీల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైతం ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది 37.8 శాతం ఉండగా, ఈ ఏడాది 45 శాతం ఉత్తీర్ణులయ్యారు. అయితే 2013లో జిల్లాలో ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత శాతం 46.1గా ఉంది. -
రూ.1000 కోట్ల భూ దందా!
► విద్యాసంస్థల స్థాపన పేరుతో జగ్గీ వాసుదేవ్‌కు నజరానా ► కారుచౌకగా త్రిలోచనాపురం అటవీ భూముల విక్రయానికి సిద్ధం ► ఇషా ఫౌండేషన్‌కు కట్టబెట్టేందుకు యత్నాలు ► ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తున్న మంత్రి గంటా ► కేంద్ర ప్రభుత్వ ఆమోదం రావడమే తరువాయి నగర సమీపంలో రూ.1000 కోట్ల భూదందాకు రంగం సిద్ధమైంది. విద్యాసంస్థల స్థాపన పేరుతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు అటవీ భూమిని ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ప్రభుత్వ పెద్దలు దగ్గరుండి మరీ ఈ తంతు నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : వెయ్యి కోట్ల రూపాయల విలువైన అటవీ భూమిని కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు వ్యూహం పన్నారు. ఇందుకు విద్యా సంస్థల స్థాపన పేరు సాకుగా చెబుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం అటవీ భూమిని ఇందుకు ఎంచుకున్నారు. చదునైన భూమి కావడం, పచ్చని చెట్ల మధ్య ఉండడం, చల్లని వాతావరణానికి అనుకూలమైన ప్రాంతం కావడంతో ఈ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. నాలుగు రోజుల కిందట పరిశీలన... త్రిలోచనాపురంలోని అటవీ భూములను ఈ నెల 15న మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ బాబు.ఎ, అటవీ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్‌తో పాటు పలువురు రెవెన్యూ, అటవీ అధికారులు, యోగా గురువు జగ్గీ వాసుదేవ్ కలిసి పరిశీలించారు. వాసుదేవ్ ఈ భూమిని తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు గంటా ప్రకటించారు. ఆయన ఇషా ఫౌండేషన్ పేరుతో తమిళనాడులోని కోయంబత్తూరులో పలు విద్యా సంస్థలు నడుపుతున్నారు. విద్యా సంస్థలు కొత్త రాజధాని ప్రాంతానికి కావాలని, అందుకు వాసుదేవ్ ముందుకు వచ్చారని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే విజయవాడ పరిసరాల్లో ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీలు ఉన్నాయి. ఇంత మొత్తంలో స్థలం ఇస్తే కాలేజీలు పెట్టేందుకు ముందుకు వచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. పైగా ఇషా ఫౌండేషన్ వారు పెడుతున్నది కొత్త కోర్సులేమీ కావు. లా కాలేజీ, ఎంబీఏ, సీఏ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు స్వయంగా వాసుదేవ్ చెప్పుకొన్నారు. 500 ఎకరాలు అప్పగించేందుకు ప్రతిపాదనలు... ఇక్కడ చదునైన భూమి 400 ఎకరాలు ఉంది. మరో 100 ఎకరాలు కొండ ప్రాంత భూమి కలిపి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రి గంటా శ్రీనివాసరావు అటవీ భూమిని పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయించే పనిలో ఉండడంతో ఎలాగైనా వాసుదేవ్‌కు ఈ భూమిని అప్పగించేందుకు పావులు కదుపుతున్నారని అర్థమవుతోంది. అటవీ భూముల్లో అనుమతుల్లేకుండా చెట్లు కొట్టకూడదు. త్రిలోచనాపురం అటవీ ప్రాంతంలో భూమిని మాత్రం పూర్తిస్థాయిలో చెట్లు కొట్టి చదును చేశారు. ఎందుకు ఇలా జరిగిందంటే అటవీ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు. ఎకరా రూ.2 కోట్లు... ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఇబ్రహీంపట్నానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉంది. ఇంత విలువైన భూమిని ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు ఇచ్చేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇందులో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనేది సుస్పష్టమని పలువురు పేర్కొంటున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు -డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు త్రిలోచనాపురంలోని అటవీ భూములను ప్రైవేటు వారికి ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారనేది ఇంకా ఫైనల్ కాలేదని డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు చెప్పారు. ఇషా ఫౌండేషన్‌కు అటవీ భూములు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండడాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. మంత్రి, ఇతర అధికారులు వచ్చి చూసి వెళ్లారని తెలిపారు. అటవీ భూములు తీసుకోవాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. -
ప్రజలతో మమేకం
♦ తాళ్లపాలెంలో లోక్‌సభ స్పీకర్ ♦ సుమిత్రా మహాజన్ పర్యటన ♦ రూ.53 లక్షల పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపన ♦ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగులో ప్రసంగం అందరికీ నమస్కారం అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం ఆంగ్లంలో ఆమె ప్రసంగాన్ని విశాఖ ఎంపీ హరిబాబు తెలుగులో అనువదించారు. సుమారు పావుగంట పాటు సాగిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములయి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. స్పీకర్ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనకాపల్లికి చెందిన బృందాలు ప్రదర్శించిన భరత నాట్యం అలరించింది. తప్పెటగుళ్లు ఆకట్టుకున్నాయి. మండల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు సభకు హాజరయ్యారు. కశింకోట : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మండలంలోని తాళ్లపాలెంలో వివిధ గ్రామా ల నుంచి వచ్చిన ప్రజలతో గురువారం మమేకమయ్యారు. వారి కష్ట,సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొప్పాక లక్క బొమ్మల ప్రదర్శనను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. పంచదార చిలుకలను పరిశీలించి పరవశించిపోయారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి పుస్తకంలో సంతకం చేశారు. ఉచిత వైద్య శిబిరం, నేత్ర వైద్య శిబిరాలు, వ్యవసాయ పరికరాల ప్రదర్శన, ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్య బోధనకు వినియోగించే ఉపకరణాల ప్రదర్శన పరిశీలించారు. డ్వాక్రా, స్వయంసహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు దుశ్శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. బీజేపీ కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పొన్నగంటి అప్పారావు దంపతుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండలంలోని తాళ్లపాలెం పంచాయతీని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు దత్తత తీసుకున్నారు. ఆయన ఆహ్వానం మేరకు లోక్సభస్పీకర్ గురువారం ఈ గ్రామంలో పర్యటించారు. రామాలయం వద్ద రూ.14.70 లక్షలతో మురికి కాలువలతో నిర్మించిన సిమెంటు రోడ్డును ప్రారంభించారు. రూ.15 లక్షలతో తాళ్లపాలెంలోను, రూ. ఐదేసి లక్షలతో లాలంకొత్తూరు, రామన్నపాలెం, అచ్యుతాపురం, జి.భీమవరం గ్రామాల్లోను, రూ. 3 లక్షలతో తేగాడలో నిర్మించనున్న సామాజిక భవనాలకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి సభా వేదిక వరకు స్పీకర్‌కు విద్యార్థులు, మహిళలు గులాబీ పూలతో ఘనంగా స్వాగతం పరికారు. సభా కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ యువరాజ్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలా గోవిందసత్యనారాయణ, పంచకర్ల రమేష్‌బాబు తదితరులు ఆమెను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. మంత్రి గంటా ఆమెకు బెల్లం దిమ్మను బహూకరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ భవాని, జెడ్పీటీసీ సభ్యురాలు మలసాల ధనమ్మ, ఎంపీపీ పెంటకోట సుబ్బలక్ష్మి, సర్పంచ్ చెవ్వేటి గోవిందమ్మ, టీడీపీ నాయకుడు కాయల మురళీధర్, బీజేపీ నాయకుడు పొన్నగంటి అప్పారావు పాల్గొన్నారు. -
చినబాబు పిలిచారని..
హడావుడిగా హైదరాబాద్ వెళ్లొచ్చిన ‘గంటా’ విశాఖపట్నం: నారా లోకేష్ సమావేశానికి హాజరుకావాలని పిలుపు రావడంతో మంత్రి గంటా ఆగమేఘాలపై శనివారం రాజధానికి వెళ్లి రావడంతో చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో లోకేష్ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అంశంపై మంత్రులు, ఇతర ముఖ్యనేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు హాజరయ్యారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడి నిశ్చితార్థ వేడుకల్లో బిజిగా ఉండడంతో హాజరు కాలేదు. విజయనగరం జిల్లా కొండపల్లి మండలంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో బిజిబిజీగా ఉన్న మంత్రి గంటా మాత్రం ఫోన్‌కాల్ రాగానే హైదరాబాద్ పయనమయ్యారు. ప్రత్యేక కేబినెట్ సమావేశంలో పాల్గొని సాయంత్రం తిరిగి విశాఖకు చేరుకున్నారు. తర్వాత ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి విశాఖ ఉత్సవాల్లో పాల్గొన్నారు. విషయం ఏంటని ఆరా తీయగా స్మార్ట్ విలేజ్ పథకంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం మంత్రులతో చినబాబు సమీక్షించారని సమాచారం. ఏ హోదాలో చినబాబు కేబినెట్ మంత్రులతో ఈ భేటీ నిర్వహించారో వెళ్లొచ్చిన మంత్రులకే తెలియాలని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
పంతం నెగ్గించుకున్న గంటా
వచ్చిన కొద్దిరోజులకే అనకాపల్లి ఆర్డీవో బదిలీ వుడా కార్యదర్శి.. ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకూ.. పోర్టు ట్రస్ట్ డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌కు స్థానచలం విశాఖపట్నం : జిల్లాకు చెందిన పలువురు అధికారులను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికారిక సంస్థ(సీఆర్డీఏ)కు డిప్యూటీ కలెక్టర్లుగా బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 36 మందికి స్థానచలం కలిగించగా, వారిలో జిల్లాకు చెందిన నలుగురున్నారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన అనకాపల్లి ఆర్డీవో బి.పద్మావతికి కూడా ఈ బదిలీల్లో వేటు పడింది. అనకాపల్లి ఆర్డీవోగా ఆమె నియామకాన్ని రాష్ర్ట మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వ్యతిరేకించారు. అయినప్పటికీ మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చక్రం తిప్పి ఆమెను జిల్లాకు రప్పించారు. నాటి బదిలీల్లో పట్టుబట్టి మరీ పద్మావతిని అనకాపల్లి ఆర్డీవోగా పోస్టింగ్ ఇప్పించారు. నాటి నుంచి మంత్రి గంటాతో పాటు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్‌లు ఈమె నియామకాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఏదోవిధంగా ఆమెను సాగనంపేందుకు మంత్రి గంటా విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు తనపంతం నెగ్గించుకున్నారు. నవంబర్‌లో జరిగిన సాధారణ బదిలీల్లో ఇక్కడకు వచ్చిన ఆమె అనతి కాలంలోనే బదిలీ వేటుకు గురయ్యారు. కాగా వుడా కార్యదర్శిగా పనిచేస్తున్న జీసీ కిషోర్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూ టీవ్ డెరైక్టర్ ఎఎన్ సలీం ఖాన్, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.పద్మలతలు సీఆర్డీఏకు బదిలీ అయ్యారు. అదే విధంగా విశాఖపట్నం సెంట్రల్ మెడికల్ స్టోర్ ఇన్చార్జిగా అనకాపల్లి యూఎఫ్‌డబ్ల్యూసీ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్.ఎఫ్.రవీంద్రను నియమిస్తూ వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.